Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

సిట్‌పై సుప్రీం తీర్పు రిజర్వు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల కొనుగోళ్లు, గత ప్రభుత్వ విధాన నిర్ణయాలపై సిట్‌ ఏర్పాటు అంశంలో సుప్రీంకోర్టులో గురువారం వాదనలు ముగిశాయి. ఈ విషయంలో రాష్ట్ర హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వం గతంలో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు…వాదనలు ముగించి తీర్పును రిజర్వు చేసింది. అమరావతి భూములలో అవినీతి, ఫైబర్‌ నెట్‌లో అక్రమాల అభియోగాలపై సిట్‌ విచారణను నిలిపివేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. రెండు పక్షాల వాదనలను జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌తో కూడిన ధర్మాసనం విన్నది. అంతకుముందు టీడీపీ నేత వర్ల రామయ్య తరపు న్యాయవాది వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్షించే అధికారం లేదంటే ఎలా?, అలాంటి వారికి వంద శాతం ఇమ్యూనిటీ ఇచ్చినట్లు కాదా?, ఇది ప్రజాప్రయోజనాలకు వ్యతిరేకం కాదా? అంటూ వర్ల రామయ్య తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. అమరావతి భూములు, ఫైబర్‌ నెట్‌లో అవినీతి, అక్రమాలపై దురుద్దేశం ఉంటే, అవన్నీ సీబీఐ దర్యాప్తులో తేలతాయి కదా? అని ధర్మాసనం తెలిపింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వివిధ కీలక విధానాలు, ప్రాజెక్టుల్లో అవకతవకలు జరిగాయని ప్రస్తుత ప్రభుత్వం భావించి సిట్‌ ఏర్పాటు చేసింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరపున అభిషేక్‌ మనుసింఫ్వీు వాదనలు విన్పిస్తూ…మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదనల మేరకు ఒక పోలీస్‌స్టేషన్‌లో సిట్‌ ఏర్పాటు చేసినట్లు సుప్రీంకు నివేదించారు. దానిపై నిజనిర్ధారణ పూర్తి చేశామని, పక్షపాతం ఉండకూడదనే సీబీఐ దర్యాప్తు కోరుతున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై కొందరు ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌ఐఆర్‌ దాఖలైందని, ప్రభుత్వం నేరుగా నమోదు చేయలేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. విధాన నిర్ణయాలు, టెండర్లు, కాంట్రాక్టర్లకు చెందిన కేసుల్లో సారూప్యం చూడాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి, ఫైబర్‌ నెట్‌లలో అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం క్రిమినల్‌ విచారణ కాకుండా, నిజనిర్ధారణే చేసిందని ధర్మాసనానికి తెలిపారు. గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించవద్దని, నిజనిర్ధారణపై నిషేధం ఉందంటూ ఈ మేరకు హైకోర్టు ఇచ్చిన తీర్పులను ధర్మాసనం దృష్టికి ప్రభుత్వ తరపు న్యాయవాది తీసుకొచ్చారు. దీనిపై మరోసారి వర్ల రామయ్య తరపు న్యాయవాది వాదనలు కొనసాగిస్తూ…ప్రభుత్వం పక్షపాతంతో జీవో ఇచ్చిందని, అధికార పార్టీతో నిజనిర్ధారణ ఏర్పాటు చేశారని వాదించగా…దానిపై ధర్మాసనం జోక్యం చేసుకుని ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ప్రజాధనం దుర్వినియోగం, వృథా ఉంటే దర్యాప్తు చేయకూడదా? అని ప్రశ్నించింది. దురుద్దేశపూర్వకంగా ఏమైనా లావాదేవీలు జరిగాయని భావిస్తే…అది విచారించదగినదే కదా అని ప్రశ్నించింది. ఇద్దరి వాదనలు ముగియడంతో సిట్‌పై తీర్పును సుప్రీం ధర్మాసనం రిజర్వు చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img