Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సీపీఎస్‌పై చర్చే లేదు

. అసంపూర్తిగా జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం
. ఇతర అంశాలపై మొక్కుబడి చర్చ
. గురుకుల ఉపాధ్యాయుల పదవీ విరమణ 62 ఏళ్లకు పెంపు
. పెన్షన్‌ విధానంపై త్వరలో సమావేశం: మంత్రి బొత్స, సజ్జల

సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో జరిగిన జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం మరోసారి అసంపూర్తిగా ముగిసింది.

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో జరిగిన జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం మరోసారి అసంపూర్తిగా ముగిసింది. ఏపీ సచివాలయంలో మంగళవారం సీపీఎస్‌తోపాటు ఉద్యోగుల పెండిరగ్‌ అంశాలపై ఈ సమావేశం జరిగింది. ప్రధానంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకంపై ఎలాంటి చర్చ జరగలేదు. సీపీఎస్‌ మినహా మిగిలిన అంశాలపైనే మొక్కుబడిగా చర్చించి...ఉద్యోగ, ఉపాధ్యాయుల కన్నీళ్లు తుడిచేలా చర్చ కొనసాగింది. మంత్రుల కమిటీ అధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్‌ఆర్‌), చిరంజీవి చౌదరి, ఆర్థికశాఖ కార్యదర్శి గుల్జార్‌, సర్వీసెస్‌ అండ్‌ హెచ్‌ఆర్‌ శాఖ కార్యదర్శి పి.భాస్కర్‌, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్‌రెడ్డి హాజరయ్యారు. అజెండా అంశాలతోపాటు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు తీసుకొచ్చిన సమస్యలపై కమిటీ చర్చించింది. ఒకటో తేదీకే వేతనాలివ్వాలి: ఎస్టీయూ ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్‌.సాయిశ్రీనివాస్‌, హెచ్‌.తిమ్మన్నతోపాటు వివిధ ఉద్యోగ సంఘాల నేతలు అనేక అంశాలను కమిటీ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల ఆర్థిక అంశాలన్నీ తక్షణమే పరిష్కరించాలని, ఒకటో తేదీ నాడే ఉపాధ్యాయ, ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలన్నారు. సీపీఎస్‌, వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండిరగ్‌ సమస్యలు, ఉద్యోగుల వేతనాలు, పీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ రుణాలు, గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు, 62 ఏళ్ల పదవీ విరమణ అందరికీ వర్తింపజేయడం, పీఆర్సీ బకాయిలు, డీఏ బకాయిల చెల్లింపు, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ వర్తింపు, 2002డీఎస్సీ ద్వారా ఎంపికైన హిందీ పండితులకు పెన్షన్‌, కరోనా వైద్యం బిల్లులు, 2023 జులై నుంచి 12వ పీఆర్సీ కమిటీ ఏర్పాటు, ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలు తదితర అంశాలు పరిష్కరించాలని పట్టుపట్టారు. సీపీఎస్‌పై ఎలాంటి చర్చ జరగకపోవడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగిలిన అంశాలపైనే మొక్కుబడిగా కమిటీ చర్చించింది. సీపీఎస్‌ అనే పదం ప్రస్తావించకుండా పెన్షన్‌ ఎలా అమలు చేయాలనే దానిపై త్వరలో సమావేశం నిర్వహిస్తామని కమిటీ వెల్లడిరచింది. గురుకులాల టీచర్లతోపాటు విద్యా సంబంధిత శాఖల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలని కమిటీ నిర్ణయించింది. సమావేశానికి ఉద్యోగ సంఘాల ప్రతినిధుల నుంచి ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్‌ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.సూర్యనారాయణ, ఏపీఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్‌.సాయి శ్రీనివాస్‌, హెచ్‌.తిమ్మన్న, పీఆర్టీయూ నుంచి ఏఎం గిరి ప్రసాద్‌, యూటీఎఫ్‌ నుంచి ఎన్‌.వెంకటేశ్వర్లు, ఏపీటీఎఫ్‌ నుంచి జి.హృదయరాజు, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సి.గోపాలకృష్ణ, ఎన్‌ఎంఓపీిఎస్‌ అధ్యక్షుడు పి.రామాంజనేయులు, ఏపీ జీఈఏ సీపీఎస్‌ విభాగం అధ్యక్షుడు ఎల్లి యుగంధర్‌, ఏపీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు శ్రావణ కుమార్‌, పీఆర్టీయూ ఏపీ అధ్యక్షుడు ఎం.కృష్ణయ్య, ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వైవీ రావు సహా ఇతర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరణ విషయంలో ప్రభుత్వ సాచివేత ధోరణిని నిరసిస్తూ ఏపీ సీపీఎస్‌ఈఏ చర్చలను బహిష్కరించింది.
పెన్షన్‌ విధానంపై త్వరలో ప్రత్యేక సమావేశం: మంత్రి బొత్స, సజ్జల
జీపీఎస్‌, సీపీఎస్‌ కాకుండా ఉద్యోగుల పెన్షన్‌ విధానంపై త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడిరచారు. సమావేశం వివరాలను మంత్రి మీడియాకు వెల్లడిరచారు. ఉద్యోగుల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గురుకులాల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచినట్లు పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తీసుకొచ్చిన వివిధ డిమాండ్లను సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img