Friday, April 19, 2024
Friday, April 19, 2024

సెంచరీ దాటిన టమాటా ధర

రైతుకు దక్కేది కిలోకు 50 రూపాయలే…
దళారులు, బడా వ్యాపారులకే లాభాలు
సాగు విస్తీర్ణం తగ్గడం, ఎగుమతులు పెరగడంతో ఇక్కట్లు

విశాలాంధ్ర బ్యూరో-విశాఖపట్నం : టమాటా ధర సెంచరీ దాటింది. కిలో వంద రూపాయలు దాటి వినియోగదారులను బెంబేలెత్తిస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రధాన కూరగాయల మార్కెట్లో టమాటా నాణ్యతను బట్టి కిలో రూ.100 నుంచి 120కి పైగానే విక్రయిస్తున్నారు. రైతు బజార్‌ల్లో గంటల తరబడి క్యూలో నిలబడి కిలో టమాటా కోసం మండుటెండలో నిరీక్షించాల్సి దుస్థితి నెలకొంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని అన్నీ ముఖ్య పట్టణాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. టమాటా లేనిదే ఏ కూర వండ లేని పరిస్థితి. దీంతో పెరిగిన ధరల కారణంగా సామాన్య, పేద, మధ్య తరగతి ప్రజలు టమాటా ని ముట్టుకోవాలంటే భయపడుతున్నారు. బోరుబావుల కింద సాగు చేసిన టమాటా, బీర, బెండ తోటలు చివరి దశకు చేరడంతో ధరలు చుక్కలనంటుతున్నాయి. స్థానికంగా దిగుబడులు లేకపోవడంతో అధిక ధరలు పలుకుతున్నాయి. జిల్లాలకే కాకుండా బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై, విశాఖపట్నం వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. తాజాగా నాణ్యతను బట్టి కిలో రూ.100-120కి విక్రయిస్తున్నారు. వీధి వ్యాపారులైతే కిలో రూ.150 వరకు అమ్ముతున్నారు. ధర ఇంత ఉన్నా రైతులు, వినియోగదారులు మాత్రం నష్టపోతుండగా దళారులు, బడా వ్యాపారులు బాగా లాభపడుతున్నారు. మార్కెట్‌లో టమాటా క్రేట్‌ (30 కిలోలు) నాణ్యతను అనుసరించి రూ.1,800 నుంచి 2,500 పలుకుతోందని రైతులు అంటున్నారు. అంటే సగటున రూ.2 వేలకు మించదు. కిలో రూ.65 పడుతుంది. ఈ మొత్తం రైతుకు చేరితే అన్నదాత ఆర్థికంగా లాభపడినట్టే.
అయితే ఇక్కడే మాయాజాలం ఉంది. మార్కెట్‌కు రైతులు టమాటా దిగుబడులు అమ్మకానికి తీసుకెళితే, కమీషన్‌ ఏజెంట్‌ (దళారి) కి జాక్‌పాట్‌ కింద పది క్రేట్‌లకు ఒక క్రేట్‌ ఉచితంగా ఇవ్వాలి. అమ్మకం మొత్తంలో 10 శాతం రిటర్న్‌ కమీషన్‌ (క్రేట్‌ రూ.2 వేలు పలికితే రూ.200), మరో పది శాతం కమీషన్‌ కలిపి 20 శాతం ఇవ్వాలి. ఇది కాదని క్రేట్‌ బాడుగ రూ.4, హమాలీ రూ.2, రవాణా రూ.30 కలిపి 30 కిలోల క్రేట్‌ రూ.2 వేలకు అమ్ముడుపోతే వివిధ రూపాల్లో రూ.636 పోనూ రైతుకు వచ్చేది క్రేట్‌పైన రూ.1,364లే. అంటే.. కిలో రూ.45 మించదు. మార్కెట్లో అమ్ముతున్నది మాత్రం కిలో రూ.100 పైమాటే. రైతుకు`వినియోగదారుల మధ్య కిలోకు రూ.50-55 దళారులు, కమిషన్‌ ఏజెంట్లు, వ్యాపారులు లాభపడుతున్నారు. జిల్లాల్లో అంతటా ఇదే రకమైన దోపిడీ సాగుతోంది. మార్కెట్‌ మాయాజాలాన్ని అరికడితే పండిరచిన రైతులు, చివరిగా కొనుగోలు చేసే వినియోగదారులు లాభపడే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మరోవైపు టమాటాతో పాటు కూరగాయల ధరలు కూడా మండుతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img