Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

స్థానిక సంస్థలకు అధికారాలు బదలాయించాలి

యురేనియం మైనింగ్‌ కాలుష్యంపై చర్యలు చేపట్టాలి
సీపీఐ రాష్ట్ర సమితి డిమాండ్‌

అమరావతి : స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు 73, 74 రాజ్యాంగ సవరణలకు అనుగుణంగా అధికా రాలను స్థానిక సంస్థలకు తక్షణమే బదలా యించాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర సమితి తీర్మానించింది. సీపీఐ రాష్ట్ర సమితి సమావేశం ఆదివారం విజయవాడలోని దాసరిభవన్‌లో కేవీవీ ప్రసాద్‌ అధ్యక్షతన జరిగింది. జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ జాతీయ రాజకీయ పరిణామాలను వివరించారు. రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ రాజకీయ, కార్యకలాపాల నివేదికను, భవిష్యత్‌ కర్తవ్యాలను ప్రవేశపెట్టారు. చర్చల అనంతరం సమావేశం 73, 74వ రాజ్యాంగ సవరణపై, కడప జిల్లాలో యురేనియం మైనింగ్‌ ప్లాంట్‌పై, కృష్ణానదీ జలాలపై, సీపీఎస్‌ రద్దుపై తీర్మానాలను ఆమోదించింది. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం పంచాయతీరాజ్‌ సంస్థలకు 29 అంశాలపై, 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం మునిసిపాలిటీలలో 17 అంశాలపై అధికారాలను బదిలీ చేయాలని సూచించింది. కేరళ రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఈ సవరణల ద్వారా అధికారాలను బదలాయించడంతో స్థానిక సంస్థలు బలోపేతమై ప్రజలకు సేవలు త్వరితగతిన అందుతూ వారి అభివృద్ధికి తోడ్పడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికీ ఈ అధికారాలను బదలాయించకపోగా గత పంచాయతీ ఎన్నికల్లో 80శాతానికి పైగా పంచాయతీలను కైవసం చేసుకున్న వైసీపీ 14వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీ ఖాతాల్లో జమ అయిన వెంటనే సర్పంచ్‌ల చెక్‌ పవర్‌ను రద్దుచేసి, ఆ నిధులను ప్రభుత్వం తన ఖాతాలో బదలాయిం చుకున్న తర్వాత మళ్లీ ఇప్పుడు పంచాయతీ

సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌ను ఇచ్చిందని తెలిపింది. మునిసిపాలిటీలలో ఆస్తి, చెత్త తదితర పన్నులను ఎన్నికయిన సంస్థలు స్వయంగా నిర్ణయించుకునే హక్కును కాలరాస్తూ రాష్ట్ర ప్రభుత్వమే ఈ పన్నులను నిర్ణయిస్తున్నందున ఎన్నికయిన ప్రజాప్రతినిధులు ప్రజలకు సమాధానం చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయిందని తీర్మానం పేర్కొంది. స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడిరదని, ఈ చర్య పూర్తిగా అప్రజాస్వామికమని తెలిపింది. స్థానిక ప్రభుత్వాలుగా పిలవబడే స్థానిక సంస్థలకు తక్షణమే 73, 73 రాజ్యాంగ సవరణల ప్రకారం అధికారాలను బదలాయించాలని డిమాండు చేసింది.
కడప జిల్లాలోని తుమ్మలపల్లి యురేనియం మైనింగ్‌ కాలుష్యంపై కాలుష్య నియంత్రణ మండలి ఎందుకు చర్యలు చేపట్టడం లేదని సమావేశం ప్రశ్నించింది. 2013 నుంచి యూసీఐఎల్‌పై ఆ ప్రాంతం నుంచి వందల సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయని, పశువులు చనిపోతున్నాయని, నీరు కలుషితమైందని, పశువులు, ప్రజలు వింత వ్యాధులకు గురవుతున్నారని పేర్కొంది. భూగర్భ జలాలు ఇంకి పోతున్నాయని, పంటలు పాడయ్యాయని, అనేకసార్లు మబ్బుచింతలపల్లె, భూమయ్యగారి పల్లె, కణం కింది కొట్టాల, తుమ్మలపల్లె, వేముల నుంచి తరచూ ఫిర్యాదులు చేస్తున్నారని తెలిపింది. చివరకు 2018 యూసీఐఎల్‌కు కాలుష్య నియంత్రణ మండలి షోకాజ్‌ నోటీసులు ఇచ్చిందని, ఇప్పటివరకు ఆ సంస్థపై ఎలాంటి చర్యలు లేవని, పై పెచ్చు ప్లాంట్‌ విస్తరణ కోసం వారు సన్నాహాలు చేస్తున్నారని పేర్కొంది. కడపజిల్లా ప్రజల జీవితాలపట్ల ఇంతటి బాధ్యతా రాహిత్యం ఎందుకంటూ ప్రశ్నించింది. నిబంధనలు ఎవరికైనా ఒకటే అయినప్పుడు యురేనియం మైనింగ్‌ ప్లాంట్‌ను పూర్తిగా మూసివేయాలని సూచించింది. అక్కడ ఉపాధి పొందుతున్న రెండువేలకుపైగా ఉద్యోగులకు, కార్మికులకు వేరేచోట ఉద్యోగాలు ఇచ్చి నష్టపోయిన పంటలకు, జీవాలకు, ప్రజల ఆరోగ్యానికి పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని సీపీఐ డిమాండు చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img