Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

సంప్రదాయ ఔషధాల కోసం ‘ఆయుష్‌ మార్కు’

వైద్య చికిత్సల కోసం ప్రత్యేక వీసా
ప్రధాని మోదీ
గాంధీనగర్‌ (గుజరాత్‌) : సంప్రదాయ ఔషధ పరిశ్రమను ప్రోత్సహించేందుకు భారత్‌ త్వరలో ‘ఆయుష్‌ మార్కు’ను ప్రవేశపెట్టనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం తెలిపారు. ‘హీల్‌ ఇన్‌ ఇండియా’ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ ఆయుష్‌ చికిత్సలను పొందేందుకు దేశానికి రావాలనుకుంటున్న వారి కోసం ఒక ప్రత్యేక వీసా కేటగిరిని కూడా ప్రకటించారు. ఇక్కడ మహాత్మా మందిర్‌ వద్ద గ్లోబల్‌ ఆయుష్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ మూడు రోజుల సదస్సును ప్రారంభించిన తర్వాత మోదీ ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి మారిషస్‌ ప్రధాన మంత్రి ప్రవింద్‌ జుగ్నాథ్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్‌ గుబ్రెయెసెస్‌ కూడా హాజరయ్యారు. ఆయుష్‌ అంటే ఆయుర్వేద, యోగా, నాచురోపతి, యునానీ, సిద్ధ, హోమియోపతి. భారత్‌లో ఈ ప్రత్యామ్నాయ ఔషధాలకు ఒక మంత్రిత్వ శాఖ ఉంది. ప్రధాని మాట్లాడుతూ ‘దేశంలో తయారైన ఆయుష్‌ ఉత్పత్తులకు ప్రామాణికతను ఇచ్చే ‘ఆయుష్‌ మార్కు’ను భారత్‌ త్వరలో ప్రవేశపెట్టనున్నది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిశీలించిన ఉత్పత్తులకు మార్కును ఇస్తుంది. నాణ్యమైన ఆయుష్‌ ఉత్పత్తుల కొనుగోలు విషయంలో ప్రపంచ ప్రజలకు ఇది విశ్వాసం ఇస్తుంది’ అని అన్నారు. ’సంప్రదాయ ఔషధాలు కేరళలో పర్యాటకాన్ని పెంచాయి. ఈ శక్తి భారతదేశంలో ప్రతి మూలలో ఉంది’ అని తెలిపారు. ‘హీల్‌ ఇన్‌ ఇండియా’ ఈ దశాబ్దంలో ఒక పెద్ద బ్రాండ్‌గా మారవచ్చని అన్నారు. ఆయుర్వేద, యునానీ, సిద్ధ తదితరాలపై ఆధారపడిన వెల్‌నెస్‌ కేంద్రాలు బాగా ప్రాచుర్యం పొందాయి’ అని అన్నారు. ఈ ప్రత్యేక ‘ఆయుష్‌ వీసా’ భారత్‌లో సంప్రదాయ చికిత్సలు కోరుకునే వారికి సహాయపడుతుందని ఆయన చెప్పారు. దేశం ఆయుష్‌ ఔషధాలు, సప్లిమెంట్స్‌, సౌందర్య వస్తువుల ఉత్పత్తిలో అపూర్వమైన వృద్ధి సాధించడంతో ఆయుష్‌ రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణలు అపరిమితంగా ఉన్నాయని ప్రధాన మంత్రి అన్నారు. ‘2014కి ముందు 3 బిలియన్‌ డాలర్ల కంటే తక్కువ కలిగి ఉన్న ఆయుష్‌ రంగం ఈరోజు 18 బిలియన్‌ డాలర్లను దాటింది’ అని తెలిపారు. గొలుసు వ్యవస్థ నిర్వహణ, ఆయుష్‌ ఆధారిత డయాగ్నోస్టిక్‌ టూల్స్‌, టెలి మెడిసిన్‌లో ఆవిష్కరణలు, పెట్టుబడులకు కూడా అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఆయుష్‌ ఉత్పత్తుల తయారీ కంపెనీలతో రైతులను అనుసంధానించేందుకు ఆయుష్‌ ఇ`పోర్టల్‌ విస్తరణ, ఆధునికీకరణపై ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. రైతుల ఆదాయం పెంచడానికి ఔషధ మొక్కలు మంచి మూలం అని ప్రధాని మోదీ అన్నారు. గత వారం ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రవేశపెట్టిన కొత్త కేటగిరీ ‘ఆయుష్‌ ఆహార్‌’ మూలికా పోషక పదార్ధాల ఉత్పత్తిదారులకు సహాయపడుతుందని, ఇటీవల ఏర్పాటయిన ఆయుష్‌ ఎగుమతి ప్రోత్సాహక మండలి ఎగుమతులను ప్రోత్సహించడంతోపాటు విదేశీ మార్కెట్‌లను కనుగొనడంలో సహాయపడుతుందని తెలిపారు. కోవిడ్‌-19 మహమ్మారి పసుపు ఎగుమతిలో పెరుగుదలకు దారితీసింది. ఇది రోగనిరోధక శక్తిని పెంచేదిగా పరిగణించబడుతుందని అన్నారు. అదే సమయంలో ఆధునిక ఔషధ కంపెనీలు చాలా తక్కువ సమయంలో భారత్‌లో కోవిడ్‌-19 టీకాలను అభివృద్ధి చేశాయి. ‘సరైన సమయంలో పెట్టుబడిని పొందినప్పుడు అవి ఎంత అద్భుతంగా ఉన్నాయో’ అని అన్నారు. ‘ఇంత త్వరగా మనం మేడ్‌ ఇన్‌ ఇండియా కరోనా టీకాను అభివృద్ధి చేయగలమని ఎవరు ఊహించగలరు?. ఆవిష్కరణ, పెట్టుబడి ఏ రంగంలోనైనా సామర్థ్యాలను పెంచుతాయి. ఆయుష్‌ రంగంలో కూడా పెట్టుబడులను పెంచడానికి సమయం ఆసన్నమైంది. ఈ శిఖరాగ్ర సమావేశం ఇదే అద్భుతమైన ప్రయోగం’ అని మోదీ తెలిపారు.
‘అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు…?’ : టెడ్రోస్‌
గుజరాత్‌ పర్యటనలో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అందరినీ ఆశ్చర్యపరిచారు. జామ్‌ నగర్‌లో ఆరోగ్య సంస్థకు చెందిన సంప్రదాయ వైద్య అంతర్జాతీయ కేంద్ర భవనం ప్రారంభ సమయంలో ఆయన గుజరాతీలో మాట్లాడారు. తన ప్రసంగాన్ని ప్రారంభించే ముందు టెడ్రోస్‌ అక్కడ హాజరైన వారందరికీ రెండు చేతులు జోడిరచి నమస్కారం పెట్టి పలకరించారు. ‘అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు…?’ అంటూ గుజరాతీ భాషలో మాట్లాడి ఆకట్టుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img