Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సిద్ధా… శివా?

కర్నాటక సీఎం పదవిపై కాంగ్రెస్‌ డైలమా

. ఖడ్గేతో భేటీ అయిన సిద్ధరామయ్య, శివకుమార్‌
. చెరిసగం పంచుకోవడానికి నేతల విముఖత
. నేడు బెంగళూరులో ప్రకటిస్తారా… సమయం తీసుకుంటారా… అదే ఉత్కంఠ

న్యూదిల్లీ: కర్నాటక ముఖ్యమంత్రి పీఠంపై ఉత్కంఠ కొనసాగుతోంది. పదవి ఎవరికి కట్టబెట్టాలనే విషయం మాత్రం ఎడతెగని అంశమై కూర్చుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించిన తర్వాత సీఎం పదవి కోసం మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ విషయమై పార్టీ అధిష్ఠానం పరిశీలకులను రంగంలోకి దింపి కొత్తగా ఎన్నికయిన ఎమ్మెల్యేల మనోగతాన్ని తెలుసు కుంది. రహస్య ఓటింగ్‌ కూడా నిర్వహించింది. తర్వాత ఈ రంగమంతా దిల్లీకి మారింది. ఇప్పటికే సిద్ధ, డీకే దిల్లీకి చేరుకొని పార్టీ అధ్యక్షుడు ఖడ్గేతో తదుపరి ముఖ్యమంత్రి పదవి గురించి చర్చలు జరిపారు. ఇద్దరూ కీలక నేతలే కావడంతో కాంగ్రెస్‌ అధిష్ఠానం కూడా డైలామాలో పడిరది. కర్నాటకలో అధికారాన్ని పంచుకునే ప్రతిపాదనను ముందు ఉంచగా… సిద్ధరామయ్య, శివకుమార్‌ తిరస్కరించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం తన తుది నిర్ణయాన్ని బెంగళూరులోనే ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, కర్నాటక ముఖ్యమంత్రి అవకాశం సీనియర్‌ నేత సిద్ధరామయ్యకే ఎక్కువగా ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇదిలాఉండగా, సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ మంగళవారం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గేతో ఆయన నివాసంలో ప్రత్యేకంగా సమావేశమై దక్షిణాది రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు విధివిధానాలపై చర్చించారు. బెంగళూరు నుంచి దేశ రాజధానికి చేరుకున్న శివకుమార్‌ సాయంత్రం 5 గంటల తర్వాత ఖడ్గే నివాసానికి చేరుకుని కర్నాటక ముఖ్యమంత్రి పదవిపై చర్చలు జరిపారు. 30 నిమిషాలపాటు జరిగిన భేటీ అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయిన ఆయన మీడియాతో మాట్లాడలేదు. శివకుమార్‌ వెళ్లిన వెంటనే, సిద్ధరామయ్య ఖడ్గే నివాసానికి 10, రాజాజీ మార్గ్‌కు సాయంత్రం 6 గంటల తర్వాత చేరుకున్నారు. ఇద్దరు నేతలు ఉన్నత పదవిపై చర్చలు జరిపారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో 224 స్థానాలకు గాను 135 స్థానాలను గెలుచుకోవడం ద్వారా పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధించడంతో శివకుమార్‌, సిద్ధరామయ్య ఇద్దరూ అత్యున్నత పదవికి పోటీ పడుతున్నారు. ఇక తమ నేతలకు మద్దతుగా ఇద్దరు నేతల మద్దతుదారులు తీవ్ర లాబీయింగ్‌కు దిగుతున్నారు. కొత్తగా ఎన్నికయిన ఎమ్మెల్యేలు ఇప్పటికే శాసనసభా పక్ష నేతను నియమించేందుకు పార్టీ అధ్యక్షుడు ఖడ్గేకు అధికారం ఇస్తూ ఏక వాక్య తీర్మానాన్ని ఆమోదించారు. బెంగళూరులో కాంగ్రెస్‌ శాసనసభా పక్ష సమావేశానికి ఖడ్గే గతంలో ముగ్గురు కేంద్ర పరిశీలకులను నియమించారు. వారు ఇప్పటికే తమ నివేదికను ఆయనకు సమర్పించి, దానిపై చర్చించారు. పరిశీలకులు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలందరినీ వ్యక్తిగతంగా కలుసుకుని ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై వారి అభిప్రా యాలను సేకరించారు. వారు రహస్య ఓటింగ్‌ను కూడా నిర్వహించి, సంకలనం చేసి ఫలితాలను పార్టీ అధినేతకు తెలియజేశారు. అంతకుముందు రోజు కూడా ఖడ్గే పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో చర్చించారు. కర్నాటకలో ప్రభుత్వ ఏర్పాటు అంశంపై చర్చించేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌… రాహుల్‌ గాంధీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img