Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సంజయ్‌ రౌత్‌కు ఈడీ షాక్‌

11కోట్ల ఆస్తుల అటాచ్‌
భయపడేదిలేదన్న శివసేన ఎంపీ

ముంబై: అధికారాన్ని ఉపయోగించుకుని కేంద్ర ఏజెన్సీల ద్వారా ప్రతిపక్ష నాయకులను వేదించడాన్ని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కొనసాగిస్తోంది. తాజాగా శివసేన ఎంపీ, సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు షాకిచ్చారు. ఆమె భార్యకు చెందిన దాదాపు 11 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. అయితే ఈ 11 కోట్లలో 9 కోట్లు రౌత్‌ కుమారుడు ప్రవీణ్‌ రౌత్‌కు సంబంధించినవి కాగా, 2 కోట్లు సంజయ్‌ రౌత్‌ భార్యకు సంబంధించినవి. వెయ్యి కోట్ల పట్రాచాల్‌ భూ కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రౌత్‌కు సంబంధించిన అలీబాగ్‌ ప్లాట్‌, ముంబైలోని ఒక్కొక్క ఫ్లాట్‌ను అటాచ్‌ చేసింది. ఇక ఈడీ తీసుకున్న ఈ నిర్ణయానికి కొన్ని గంటల ముందే శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి లేఖ రాశారు. వెయ్యి కోట్ల పట్రాచాల్‌ భూ అవినీతికి సంబంధించిన విషయంలో ఈడీ తన అధికారాలను దుర్వినియోగం చేస్తోందని ఆయన ఉప రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. ఈడీతో సహా కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రతిపక్షాలను లక్ష్యంగా చేస్తున్నాయని ఆ ఫిర్యాదులో రౌత్‌ పేర్కొన్నారు.
ఆస్తులను అటాచ్‌ చేస్తున్నట్లు ఈడీ చేసిన ప్రకటనపై రౌత్‌ ఘాటుగా స్పందించారు. తానేమీ భయపడటం లేదని స్పష్టం చేశారు. తన ఆస్తులను సీజ్‌ చేసినా, షూట్‌ చేసినా, జైలుకు పంపినా.. తాను మాత్రం బెదిరేది లేదని ప్రకటించారు. తాను బాలాసాహెబ్‌ అనుచరుడినని, శివసైనికుడినని చెప్పుకొచ్చారు. తాను ఎంత మాత్రమూ మౌనంగా ఉండనని, పోరాడుతూనే వుంటానని ప్రకటించారు. కేంద్రం ఇప్పుడు తెగ ఎగురుతోందని, ఎగరనివ్వండని, ఎప్పుడో ఒకప్పుడు సత్యం మాత్రం బయటికి వచ్చి తీరుతుందని సంజయ్‌ రౌత్‌ అన్నారు.
సత్యేంద్ర జైన్‌ ఆస్తులు కూడా…
మనీలాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దిల్లీ మంత్రి సత్యేంద్రజైన్‌కు సంబంధించిన రూ.4.81 కోట్ల ఆస్తిని జప్తు చేసినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ మంగళవారం తెలిపింది. సత్యేంద్రజైన్‌, కేజ్రీవాల్‌ ప్రభుత్వంలో ఆరోగ్యం, విద్యుత్తు, హోం, పీడబ్ల్యూడీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి, ఇరిగేషన్‌, నీటిపారుదల శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. షాకూర్‌బస్తీ నుంచి గెలిచిన ఆప్‌ ఎమ్మెల్యే సత్యేంద్రజైన్‌ను 2018లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి ప్రశ్నించింది. ‘అకిన్‌చాన్‌ డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఇండో మెటల్‌ ఇంపెక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, పర్యాస్‌ ఇన్ఫోసొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, మాంగ్లాయతన్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, జేజే ఐడియల్‌ ఎస్టేట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, వైభవ్‌ జైన్‌ భార్య స్వాతి జైన్‌, అజిత్‌ ప్రసాద్‌ జైన్‌ భార్య సుశీల జైన్‌, సునీల్‌ జైన్‌ భార్య ఇందుజైన్‌లకు సంబంధించిన రూ.4.81 కోట్ల స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది. సత్యేంద్రకుమార్‌ 2015`16 కాలంలో మంత్రిగా ఉండగా, పైన ఉదహరించిన కంపెనీలకు షెల్‌కంపెనీల ద్వారా రూ.4.81 కోట్లు వచ్చినట్టు ఈడీ గుర్తించింది. అలా వచ్చిన డబ్బును దిల్లీ చుట్టుపక్కల ప్రత్యక్షంగా స్థలాల కొనుగోలు, వ్యవసాయ భూముల కొనుగోలు చేసినటు తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img