Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సాగరతీరంలో ఎర్రదండు కవాతు

విశాఖలో సీపీఐ భారీ ప్రదర్శన
ఆటపాటలతో ఉల్లాసంగా సాగిన ర్యాలీ

. పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపై హోరెత్తిన నినాదాలు
. ప్రత్యేక ఆకర్షణగా మహిళా వలంటీర్లు, ఉక్కు కార్మికులు
. ప్రదర్శనపై అడుగడుగునా పూల వర్షం

విశాలాంధ్ర బ్యూరో – విశాఖపట్నం : విశాఖ సాగర తీరం ఎరుపెక్కింది. ఎర్రజెండాల రెపరెపలతో నగర వీధులు పులకించిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సీపీఐ శ్రేణులు గొంతెత్తి నినదించాయి. చంటిపిల్లలను చంకనెత్తుకుని మహిళలు ప్రదర్శనలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర 27వ మహాసభల సందర్భంగా శుక్రవారం విశాఖపట్నంలో భారీ ప్రదర్శన జరిగింది. ప్రదర్శన సాయంత్రం 4గంటలకు జీవీఎంసీ వద్ద గల గాంధీ విగ్రహం నుంచి ప్రారంభమై జైలు రోడ్డు, సెవెల్‌ హిల్స్‌ జంక్షన్‌, రామనగర్‌ మెయిన్‌ రోడ్డు మీదుగా గవర్నర్‌ బంగ్లా నుంచి బహిరంగ సభ వేదిక గురజాడ కళాక్షేత్రంకు చేరుకుంది. రాష్ట్రం నలు మూలల నుంచి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వేలాదిమంది సీపీఐ, ప్రజాసంఘాల కార్యకర్తలు, నాయకులు ర్యాలీకి తరలివచ్చారు. ప్రదర్శన అత్యంత ఉత్సాహభరితంగా, ఆటపాటలు, డప్పు వాయిద్యాలు, నృత్యాలతో కోలాహలంగా సాగింది. వంద మీటర్ల పార్టీ పతాకం ప్రదర్శనకు అగ్రభాగాన ఆకర్షణగా నిలచింది. మహాసభల సంఖ్యను తెలియజేసేలా 27 మంది రెడ్‌షర్ట్‌ వలంటీర్లు ఎర్రజెండాలు చేబూని ప్రదర్శన ముందు వరుసలో పాల్గొన్నారు. ప్రదర్శన ప్రారంభమైన పాయింట్‌ నుంచి బహిరంగ సభాస్థలికి చేరడానికి గంట సమయం పట్టింది. మహిళలు తెల్ల అంచు ఎర్ర చీరలతో ప్రదర్శనలో పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటాం, ప్రాణాలైనా అర్పిస్తాం` పరిశ్రమను కాపాడుకుంటామంటూ నినాదాలు మారుమ్రోగాయి. విశాఖ ఉక్కు కార్మికులు ఈ ప్రదర్శనకు ప్లకార్డులు చేబూని పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. సత్వరమే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని, నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని నినదించారు. ఎర్రజెండాలు, రెడ్‌షర్టు వలంటీర్లు, భారీ పార్టీ పతాకంతో అత్యంత ఆకర్షణీయంగా సాగిన మహా ప్రదర్శనను విశాఖ నగర ప్రజలు రోడ్డు కిరువైపులా నిలబడి ఆసక్తిగా తిలకించారు. అనేకమంది తమ సెల్‌ఫోన్లతో ఈ ప్రదర్శనను చిత్రీకరించారు. యువతీ, యువకులు ఎక్కువగా పాల్గొనడం విశేషం. కోలాటాలు.. తప్పిడి గుళ్ళు.. యువకుల డప్పుల వాయిద్యాలతో ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది. జైల్‌ రోడ్డు వద్ద సీపీఎం శ్రేణులు ప్రదర్శనకు స్వాగతం పలుకుతూ పూల వర్షం కురిపించాయి. ర్యాలీకి అగ్ర భాగాన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సహాయ కార్యదర్శులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జేవీ సత్యనారాయణమూర్తి, కార్యదర్శి వర్గ సభ్యులు పి జే చంద్రశేఖర్‌, జల్లి విల్సన్‌, రావుల వెంకయ్య, జి ఓబులేసు, పి హరినాథ్‌ రెడ్డి, జి ఈశ్వరయ్య, అక్కినేని వనజ, కంట్రోల్‌ కమిషన్‌ చైర్మన్‌ నెక్కంటి సుబ్బారావు, రాష్ట్ర కార్యవర్గసభ్యులు టి. మధు, ఏజే స్టాలిన్‌, ఏ రామానాయుడు, జంగాల అజయ్‌ కుమార్‌ , డి ఆదినారాయణ, జగదీష్‌, దోనేపూడి శంకర్‌, రామాంజనేయులు, ఎం ఎల్‌ నారాయణ, రామచంద్రయ్య, ఎం. పైడిరాజు, బాలేపల్లి వెంకటరమణ,ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్‌, మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జయలక్ష్మి, పి. దుర్గ భవాని, కార్యనిర్వాహక అధ్యక్షురాలు ఏ విమల, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాన్సన్‌ బాబు, శివా రెడ్డి, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పరుచూరి రాజేంద్ర బాబు, లెనిన్‌ బాబు, ఏపీ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంద్రా నాయక్‌, పెంచలయ్యతో పాటు అనేకమంది నేతలు ర్యాలీలో పాల్గొన్నారు.
సీపీఎం ఘన స్వాగతం
జైల్‌ రోడ్డు వద్ద ర్యాలీకి, రాష్ట్ర ప్రతినిధులకు సీపీఎం శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కే లోకనాథం, జిల్లా కార్యదర్శి ఎం.జగ్గు నాయుడు, కార్యదర్శి వర్గ సభ్యులు డాక్టర్‌ బి.గంగారావు, ఆర్‌కేఎస్‌వీ కుమార్‌, బొట్ట ఈశ్వరమ్మ, బీ పద్మ, బీజగన్‌, ఇతర నాయకులు…ప్రదర్శకులు, రెడ్‌ షర్ట్‌ వలంటీర్ల పై పూలవర్షం కురిపించి సంఫీుభావం తెలిపారు.
ఈ సందర్భంగా లోకనాథం మాట్లాడుతూ సీపీఎం జాతీయ మహాసభల తీర్మానాల ప్రకారం వామపక్షాలు రానున్న రోజుల్లో మరింత ఐక్యతతో ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడాలని అన్నారు. సీపీఐ రాష్ట్ర మహాసభలు అత్యంత జయప్రదంగా జరగాలని ఆకాంక్షించారు. దేశంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్య ఉద్యమాలు నిర్వహించడం అవసరం అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను పోరాడి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img