Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సర్కారు స్కూళ్లలో కరోనా

రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజే 22 కేసులు
కృష్ణాలో 11 మంది విద్యార్థులకు..
ప్రకాశంలో ముగ్గురు ఉపాధ్యాయులు, ముగ్గురు విద్యార్థులు
చిత్తూరు జిల్లాలో ఐదుగురిపై పంజా
అప్రమత్తమైన విద్య, వైద్య యంత్రాంగం

అమరావతి : సర్కారు పాఠశాలల్లో కరోనా కలకలం మొదలైంది. కృష్ణా, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 19 మంది విద్యార్థులు, మరో ముగ్గురు ఉపాధ్యాయులు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. కృష్ణాజిల్లాలో ఒకే పాఠశాలలో 10 మంది విద్యార్థు లకు, మరొక పాఠశాలలో ఒకరికి కరోనా సోకింది. దీంతో ఈ పాఠశాలలకు విద్యాశాఖ అధికారులు సెలవులు ప్రకటించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో డీఆర్‌ఎం మున్సిపల్‌ స్కూల్‌లో ముగ్గురు ఉపాధ్యాయులు, ముగ్గురు విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ఎంపీసీ కండ్రిగలోని స్కూల్‌లో ఐదుగురు విద్యార్థులకు కరోనా సోకింది. రాష్ట్రంలో ఇటీవల పాఠశాలలు, కళాశాలలు పున: ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో పాఠశాలల్లోనూ కరోనా కేసులు నమోదవడంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఉలిక్కిపాటుకు గురవుతున్నారు. పాఠశాలల పున: ప్రారంభం నుంచి హాజరు శాతం క్రమేపీ పెరుగుతోందని విద్యాశాఖ స్పష్టం చేస్తోంది. ఉపాధ్యాయులను ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా గుర్తించి, వారికి కరోనా టీకాలు వేయించారు. రాష్ట్రంలోని 45 ఏళ్లు దాటిన వారికి టీకాల ప్రక్రియ కొనసాగుతోంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం వివిధ సెట్ల పరీక్షలకు, ఇంటర్మీడియట్‌ సప్లమెంటరీకి షెడ్యూలు జారీజేసింది. ఈ క్రమంలో విద్యా కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం ఉండబోదని ప్రభుత్వం, తల్లిదండ్రులు భావించారు. అయితే రాబోయే రోజుల్లో థర్డ్‌ వేవ్‌ ఉంటుందని, దాని ప్రభావం విద్యార్థులపైనే ఉంటుందనే సమాచారం ఉంది. విద్యార్థులపై కరోనా కేసుల నమోదు సంఘటనలపై ప్రభుత్వం అప్రమత్తమమై, కరోనా కట్టడికి పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించాలని కోరుతున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో దాదాపు ప్రతి రోజు వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img