Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

‘సీల్డ్‌’ సూచనలు తీసుకోం

మేమే కమిటీ వేస్తాం
. విచారణలో పూర్తి పారదర్శకత
. మదుపరుల రక్షణే కావాలి
. ‘అదానీ`హిండెన్‌బర్గ్‌’ వ్యవహారంలో సుప్రీంకోర్టు

న్యూదిల్లీ : అదానీ -హిండెన్‌బర్గ్‌ వివాదం విషయంలో కేంద్రం సమర్పించిన సీల్డ్‌ కవర్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. సీల్డ్‌ కవర్‌లో కేంద్రం ఇచ్చిన సూచనలను ఒప్పుకోబోమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు విచారణ పూర్తి పారదర్శకత ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. ఈ వ్యవహారంలో తామే ఒక కమిటీని నియమిస్తామని చెపుతూ తీర్పును వాయిదా వేసింది.
కేంద్రప్రభుత్వం సీల్డ్‌ కవర్‌లో సమర్పించిన సూచనలను స్వీకరించబోమని, ప్రభుత్వం చెప్పింది చేస్తే ప్రభుత్వ కమిటీనే ఏర్పాటు అవుతుందని, మదుపరుల సంరక్షణ, విచారణలో పారదర్శకతకు హామీ లభించబోదని ధర్మాసనం పేర్కొంది. హిండెన్‌బర్గ్‌ నివేదిక వల్ల అదానీ సంస్థల షేర్లు పతనం కావడంతో స్టాక్‌మార్కెట్ల నియంత్రణ చర్యలను బలోపేతం చేసేందుకు నిపుణుల ప్యానల్‌ను ప్రతిపాదిస్తూ సీల్డ్‌కవర్‌ను సుప్రీంకోర్టుకు కేంద్రం శుక్రవారం అందజేసింది. అయితే దానిని సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. సీల్డ్‌కవర్‌లో కేంద్రప్రభుత్వ సూచనలను అంగీకరించేది లేదని తేల్చిచెప్పింది. ఈ వ్యవహారంలో మదుపరుల రక్షణ కోసం పూర్తి పారదర్శకతను కోరుకుంటున్నట్లు వెల్లడిరచింది. ప్రతిపాదిత ప్యానల్‌ పనితీరును సిట్టింగ్‌ జడ్జి పర్యవేక్షించే అంశాన్నీ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ నేతృత్వ ధర్మాసనం కొట్టివేసింది. మదుపరులకు జరిగిన నష్టాన్ని ప్రస్తావించింది. ‘మేము సీల్డ్‌ కవర్‌లో చేసిన సూచనలను అంగీకరించబోం. ఈ వ్యవహారంలో పూర్తి పారదర్శకతను కోరుకుంటున్నాం. సీల్డ్‌కవర్‌లోని సూచనలను మేము స్వీకరిస్తేగనుక పక్క పక్షానికి దాని గురించి తెలియదు. పూర్తి పారదర్శకత.. మదుపరుల సంరక్షణ మాకు ముఖ్యం. అందుకోసం మేమే కమిటీని ఏర్పాటు చేస్తాం. సిట్టింగ్‌ (సుప్రీం) న్యాయమూర్తులు ఈ వ్యవహారాన్ని విచారించవచ్చుగానీ కమిటీలో భాగంగా ఉండకూడదు’ అని సీజేఐ చంద్రచూడ్‌ నేతృత్వ జస్టిస్‌ పీఎస్‌ నరసింహా, జస్టిస్‌ జేబీ పార్దివాలాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. ప్రతిరోజు ధర్మాసనాలను ఏర్పాటు చేయడం తనకు సమస్యగా మారుతోందని సీజేఐ అన్నారు. అదానీ-హిండెన్‌బర్గ్‌ వివాదంపై ఈనెల 13న సుప్రీంకోర్టు విచారించింది. కేంద్రం తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. ఈ వ్యవహారంపై ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇదే క్రమంలో సీల్డ్‌ కవర్‌లో నిపుణుల కమిటీ సభ్యుల పేర్లు, విధివిధానాలతో కూడిన నివేదికను కోర్టుకు తాజాగా అందించారు. దానిని పరిశీలించిన న్యాయస్థానం… సీల్డ్‌కవర్‌లో కేంద్రం సూచించిన పేర్లను, పిటిషనర్ల సూచనలను అంగీకరించబోమని తేల్చిచెప్పింది. పారదర్శకతతో విచారణ జరగాలని, అందుకు తామే నిపుణులను ఎంపిక చేసి కమిటీని నియమిస్తామని పేర్కొంది. ప్రభుత్వం సూచించిన సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తే అది ప్రభుత్వ కమిటీయే అవుతుందని, ప్రజల్లో విశ్వాసం ఉండదని న్యాయస్థానం తెలిపింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తామని సర్వోన్నత న్యాయస్థానం ప్రతిపాదనకు కేంద్రప్రభుత్వం అంగీకరించింది. త్వరగా ఏర్పాటు చేయాలని కోర్టును కోరింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img