Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

సుజల స్రవంతి పూర్తయ్యేనా?

గోదావరి జలాల కోసం ఎదురుచూపులు

. భూ సేకరణకు ఆటంకాలు.
. పరిహారం పెంచాలంటున్న రైతులు

విశాలాంధ్ర – విజయనగరం: వైఎస్‌ హయాంలో అంకురార్పణ… చంద్రబాబు పాలనలో శంకుస్థాపన… జగన్‌మోహన్‌రెడ్డితో పాలనానుమతులు…ఇవీ పోలవరం ఎడమ కాలువ పనుల్లో మలుపులు…ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు ప్రారంభమై నాలుగేళ్లు కావస్తున్నా రైతులకు సాగునీటి కల సాకారం కాలేదు. భూ సేకరణ అడ్డంకులు దాటి కాలువ పనులు పూర్తై రిజర్వాయర్లు కళకళ లాడడానికి సుదీర్ఘ కాలం పట్టే అవకాశం ఉంది. అప్పటి దాకా రైతులు వేచి చూడాల్సిన పరిస్థితే కన్పిస్తోంది. ఉత్తరాంధ్ర ప్రయోజనాలపై చర్చోపచర్చలు, అధికార, విపక్ష నేతల విమర్శ, ప్రతి విమర్శలు సాగుతున్న వేళ సుజల స్రవంతి పనులు జోరందుకుంటాయని భావించినప్పటికీ, పనుల్లో ఆశించిన వేగం కనిపించడం లేదు. గోదావరి జలాలు వృథా కాకుండా ఉత్తరాంధ్రకు తరలించాలని 2009లో నాటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి భావించారు. అయితే ఆయన మరణంతో అప్పట్లో పనులు ముందుకు సాగలేదు. పోలవరం ఎడమ కాలువ ద్వారా రోజుకు 17,561 క్యూసెక్కులు (1.51 టీఎంసీలు) తరలించేలా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని రూపొందించారు. చంద్రబాబు అధికారం చేపట్టాక 2018 నవంబర్‌ 15న చోడవరంలో మొదటి దశ పనులకు శంకుస్థాపన చేశారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్టణం జిల్లాల్లోని 46 మండలాల్లో 8 లక్షల ఎకరాలకు 63.20 టీఎంసీల గోదావరి జలాలు అందించే లక్ష్యంతో రూ.16,568 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఇందులో మొదటి దశకు రూ.2022.20 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. తొలి దశ పనుల్లో విశాఖ జిల్లాలోని 9 మండలాల్లో లక్ష 1.30 లక్షల ఎకరాలకు సాగునీరు, ఆయా గ్రామాలకు తాగునీరు అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. పెదపూడివద్ద 3.15 టీఎంసీల సామర్ధ్యంతో రిజర్వాయర్‌ నిర్మాణం, జుమ్మాదులపాలెం, తీడ గ్రామాల వద్ద రెండు లిఫ్ట్‌లు నిర్మించాలని నిర్ణయించారు. ఇక రెండవ దశలో శ్రీకాకుళం జిల్లా వరకు నీటిని తరలించేందుకు 23 కిలో మీటర్ల లింక్‌ కెనాల్‌, 106 కిలోమీటర్ల లిఫ్ట్‌ కెనాల్‌, 60 కిలో మీటర్ల కోట గండ్రేడు బ్రాంచ్‌ కెనాల్‌ పనులు చేపట్టాల్సి ఉంది.
మొత్తం మీద సుజల స్రవంతి ప్రాజెక్ట్‌ వల్ల విశాఖ జిల్లాలో 3.21 లక్షల ఎకరాలకు, విజయనగరం జిల్లాలో 3.94 లక్షల ఎకరాలకు, శ్రీకాకుళంలో 85 వేల ఎకరాలకు సాగునీరందుతుంది. జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక 1700 కోట్ల రూపాయల పనులకు పరిపాలనా అనుమతులిచ్చారు. వివిధ దశల్లో ఉన్న పనులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది.
భూ సేకరణకు అడ్డంకులు సుజల స్రవంతి ప్రాజెక్ట్‌కు సంబంధించి విజయనగరం జిల్లాలోని 24 మండలాల్లో భూ సేకరణ జరగాల్సి ఉంది. ఇప్పటికే అధికారులు భూ సేకరణలో నిమగ్నమయ్యారు. అయితే రైతాంగం మాత్రం కాలువ డిజైన్‌ మార్చాలని, పరిహారం పెంచాలనే డిమాండ్‌ చేస్తున్నారు. తమ పంట భూముల్లో కాలువ తవ్వనివ్వబోమని, కాలువ డిజైన్‌ మార్చాలని భూ సేకరణ నిమిత్తం వేపాడకు వెళ్లిన అధికారులకు రైతులు తెగేసి చెప్పారు. పోలవరం ఎడమ కాలువ పేరుతో మండలంలో 250 మంది రైతుల నుంచి 179 ఎకరాలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గుర్ల మండలం పకీరు కిత్తలిలో అధికారులకు ఇటువంటి అనుభవమే ఎదురైంది. సుజల స్రవంతి భూ సేకరణ సభలో భూమి కోల్పోయిన రైతులకు మెట్టకు రూ.10 లక్షలు, పల్లానికి రూ.13.25 లక్షల పరిహారం ఇస్తామని అధికారులు తెలిపారు. స్థానికంగా ఎకరాకు 60 లక్షల మార్కెట్‌ ధర ఉండడంతో రైతులు ప్రభుత్వ పరిహారం వైపు మొగ్గు చూపలేదు. డిజైన్‌ మార్చాలని, పరిహారం పెంచాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. అనేక మలుపులతో సుజల స్రవంతి ముందుకు సాగుతోంది. వీలైనంత త్వరగా గోదావరి నీరు అందాలని రైతులు ఆకాంక్షిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img