Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సాయిబాబా విడుదలపై సుప్రీం స్టే

. బాంబే హైకోర్టు తీర్పు నిలిపివేత
. జైలులోనే ఉండాలని స్పష్టీకరణ
. సాయిబాబా, ఇతరులకు నోటీసులు
. తదుపరి విచారణ 8వ తేదీకి వాయిదా

న్యూదిల్లీ : మావోయిస్టులతో సంబంధాల కేసులో నిర్దోషిగా తేలిన దిల్లీ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్‌ జీఎన్‌సాయిబాబా విడుదలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. సాయిబాబాతో పాటు ఇతరులను నిర్దోషులుగా ప్రకటిస్తూ వారిని తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలంటూ బాంబే హైకోర్టు నాగపూర్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలను నిలిపివేస్తూ శనివారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తన శారీరక వైకల్యం, ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని తనను గృహ నిర్బంధంలో ఉంచాలని సాయిబాబా చేసిన అభ్యర్థనను న్యాయమూర్తులు జస్టిస్‌ ఎంఆర్‌ షా, బేల ఎం త్రివేదితో కూడిన సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సాయిబాబా, ఇతర నిందితుల నుంచి ప్రతిస్పందనలను కోరింది. ఈ కేసులో నిందితులను చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం ‘ఉపా’ కింద కఠిన నిబంధనల ప్రకారం విచారణ చేయడానికి మంజూరు ఉత్తర్వులు జారీ ‘చట్టంలో చెడ్డది… చెల్లదు’ అని పేర్కొంటూ బాంబే హైకోర్టు శుక్రవారం సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించింది. ఏదైనా ఇతర కేసులో కస్టడీ అవసరమైతే తప్ప, ఆయనను తక్షణమే నాగపూర్‌ జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. అయితే బాంబే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి, తీర్పుపై స్టే ఇవ్వాలని కోరింది. కానీ, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం అందుకు తిరస్కరించింది. బాంబే హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం ఓ దరఖాస్తును రిజిస్ట్రీకి ఇచ్చి అభ్యర్థన పెట్టుకోవచ్చని వివరించింది. అనంతరం అత్యవసర విచారణకు అంగీకరించింది. ఈ అప్పీల్‌ పై శనివారం విచారణ జరిపిన సుప్రీం కోర్టు… హైకోర్టు తీర్పును నిలిపివేసింది. మహారాష్ట్ర పిటిషన్‌పై నాలుగు వారాల్లోగా తమ స్పందన తెలియజేయాలంటూ సాయిబాబా, ఇతర నిందితులను ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను డిసెంబర్‌ 8వ తేదీకి వాయిదా వేసింది. సాయిబాబాతో పాటు జీవిత ఖైదు పడిన మహేశ్‌ కరీమాన్‌ తిర్కీ, పాండు పోరా నరోటే (ఇద్దరు రైతులు), హేమ్‌ కేశవదత్త మిశ్రా (విద్యార్థి), ప్రశాంత్‌ సాంగ్లికర్‌ (జర్నలిస్ట్‌), విజయ్‌ తిర్కీ (కూలీ)ని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. అప్పీల్‌ పెండిరగ్‌లో ఉన్న సమయంలో నరోటే మరణించారు. శారీరక వైకల్యం కారణంగా వీల్‌చైర్‌పై ఉన్న 52 ఏళ్ల సాయిబాబా ప్రస్తుతం నాగ్‌పూర్‌ సెంట్రల్‌ జైలులో ఉన్నారు. 2014 ఫిబ్రవరిలో ఆయన అరెస్టయ్యాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img