Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

స్ట్రెచర్‌పై గర్భిణిని 8 కిలోమీటర్లు మోసుకుంటూ..

అటవీ గ్రామాల్లో రహదారి సౌకర్యం లేక సమస్య
మధ్య ప్రదేశ్‌లోని బర్వానిలో ఘటన

పాలకుల నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారుతున్న ఘటనలు తరచూ దర్శనమిస్తూనే ఉన్నాయి. తాజాగా మధ్య ప్రదేశ్‌కు చెందిన బర్వాని జిల్లాలోని ఒక గ్రామంలో సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో 20 ఏళ్ల వయస్సున్న ఒక గర్భిణిని ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి ఆమె బంధువులు తీవ్రంగా కష్టపడ్డారు. ఆమెను స్ట్రెచర్‌పైనే 8 కిలో మీటర్లు మోసుకువెళ్లారు. గురువారం కొంతమంది వ్యక్తులు ఖామ్‌ఘాట్‌ గ్రామం నుండి రాణికజల్‌కు వెదురు కర్రలు, వస్త్రాలతో తయారు చేసిన ఒక స్ట్రెచర్‌పై మహిళను మోసుకుంటూ వెళుతున్న వీడియో ఒకటి వైరల్‌ అయ్యింది. వారిని మహిళ కుటుంబ సభ్యులు, గ్రామస్తులుగా తర్వాత గుర్తించారు. ఆ మహిళను స్ట్రెచర్‌పై ఖామ్‌ ఘాట్‌ నుండి రాణికంజల్‌కు 8 కిలో మీటర్ల దూరం మోసుకువెళ్లారని, తర్వాత అక్కడి నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని పన్సెమల్‌ ఆసుపత్రికి అంబులెన్స్‌లో తీసుకువెళ్లినట్లు గ్రామస్తులలో ఒకరైన రాయ్‌ సింగ్‌ తెలిపారు. ‘మేము చాలా కాలం క్రితం మా గ్రామం నుండి రహదారి నిర్మాణం కోసం దరఖాస్తు చేశాము. కానీ మా అభ్యర్థనలపై ఎవరూ చర్య తీసుకోలేదు. రహదారి లేనప్పుడు వాహనాలు గ్రామానికి చేరుకోలేవు. దీంతో ఆసుపత్రికి వెళ్లాలంటే చాలా కష్టం’ అని సింగ్‌ వివరించాడు. పన్సెమల్‌ బ్లాక్‌ మెడికల్‌ ఆఫీసర్‌ (బిఎంఓ) డాక్టర్‌ అరవింద్‌ కిరాడే మాట్లాడుతూ గర్భిణిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లమని మహిళా కుటుంబ సభ్యులను ఆరోగ్య కార్యకర్తలు ప్రోత్సహించారని చెప్పారు. అయితే ఖామ్‌ఘాట్‌ నుండి రాణికంజల్‌కు రహదారి సౌకర్యం లేకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆమెను స్ట్రెచర్‌పై మోసుకువచ్చినట్లు వివరించారు. పన్సెమల్‌ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యుడు కిరాడే తెలిపారు. ఈ వైరల్‌ వీడియో గురించి ప్రశ్నించినపుడు జిల్లా పంచాయతీ కార్యనిర్వాహక అధికారి రితురాజ్‌ సింగ్‌ మాట్లాడుతూ రహదారి సమస్యను సంబంధిత విభాగం దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. ‘అటవీ గ్రామాల్లో రహదారుల నిర్మాణం చేయడానికి సంబంధిత విభాగం నుంచి నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్‌(ఎన్‌వోసీ) పొందడం ప్రధాన సమస్య. ప్రధాన మంత్రి గ్రామీణ రహదారి పథకం కింద రహదారిని నిర్మాణం చేయడానికి సంబంధిత విభాగంతో మాట్లాడుతాను’ అని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img