Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

సాగుచట్టాల రద్దుకు ఓకే

మార్చి వరకు ఉచిత రేషన్‌ పొడిగింపు
కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

న్యూదిల్లీ : వివాదాస్పద సాగు చట్టాల రద్దుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ చట్టాల రద్దుపై ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ ప్రకటన చేశారు. బుధవారం కేబినెట్‌ సమావేశం సాగు చట్టాల రద్దుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దిల్లీ సరిహద్దుల్లో ఏడాది పాటు సాగిన రైతుల ఉద్యమం విజయవంతమైంది. వారి పట్టుదల ముందు కేంద్రప్రభుత్వం తలవంచక తప్పలేదు. కొత్తగా తీసుకు వచ్చిన మూడు సాగు చట్టాలను ప్రతిష్టాత్మకంగా భావిస్తూ రద్దు మాటే వద్దు అన్న మంకుపట్టును విడనాడి వాటిని ఉపసంహరించుకుంది. ఇటీవల ప్రధాని మోదీ ప్రకటించినట్లుగానే కొత్త సాగు చట్టాల ఉపసంహరణ బిల్లుకు కేంద్రకేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. అలాగే, 2022 మార్చి వరకు ఉచిత రేషన్‌ పథకాన్ని పొడిగించేందుకు ప్రధాని అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశం అంగీకరించింది. మూడు చట్టాల రద్దుకు ఒకే బిల్లు ‘ది ఫామ్‌ లాస్‌ రిపీల్‌ బిల్‌ 2021 టు రిపీల్‌ త్రీ ఫామ్‌ లాస్‌’కు కేబినెట్‌ ఆమోదం లభించింది. ఈనెల 29 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలు కానున్న నేపథ్యంలో ఈ బిల్లును లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టనుంది. అన్నదాతల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని మూడు చట్టాలు రద్దు చేస్తున్నట్టు వెల్లడిరచింది. వచ్చే ఏడాది మార్చి వరకు ఆహార ధాన్యాలను ఉచితంగా పేదలకు అందించే పథకాన్ని పొడిగించేందుకు కేబినెట్‌ అంగీకారం తెలిపింది. ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేఏవై), జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కింద ఈ పథకాన్ని కొనసాగిస్తున్నారు. 80 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. కేబినెట్‌ నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ బుధవారం విలేకరులకు తెలిపారు. సాగు చట్టాల ఉపసంహరణ బిల్లుకు, 2022 మార్చి వరకు ఉచిత ఆహార పథకాన్ని పొడిగించేందుకు కేబినెట్‌ అంగీకరించిందన్నారు. ఉచిత ఆహార పథకాన్ని పొడిగిస్తుండటంతో ప్రభుత్వ ఖజానాపై రూ.53,344 కోట్ల అదనపు భారం పడుతోందని, పీఎంజీకేఏవై ఖర్చు రూ.2.6లక్షల కోట్లకు చేరనుందని చెప్పారు. తొలుత ఈ పథకాన్ని 2020 ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు అమలు చేశారు. తర్వాత 2021 నవంబరు 30 వరకు పొడిగించారు.
క్రిప్టో కరెన్సీ బిల్లు కూడా..
పార్లమెంటులో క్రిప్టో కరెన్సీపై ‘ది క్రిప్టో కరెన్సీ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ అఫీషియల్‌ డిజిటల్‌ కరెన్సీ బిల్లు`2021’ ప్రవేశపెట్టడానికి కేంద్రం సిద్ధమైనట్లు అధికార వర్గాల సమాచారం. ఆర్బీఐ అధ్వర్యంలో సొంత డిజిటల్‌ కరెన్సీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img