Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి కన్నుమూత

న్యూమోనియోతో బాధపడుతూ మృతి
తొలిపాటకే నందీ అవార్డు
హైదరాబాద్‌ : తెలుగు సినీ పాటకు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన ప్రఖ్యాత గేయ రచయిత ‘సిరి వెన్నెల’ సీతారామశాస్త్రి(66) ఇక లేరు. ఇటీవల న్యూమోనియాతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. సీతారామశాస్త్రి మృతితో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘సిరివెన్నెల’ చిత్రంలో ‘విధాత తలపున’ గేయంతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన ఆ సినిమా టైటిల్‌నే ఇంటిపేరుగా సుస్థిరం చేసుకున్నారు. 800లకు పైగా చిత్రాల్లో దాదాపు 3వేల పాటలు ఆయన హృదయ కమలం నుంచి కలంలోకి చేరి అక్షరాలై శ్రోతలను మంత్ర ముగ్ధులను చేశాయి. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2019లో పద్మశ్రీతో సత్కరించింది. చెంబోలు సీతారామశాస్త్రి 1955 మే 20న విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలంలో డాక్టర్‌ సీవీ యోగి, సుబ్బలక్ష్మి దంపతులకు జన్మించారు. దిగువ మధ్య తరగతి కుటుంబం. పదో తరగతి వరకూ అనకాపల్లిలోనే చదివారు. కాకినాడలో ఇంటర్మీడియట్‌, ఆంధ్ర విశ్వకళా పరిషత్‌లో బి.ఎ.పూర్తి చేశారు. అప్పట్లో పీజీ చేసినా ఉద్యోగం వస్తుందన్న భరోసా లేకపోవడంతో ఎంబీబీఎస్‌ చేయమని ఆయన తండ్రి సలహా ఇచ్చారు. కానీ, ఆ క్రమశిక్షణ తనకు అలవాటు లేకపోవడంతో అంతగా ఆసక్తి చూపలేదు. అదే సమయంలో 10వ తరగతి అర్హతపై బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగం రావడంతో రాజమహేంద్రవరంలో కొన్నాళ్లు పనిచేశారు.
తమ్ముడు గుర్తించిన టాలెంట్‌
సీతారామశాస్త్రిలో కవి ఉన్నాడని గుర్తించిన మొదటి వ్యక్తి ఆయన సోదరుడు. చిన్నప్పటి నుంచి సీతారామశాస్త్రికి పాటలు పాడాలని కోరిక. ఒకట్రెండుసార్లు ప్రయత్నించి, అందుకు తాను పనికిరానని నిర్ధారణకు వచ్చారు. అయితే, కొత్త పదాలతో ఎప్పుడూ ఏదో ఒకటి పాడుతుండటాన్ని చూసిన ఆయన సోదరుడు ‘అన్నయ్యా కవిత్వం కూడా బాగా రాస్తున్నావు. ప్రయత్నించు’ అని చెప్పారట. ఆ తర్వాత ఏవీ కృష్ణారావు, సహచరుడు చాగంటి శరత్‌బాబుతో కలిసి సాహితీ సభలకు వెళ్లేవారు. ఆ సమయంలో సీతారామశాస్త్రిని అందరూ భరణి అని పిలిచేవారు. ఎం.ఏ చేస్తుండగా దర్శకుడు కె.విశ్వనాథ్‌ నుంచి పిలుపు రావడంతో ‘సిరివెన్నెల’ చిత్రానికి తొలిసారి కలాన్ని కదిలించారు. అలా తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే సుమధుర గీతాలెన్నింటినో రాశారు.
ఆణిముత్యాలు.. వజ్రాలు ఈ పాటలు
‘సిరి వెన్నెల’చిత్రంలో ‘విధాత తలపున’ పాటతో మొదలైన సీతారామశాస్త్రి పాటల పూదోటలో ఎన్నో అందమైన గులాబీలు విరిశాయి. ‘రుద్రవీణ’లో ‘నమ్మకు నమ్మకు ఈ రేయినీ’, ‘లలిత ప్రియ కమలం విరిసినదీ’, ‘స్వర్ణకమలం’లో ‘ఆకాశంలో ఆశల హరివిల్లు’, శ్రుతిలయలు’లో ‘తెలవారదే స్వామీ’, ‘క్షణక్షణం’లో ‘జామురాతిరి జాబిలమ్మా’, ‘గాయం’లో ‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని’, ‘మనీ’లో ‘చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ’, ‘శుభలగ్నం’లో ‘చిలకా ఏ తోడు లేక’, ‘నిన్నే పెళ్లాడతా’లో కన్నుల్లో నీ రూపమే, ‘సిందూరం’లో ‘అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే’, ‘నువ్వే కావాలి’లో ‘ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే’, ‘బొమ్మరిల్లు’లో ‘నమ్మక తప్పని నిజమైనా’, ‘గమ్యం’లో ‘ఎంత వరకూ ఎందుకొరకు’, ‘కొత్త బంగారు లోకం’లో ‘నీ ప్రశ్నలు నీవే’, ‘చక్రం’లో జగమంత కుటుంబం’, ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’లో దశవతారం, ‘అల వైకుంఠ పురములో’ ‘సామజవరగమన’ ఇలా చెప్పుకుంటూ పోతే సీతారామశాస్త్రి పాటల భాండాగారంలో అమూల్యమైన ఆణిముత్యాలు, వజ్రాలు ఎన్నో.
11సార్లు నంది అవార్డు
సీతారామశాస్త్రి పాటను శ్రోతలు ఎంత అక్కున చేర్చుకున్నారో, అదే స్థాయిలో అవార్డులు సైతం పరుగున వచ్చి ఆయన పాటను ఆదరించాయి. రాసిన తొలి పాట ‘విధాత తలపున’కే నంది అవార్డు దక్కించుకున్న ఘనత సీతారామశాస్త్రిది. అలా మొత్తం 11సార్లు ఆయన నంది అవార్డులు అందుకున్నారు. ఉత్తమ గేయ రచయితగా నాలుగు సార్లు ఫిల్మ్‌ ఫేర్‌ అందుకున్నారు. ఇక మిగిలిన పురస్కారాలకు, సత్కారాలకు లెక్కేలేదు. ‘కంచె’ చిత్రానికి గానూ ఉత్తమ గేయ రచయితగా సైమా అవార్డు సొంత చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img