Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

స్పందించకపోతే… చర్యలు తప్పవు

. అధికారులకు సుప్రీం హెచ్చరిక
. మతం పేరుతో విద్వేష ప్రసంగాలా?
. మూడు రాష్ట్రాలకు నోటీసులు

న్యూదిల్లీ : విద్వేషపూరిత ప్రసంగాలపై అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. అధికారులు చర్యలు తీసుకోకపోతే ధిక్కార చర్యలు తప్పవని హెచ్చరించింది. ప్రస్తుతం 21వ శతాబ్దంలో ఉన్నామని, ఇప్పటికీ మతం పేరుతో దూషించుకుంటూ మనం ఎక్కడికి వెళుతున్నామని ప్రశ్నించింది. విద్వేషపు ప్రసంగాలపై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. భారత్‌ ఓ లౌకికదేశం. రాజ్యాంగమే భారత్‌ను లౌకికదేశంగా పేర్కొన్నది. అలాంటి దేశంలో విద్వేష ప్రసంగాలకు చోటు లేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. విద్వేష ప్రసంగాలను తీవ్రమైన అంశంగా పేర్కొన్నది. విద్వేష ప్రసంగాలపై కఠినచర్యలు తీసుకోవడం ద్వారా మతసామరస్యతను పరిరక్షించాలని ఆదేశించింది. విద్వేష ప్రసంగాలకు పాల్పడిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని, ఎవరి ఫిర్యాదు కోసమో వేచి చూడాల్సిన అవసరం లేదని, నిందితులపై సుమోటోగా క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు దిల్లీ, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. కేసుల నమోదులో జాప్యం చేస్తే తీవ్రమైన అంశంగా పరిగణించి… అధికార యంత్రాంగాన్ని కోర్టుకి పిలుస్తామని హెచ్చరించింది. మన రాజ్యాంగంలో భారత్‌ను లౌకికదేశంగా పేర్కొన్నారు. పౌరుల మధ్య సౌభ్రాతృత్వం అవసరం. దేశ ఐక్యత, సమగ్రత అనే ఆదేశిక సూత్రాలు రాజ్యాంగం పీఠికలో పొందుపర్చారు.
వీటిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. జర్నలిస్టు షహీన్‌ అబ్దుల్లా దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌లతో కూడిన ధర్మాసనం మూడు ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. భారతదేశ లౌకికవాదానికి భంగం కలిగిస్తే..మతాలతో సంబంధం లేకుండా విద్వేష ప్రసంగం చేసిన వారిపై తీరవమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇప్పటి వరకు జరిగిన విద్వేష ప్రసంగాలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. భవిష్యత్‌లో ఇలాంటి ప్రసంగాలు చేసిన వారిపై ఫిర్యాదుతో సంబంధం లేకుండా సుమోటోగా కేసులు నమోదు చేయాలని సూచించింది. కిందిస్థాయి అధికారుల వరకు తమ ఆదేశాలను పంపాలని తెలిపింది.
దేశవ్యాప్తంగా విద్వేష నేరాలు, విద్వేష ప్రసంగాలకు సంబంధించిన ఘటనలపై స్వతంత్ర, విశ్వసనీయ, నిష్పక్షపాత విచారణ జరిపేలా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని అబ్దుల్లా సుప్రీంకోర్టుకు విన్నవించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img