Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

సర్కారు సెల్‌ఫోన్లతో వెట్టి చాకిరి…

ఆయనేమో ఫోన్లపై ఆగ్రహం

విశాలాంధ్రబ్యూరోఅమరావతి:
ఆయన తనిఖీ చేస్తే… పాఠశాలల్లో ఉపాధ్యాయుడిపై వేటు ఖాయం. చిన్న సాకు చూపి చర్యలు తీసుకోవడం పరిపాటిగా మారింది. గతంలో ఎన్నడూ లేనంత ధోరణి పాఠశాల విద్యలో నెలకొంది. అసలే బోధనేతర, బోధనా పనులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉపాధ్యాయులంతా పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ పర్యటనలతో హడలెత్తిపోతున్నారు. ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తనదైన శైలిలో పర్యటనలు చేస్తూ… దాదాపు తనిఖీ చేసిన ప్రతి పాఠశాలల్లోనూ ఉపాధ్యాయులపై వేటు పడేలా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయన ఆకస్మిక పర్యటనలకు, తనిఖీలకు వస్తే చర్యలు ఖాయ మంటూ ఉపాధ్యాయులు బెంబేలెత్తుతున్నారు. చిన్నపాటి కారణంతో అదే పనిగా చర్యలు తీసుకోవడాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆయన తీరు మారకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరిస్తున్నాయి. సీఎం జగన్‌ అధికారం చేపట్టిన ఈ మూడున్నరేళ్లల్లో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా చాలా మంది సీనియర్‌ ఐఏఎస్‌లు బాధ్యతలు నిర్వహిం చగా, ప్రవీణ్‌ తరహాగా ఎప్పుడూ వ్యవహరించలేదు. ఆ సమయంలో అవసరానికి తగినంతగానే పర్యటనలు, ఉపాధ్యాయులపై చర్యలు కొనసాగేవి. ఇప్పుడు దానికి భిన్నంగా ప్రవీణ్‌ ప్రకాష్‌ పోకడలు న్నాయని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ పాఠశాలలో ఎవరో ఒక ఉపాధ్యాయుడిపై వేటు పడుతుందనే పరిస్థితి దాపురించింది. దీంతో ఉపాధ్యాయులు నిత్యం మానసికంగా కుంగిపోతున్నారు. ప్రధానంగా మహిళా ఉపాధ్యాయులైతే సరి… హడలెత్తిపోతూ సెలవులు పెట్టేస్తున్నారు. తమ పాఠశాలకు ఈయన వస్తే… ఖంగారులో బోధనలో తప్పిదాలు దొర్లడం, ఏదొక పొరపాటు చేసేస్తామనే ఆందోళనతో ఉన్నారు. జగన్‌ సర్కారు పాఠశాల విద్యలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో ఉపాధ్యాయులు కీలక భూమిక పోషిస్తు న్నారు. అన్ని యాప్‌ల నిర్వహణ, పథకాల విజయవంతంలో భాగస్వాములవుతున్నారు. వారిపై బోధనేతర పనులు చేయిస్తూ… ప్రభుత్వం అదనపు భారం వేస్తోంది. ఉద్యోగ భద్రత రీత్యా ఇవన్నీ తట్టుకుని, పాఠశాల ముగిశాక… ఇంటి దగ్గరకు వచ్చాక కూడా యాప్‌ల సమాచారం పొందు పర్చడంలో నిమగ్నమవుతున్నారు. వీటన్నింటినీ సదరు అధికారి గుర్తించకుండా… ఉపాధ్యాయులు వర్క్‌ పుస్తకాలు దిద్దలేదనే సాకుతో వారిని సస్పెండ్‌ చేయడం ఎంతవరకు సమంజసమని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
జగన్‌ సర్కారేమో సెల్‌ ఫోన్ల ద్వారా ఉపాధ్యాయులతో బోధనేతర పనులు చేయిస్తోంది. మూడున్నరేళ్ల నుంచి అమ్మఒడి, నాడు`నేడు పథకాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతోనే వెట్టి చాకిరి చేయిస్తున్నారు. తాజాగా పాఠశాల ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ తన తనిఖీలలో ఉపాధ్యాయులు… సెల్‌ఫోన్లలో క్రికెట్‌ మ్యాచ్‌లు చూస్తున్నారన్న సాకుతో… వాటిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వాస్తవంగా విధుల నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయులు సెల్‌ ఫోన్లలో క్రికెట్‌ చూడటం తప్పే. ఎవరో ఒకరిద్దరు క్రికెట్‌ ఆట చూశారనే సాకుతో మొత్తం ఉపాధ్యాయ వ్యవస్థకే మచ్చతెచ్చేలా ఆయన వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. వాస్తవంగా ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు సైతం సెల్‌ఫోన్ల నిషేధాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నారు. ఇప్పటికే ఈ ఫోన్ల ద్వారా వివిధ యాప్‌ల సమాచారం బోధించలేక నానా ఇబ్బందులకు గురవుతున్నారు. మరుగుదొడ్లు శుభ్రం చేసే ఫొటోలు, ముఖాధారిత హాజరు, విద్యార్థుల హాజరు, మధ్యాహ్నం భోజన పథకం తదితర బోధనేతర వివరాలను ఆయా యాప్‌ల ద్వారా ఉపాధ్యాయులు సెల్‌ఫోన్లనే నమోదు చేస్తున్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు రద్దు చేసి… తరగతికి గదికే పరిమితం చేయాలని, అప్పుడు సెల్‌ ఫోన్ల నిషేధాన్ని తాము స్వాగతిస్తామని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.
ఉపాధ్యాయులకు వేతనాల దండగెలా…?
ఉపాధ్యాయులకు వేతనాలు దండగంటూ ప్రవీణ్‌ ప్రకాష్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆయన వ్యాఖ్యలకు బదులుగా ఉపాధ్యాయులు సామాజిక మాధ్యమంలో పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. అవును… వేతనాలు దండగనే కాబోలు సమయానికి వేతనాలు ఇవ్వడం లేదా?, హెల్త్‌ కార్డులు దండగనే పని చేయడం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. పీఎఫ్‌, డీఏ దండగనే… అవసరానికి డబ్బులు ఇవ్వడం లేదా? అని నిలదీస్తున్నారు. ఏ శాస్త్రీయ పద్ధతిలో మీరు పర్యవేక్షణ చేస్తున్నామని అనుకుంటున్నారో… అది మీ తప్పనిసరి బాధ్యతగా మీరు భావిస్తున్నారో… అలాగే మాకు వచ్చే వేతనమూ శాస్త్రీయ పద్ధతిలో కాలానుగుణంగా పెరుగుతున్న జీవన వ్యయం ఆధారంగా రాజ్యాంగానికి, చట్టానికి లోబడి తీసుకుంటున్నామని స్పష్టం చేస్తున్నారు. వేతనం ఎంతనే దానిపై ఒక లెక్క ఉంటుందని, శాస్త్రీయత ఉందని, అదేమీ ఉచితంగా ఇచ్చే భిక్ష కాదని నొక్కిచెబుతున్నారు. పర్యవేక్షణ అనేదీ, పని చేయని వారిపై చర్యలు తీసుకోవడం అనేదీ మీ బాధ్యత అని, దానిని మేము ఎప్పుడూ స్వాగతిస్తామని పేర్కొంటున్నారు. ఉపాధ్యాయులకు పాఠం చెప్పే పని మాత్రమే ఇవ్వాలని, పాఠ్య పుస్తకాలు అందరికీ సరిపడా సకాలంలో ఎందుకు అందించలేక పోతున్నారని నిలదీస్తున్నారు. మూడు సెమిస్టర్ల పాఠ్యాంశాన్ని మల్టీ గ్రేడ్‌ టీచింగ్‌ విధానంలో పూర్తి చేయడానికి పట్టే కాలాన్ని శాస్త్రీయంగా లెక్కించి సరిపడా టీచర్లను నియమించాక… అప్పుడు చర్యలకు ఉపక్రమిస్తే శాస్త్రీయత ఉంటుందంటూ ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఏళ్లుగా ఒక్క డీఎస్సీ లేదని, పేద పిల్లల బడులు ఉపాధ్యాయుల తీవ్ర కొరతతో అల్లాడుతున్నాయన్న విషయాన్ని గమనించాలని సూచిస్తున్నారు. ఉపాధ్యాయులు తప్పు చేస్తే చర్యలను స్వాగతిస్తున్నామని, చర్యలే లక్ష్యంగా ప్రవీణ్‌ ప్రకాష్‌ పర్యటనలు ఉంటున్నాయంటూ ఉపాధ్యాయ సంఘాలు తప్పుపడుతున్నాయి. ఇప్పటికైనా ప్రవీణ్‌ ప్రకాష్‌ అటువంటి వ్యవహార శైలిని విడనాడాలని, లేకుంటే తాము న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img