Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సర్కార్‌పై సమరానికి సై ..

సాగుచట్టాలపై రైతులకు మద్దతు
కిసాన్‌ సన్సద్‌లో పాలొన్న విపక్ష నేతలు
పార్లమెంటు హౌస్‌లో భేటీ
ఉమ్మడి కార్యాచరణపై చర్చ

న్యూదిల్లీ : ప్రజాసమస్యలు పట్టని కేంద్రప్రభుత్వంపై సమరానికి ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. మోదీ సర్కార్‌ను అడ్డుకోవాలని ఐక్యంగా ముందుకు సాగుతున్నాయి. పార్లమెంటులో దూకుడుగా వ్యవహరిస్తున్న ప్రతిపక్ష నేతలు శుక్రవారం జంతర్‌ మంతర్‌ వద్ద కిసాన్‌ సన్సద్‌కు హాజరయ్యారు. కొత్త సాగు చట్టాల రద్దు డిమాండుతో సాగుతున్న రైతాంగ ఆందోళనకు సంపూర్ణ మద్దతిచ్చారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీతో పాటు కిసాన్‌ సన్సద్‌కు వెళ్లిన నేతలు ఎవ్వరూ వేదికపైకి వెళ్లలేదు. ప్రసంగాలు చేయలేదు. అనంతరం రాహుల్‌ విలేకరులతో మాట్లాడారు. విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయని, రైతులకు అండగా నిలిచాయని చెప్పారు. నల్ల చట్టాలపై కేంద్రం చర్చిస్తే సరిపోదని, వాటిని రద్దు చేయాల్సిందేనన్నారు. పెగాసస్‌ వ్యవహారంపై పార్లమెంటులో చర్చకు కేంద్రం అనుమతివ్వడం లేదని తెలిపారు. ‘పార్లమెంటులో ఏం జరుగుతోందో అందరికీ తెలుసు. పెగాసస్‌ గూఢచర్యంపై చర్చను మేం కోరుతున్నాం గానీ ప్రభుత్వం ససేమిరా అంటున్నది. ప్రధాని మోదీ ప్రతి టెలిఫోన్‌లోకి చొరబడ్డారు’ అని రాహుల్‌ విమర్శించారు. రాహుల్‌ వెంట మల్లికార్జున ఖర్గే (కాంగ్రెస్‌), బినయ్‌ విశ్వం (సీపీఐ), ఎలామరం కరీం (సీపీఎం), మనోజ్‌ కుమార్‌ రaా (ఆర్జేడీ), సంజయ్‌ రౌత్‌ (శివసేన), తిరుచి శివ (డీఎంకే) తదితరులు ఉన్నారు. అంతకుముందు పార్లమెంటు హౌస్‌లో సమావేశమై చట్టసభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రతిపక్షాల నేతలు చర్చించారు. సమావేశంలో కాంగ్రెస్‌, వామపక్షాలు, డీఎంకే, టీఎంసీ, ఎన్‌సీపీ, శివసేన, ఆర్జేడీ, ఎస్పీ, ఆప్‌, ఐయూఎంఎల్‌, ఆర్‌ఎస్‌పీ, ఎన్‌సీ, ఎల్‌జేడీ నేతలు పాల్గొన్నారు. ఆపై బస్సులో జంతర్‌ మంతర్‌ వద్దకు చేరుకొని కిసాన్‌ సన్సద్‌లో, రైతుల ఆందోళనలో పాల్గొన్నారు. సాగు చట్టాలు, పెగాసస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img