Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సమస్యల ప్రస్తావనేది?

నవరత్నాల గొప్పలు
సీఎం జగన్‌పై పొగడ్తల వర్షం
అభివృద్ధి ఊసే లేదు

చంద్రబాబును దూషించడంలో నేతల పోటీ
మీడియానూ వదలని నాయకులు
ముగిసిన వైసీపీ ప్లీనరీ సమావేశాలు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: వైసీపీ ప్లీనరీలో ప్రజా సమస్యల ప్రస్తావన కనిపించలేదు. సీఎం జగన్‌ను ప్రశంసలతో ముంచెత్తడం, విపక్ష నేత చంద్రబాబు, మీడియాపై దుమ్మెత్తిపోయడమే లక్ష్యంగా ప్లీనరీ సాగింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా రెండు రోజులు అట్టహాసంగా నిర్వహించిన వైసీపీ ప్లీనరీ శనివారం ముగిసింది. ప్రజలు ఎదుర్కొంటున్న ఏ ఒక్క సమస్యా ప్లీనరీలో ప్రస్తావనకు నోచుకోలేదు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలు వివిధ అంశాలపై చేసిన ప్రసంగాలు, తీర్మానాలపై జరిగిన చర్చల్లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని ఆకాశానికి ఎత్తారు. వీరుడు, శూరుడు అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. ఇందుకోసం నాయకులు పోటీపడ్డారు. ప్రజా సమస్యల జోలికి వెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు. చంద్రబాబుతో పాటు ముగ్గురు మీడియా అధిపతులను కలిపి దుష్టచతుష్టయంగా చిత్రీకరిస్తూ, ఆ మొత్తాన్ని రాయడానికి వీల్లేని పదజాలంతో దుర్భాషలాడారు. నేతలు పోటీపడి తిడుతున్నప్పుడు సీఎం జగన్‌ ముసిముసిగా నవ్వుకున్నారు. అంతటితో ఆగకుండా దీనిని పెద్దభూతంగా చిత్రీకరిస్తూ ‘ఎల్లో మీడియా`దుష్ట చతుష్టయం’ అనే అంశాన్ని తీర్మానంగా ఆమోదించారు. దుష్టచతుష్టయానికి చంద్రబాబు దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్‌ తోడయ్యారని జనసేన పార్టీ అధినేతపైనా వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో గడప గడపకూ కార్యక్రమం నిర్వహిస్తోంది. శాసనసభ్యులు, మంత్రులు, ద్వితీయ శ్రేణి వైసీపీ నేతలంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆ సందర్భంగా ప్రజల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా అధిక ధరలు, పన్నుల భారాలు, ఆర్టీసీ, విద్యుత్‌ చార్జీలు, ఇసుక కొరత, ఆకాశాన్నంటుతున్న మద్యం ధరలు, సీపీఎస్‌, పీఆర్సీ అంశాలపై ఉద్యోగులు, పాఠశాలల విలీనం, రోడ్ల దుస్థితి, సంక్షేమ పథకాలు అందకపోవడం, వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల ఏర్పాటు, డ్రైనేజీ తదితర సమస్యలపై ప్రజలు వైసీపీ ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారు. కానీ ప్లీనరీలో మాట్లాడిన నేతల్లో ఏ ఒక్కరూ ప్రజాసమస్యలను ప్రస్తావించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. మూడేళ్ల వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి ఏమిటో ప్లీనరీలో నేతలు వివరించలేకపోయారు. అమ్మఒడి, రైతు భరోసా, చేయూత, పింఛన్లు వంటి సంక్షేమ పథకాల గురించి, బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేసిన విషయం, పదవుల పంపకంతో సామాజిక న్యాయం చేసిన విధానాలపై ఊదరగొట్టడం మినహా ప్రజల ఇబ్బందులపై, రాష్ట్ర ప్రభుత్వం పెద్దమొత్తంలో చేసిన అప్పులపై ఏ ఒక్కరూ మాట్లాడలేకపోయారు. ఈ మూడేళ్లలో రాష్ట్ర విభజన అంశాలకు సంబంధించి ఏ ఒక్కటీ అమలుకు నోచుకోకపోయినా వాటిపై కనీసం చర్చ పెట్టలేదు. 2017లో ఇదే ప్రాంగణంలో జరిగిన వైసీపీ ప్లీనరీలో ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ తీర్మానం చేసిన వైసీపీ..ఆ తర్వాత ఎన్నికల సందర్భంగా మెజార్టీ ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి రాష్ట్ర హక్కులు సాధిస్తామని చెప్పిన నేతలు…ఈ సమావేశంలో వాటి గురించి నోరెత్తలేదు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి 8 ఏళ్లుగా తీవ్ర అన్యాయం చేస్తున్నా, ముఖ్యంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరిగి తీరుతుందని పదేపదే చెపుతున్నా…ఏ ఒక్కరూ రెండు రోజుల సమావేశాల్లో ప్రస్తావించకపోవడం గమనార్హం. ఇక ఈ రెండు రోజుల సమావేశాల్లో మొత్తం 10 తీర్మానాలకు ఆమోదం తెలిపారు. తెలంగాణలో వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు మద్దతుగా ప్రచారం చేస్తూ విమర్శలకు గురవుతున్న వైఎస్‌ విజయమ్మ వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేయగా, సీఎం జగన్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వీటిపైనా ఏ ఒక్కరూ నోరు విప్పలేదు. 2024లో జరగనున్న ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని, ప్రతిపక్షాలు గల్లంతవుతాయని, సింహం సింగిల్‌గానే వస్తుందనే వ్యాఖ్యలతో నేతలు తమ ఉపన్యాసాల్లో పదేపదే ప్రస్తావిస్తూ అధినేత మెప్పు పొందడానికి పోటీపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img