Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

సెంటు చాలదని ముందే చెప్పాం

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర ` విశాఖ : పేదలకు ఇళ్ల స్థలాలు, జగనన్న ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు తీర్పు హర్షణీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు విశాఖలో ఒక ప్రకటన విడుదల చేశారు. పేదల గృహాల నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మూడు జీవోలలోని అనేక నిబంధనలను హైకోర్టు కొట్టివేసిందని తెలిపారు. పట్టణాల్లో సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర స్థలం కేటాయింపులను హైకోర్టు తప్పుపట్టిందన్నారు. సెంటు స్థలంలో గ ృహ సముదాయాల నిర్మాణం వల్ల ఆరోగ్య సమస్యలు, అగ్ని ప్రమాదాలు, మంచినీటి సమస్యలు వచ్చే ప్రమాదముందని పేర్కొందన్నారు. హైకోర్టు ఆదేశాలను సీపీఐ స్వాగతిస్తోందని తెలిపారు. ఇల్లు నిర్మించుకుని ఒక కుటుంబం నివసించేందుకు సెంటు స్థలం ఏ మాత్రం అనుకూలంగా ఉండదన్నారు. జగనన్న ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన భూమి పట్టణాలకు సుదూరంగా ఉండటంతోపాటు కొద్దిపాటి వర్షపు నీటికే మునిగిపోయే విధంగా పల్లపు ప్రాంతాలుగా, శ్మశాన స్థలాలుగా, కొండ ప్రాంతాలుగా ఉన్నాయన్నారు. ఇళ్ల స్థలాలకు భూసేకరణ కోసం ప్రభుత్వం రూ.7 వేల కోట్లు వెచ్చించిందన్నారు. ఇళ్ల స్థలాలకు భూముల కొనుగోళ్లు, మట్టి తోలి చదును చేయటం వంటి పనుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నేతలు దాదాపు 2 వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయన్నారు. తొలుత పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి, ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇస్తుందని చెప్పిన జగన్మోహన్‌ రెడ్డి తరువాత మాట మార్చారని విమర్శించారు. కేటాయించిన స్థలాల్లో లబ్ధిదారులే గృహ నిర్మాణాలు చేపట్టాలని, ప్రభుత్వం రూ.1,80,000 మాత్రమే ఇస్తుందని చెపుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే ఈ మొత్తం పునాదులు వరకే సరిపోతుందన్నారు. మిగిలిన ఇంటి నిర్మాణం కోసం పేదలు అప్పులు చేయక తప్పని పరిస్థితి ఎదురయ్యే ప్రమాదముందన్నారు. మరో పక్క కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించి టిడ్కో ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. టిడ్కో గృహ సముదాయాలకు మౌలిక వసతులు కల్పించి, లబ్ధిదారులకు ఇళ్లు స్వాధీన పరచకుండా తాత్సార వైఖరి ప్రదర్శిస్తున్నారని అన్నారు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించాలని, టిడ్కో గృహ సముదాయాలను లబ్ధిదారులకు స్వాధీనపరచాలని సీపీఐ ముందు నుంచే డిమాండ్‌ చేస్తూ అనేక రూపాలలో ఆందోళనలు చేపట్టిందని గుర్తుచేశారు. హైకోర్టు తీర్పుతోనైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవాలన్నారు. ప్రభుత్వమే పేదలకు నివాసయోగ్యమైన ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని లేదా ఒక్కో ఇంటి నిర్మాణానికై రూ.5 లక్షల చొప్పున మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img