Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సివిల్‌ వివాదాల్లో పోలీసుల జోక్యం సుప్రీం తీర్పునకు విరుద్ధం

మహిళా కార్యదర్శులను పోలీసులుగా నియమించడంపై హైకోర్టు అభ్యంతరం

విశాలాంధ్ర బ్యూరో ` అమరావతి : సివిల్‌ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోవడం సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది. మహిళా కార్యదర్శులు సివిల్‌ వివాదాలు పరిష్కరించవచ్చునని ఏపీ ప్రభుత్వం పేర్కొనడంపై ఉన్నత న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులను పోలీసు శాఖలో ‘మహిళా పోలీసు’లుగా పరిగణిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 59ని సవాల్‌ చేస్తూ పిటిషన్‌ దాఖలు కాగా, దానిపై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది. రెవెన్యూ శాఖలో 15 వేల మందిని మహిళా కార్యదర్శులుగా నియమించి పోలీసు విధులు అప్పగించడంపై పిటిషనర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ పోలీసు చట్టం, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఆ జీవో ఉందని విశాఖకు చెందిన ఆరేటి ఉమామహేశ్వరరావు పిటిషన్‌లో పేర్కొన్నారు. పోలీసు శాఖలో జరిగే నియామకాలన్నీ పోలీసు నియామక బోర్డు ద్వారా జరగాల్సి ఉండగా, అందుకు భిన్నంగా ప్రభుత్వ నిర్ణయం ఉందన్నారు. పోలీసు విధులు నిర్వర్తించే హోం గార్డులను సైతం పోలీసులుగా పరిగణించడం లేదు. అలాంటిది సచివాలయాల్లో విధులు నిర్వహించే మహిళా సంరక్షణ కార్యదర్శులను పోలీసులుగా పరిగణించి కానిస్టేబుళ్లకు ఉండే అధికారాలు కట్టబెట్టడం చట్ట విరుద్ధమన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని హైకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. 1859 ఏపీ డిస్ట్రిక్ట్‌ పోలీసు యాక్ట్‌కు, సివిల్‌ వివాదాల్లో పోలీసులు ఎక్కడా జోక్యం చేసుకోకూడదని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు ఇది పూర్తి విరుద్ధమని పిటిషనర్‌ తరఫు న్యాయవాది బాలాజీ వాదనలు వినిపించారు. దీనిపై పోలీసు విధులు మహిళా కార్యదర్శులకు ఎలా ఇస్తారో చెప్పాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై వెంటనే కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కౌంటర్‌ను పరిశీలించిన తర్వాత మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని ధర్మాసనం పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img