Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సభకు రాకుంటే పింఛన్లు కట్‌

. తీసుకొచ్చిన వాళ్లు… తీసుకెళ్లాలిగా..
. ప్రయాణ ఇక్కట్లపై మహిళల ఆగ్రహం

విశాలాంధ్ర బ్యూరో-విశాఖపట్నం: ‘ప్రధాని మోదీ, సీఎం జగన్‌ సభకు వచ్చాం. ఉదయం ఐదు గంటలకే వలంటీర్లు వీధిల్లోకి వచ్చి సభకు రాకపోతే ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలు రద్దయిపోతాయి, పింఛన్లు, ఆసరా, ఇతర సంక్షేమ పథకాలన్నీ ఆపేస్తారంటూ మమ్మల్ని తీసుకువచ్చారు. ఉదయం 7 గంటలకే ఏయూ గ్రౌండ్‌కు చేరుకున్నాం. అన్నీ శ్రద్ధగా విని, మధ్యాహ్నం ఒంటిగంటకు రోడ్డు మీదకు వచ్చాం. మమ్మల్ని తీసుకొచ్చిన బస్సులు కానరాకపోవడంతో దిక్కుతోచక రోడ్లపైనే కూర్చున్నాం. ట్రాఫిక్‌ క్లియర్‌ అయితే ఇళ్లకు ఆటో లోనో, బస్సుల్లోనూ వెళ్తాం’ అంటూ శనివారం మోదీ సభకు వచ్చిన మహిళలు తమ గోడును మీడియా ప్రతినిధుల ముందు వెళ్లబోసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం మోదీ సభ కోసం భారీగా జన సమీకరణకు నిర్ణయించింది. విశాఖలో ఉన్న 98 వార్డుల నుంచి లక్షమందిని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామీణ ప్రాంతం నుంచి మరో లక్ష మందిని, పక్క జిల్లాల నుంచి మరో లక్ష మందిని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ మోదీ సభకు మొత్తం ఓ లక్షన్నర జనాభా హాజరైనట్లు తెలుస్తోంది. అయితే సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, ఆర్పీలకు గ్రేటర్‌ విశాఖలో జన సమీకరణ బాధ్యత అప్పగించారు.
నగరంలో 800 బస్సులు, గ్రామీణ ప్రాంతం నుంచి మరో 800 బస్సులతో ఈ సభకు అధికంగా మహిళలను తరలించారు. అయితే అనేక వార్డుల్లో సభకు వచ్చేటప్పుడు రవాణా సౌకర్యం కల్పించిన కార్యకర్తలు, వలంటీర్లు తిరుగు ప్రయాణంపై శ్రద్ధ చూపకపోవడంతో మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏయూ గ్రౌండ్స్‌ సభ నుంచి ఇటు మద్దిలపాలెం వైపు వచ్చే వారందరికీ వాహనాలు దాదాపు కిలోమీటర్‌ దూరంలో కానరాకపోవడంతో వృద్ధులు, చిన్నపిల్లలతో వచ్చిన మహిళలు ఎలా వెళ్లాలో తెలియక నరకయాతన పడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img