Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సుప్రీంకు ఆర్‌-5 జోన్‌ వివాదం

. హైకోర్టు స్టే నిరాకరణతో వేగం పెంచిన ప్రభుత్వం
. మౌలికవసతుల పేరుతో ఆగమేఘాలపై టెండర్లకు ఆహ్వానం
. అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన రైతులు
. 14న విచారిస్తామన్న సీజేఐ

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఏపీ రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి ఇళ్లస్థలాలు కేటాయించేందుకు ఆర్‌-5 జోన్‌ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయంపై అమరావతి ప్రాంత రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రైతులు దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట సీనియర్‌ న్యాయవాది దామా శేషాద్రినాయుడు ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీనిపై ఈనెల 14న విచారణ చేపడతామని సీజేఐ స్పష్టంచేశారు. 10న విచారణకు తీసుకోవాలని రైతుల తరపున కోరగా ఆరోజు కేసుల జాబితా ఇప్పటికే తయారైందని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తెలిపారు. అందుకే పిటిషన్‌ను 14న విచారణకు తీసుకుంటామని చెప్పారు. అమరావతి రైతులు ఆర్‌-5 జోన్‌పై ఇప్పటికే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందిన పేదలకైనా రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు వీలుగా బృహత్‌ ప్రణాళిక(మాస్టర్‌ ప్లాన్‌)లో మార్పులు చేసిన ప్రభుత్వం ఆర్‌-5 జోన్‌ను కూడా ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. హైకోర్టులో రైతులకు స్టే రాకపోవటంతో ఇదే అదనుగా భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. కోర్టు పరిధిలో ఉన్న నివాస స్థలాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు టెండర్లు పిలవాలని సీఆర్‌డీఏను నిర్దేశించింది. దీంతో సీఆర్‌డీఏ ఉన్నతాధికారులు బుధవారం ఆగమేఘాల మీద రూ.50 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచారు. ఇది కూడా అధికారపార్టీకి చెందిన పత్రికలో మాత్రమే టెండర్‌ ప్రకటనను ప్రచురించారు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల కల్పనలో భాగంగా ఆరు పనులకు టెండర్లు పిలిచారు. ఇ-ప్రొక్యూర్‌మెంట్‌ పోర్టల్‌లో ఏప్రిల్‌ 6వ తేదీ నుంచి పనుల వివరాలు అందుబాటులో ఉంటాయని సీఆర్‌డీఏ కమిషనర్‌ ప్రకటించారు. టెండర్లలో పాల్గొనేవారు బిడ్లను సమర్పించటానికి ఈనెల 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువిచ్చారు. అదేరోజు ఆరు గంటలకు టెక్నికల్‌ బిడ్లను తెరుస్తారు. ఆర్‌-5 జోన్‌లో ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాలకు చెందిన 49 వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వటానికి సిద్ధం కావాలని ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో రెండు జిల్లాల కలెక్టర్లకు నిర్దేశించింది. దీనికిముందుగా ప్రభుత్వం రహస్యంగా జీవో ఎంఎస్‌ 45 ద్వారా ఆర్‌`5 జోన్‌లోని 1134.58 ఎకరాలలో ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన 24 వేలమంది లబ్ధిదారులకు 583.93 ఎకరాలు, గుంటూరు జిల్లాకు చెందిన లబ్ధిదారులకు 550.65 ఎకరాలు కేటాయించినట్లు విడుదల చేసింది. దీనిపై రాజధాని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం తీసుకున్న భూముల విషయంలో భూ సమీకరణ ఒప్పందాలు, రాజధాని మాస్టర్‌ ప్లాన్‌, సీఆర్‌డీఏ చట్టాలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img