Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

హడావుడితో అనర్థం

25వేల మందికి గుండెకోత
సచివాలయ ఉద్యోగ నియామకాల్లో అధికారుల నిర్వాకం

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నిర్వహించిన శాఖా పరమైన పరీక్షల్లో అదనపు సిలబస్‌, పేపర్లతో గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు దాదాపు 25వేల మంది ఉద్యోగాల క్రమబద్దీకరణ అవకాశాన్ని కోల్పోయారు. దీంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హడావుడిగా గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రవేశపెట్టింది. దీని ద్వారా స్థానికంగా ప్రజా సంక్షేమం, ప్రభుత్వ కార్యకలాపాలను సులభతరం చేసింది. వాటి నిర్వహణ కోసం దాదాపు లక్షా 35వేల మంది సిబ్బందిని పోటీ పరీక్ష ద్వారా ఎంపిక చేసింది. వారందరి ఉద్యోగాలను రెండేళ్ల తర్వాత క్రమబద్దీకరిస్తామని ప్రభుత్వం వెల్లడిరచింది. అనుకున్న తరహాగానే రెండేళ్ల తర్వాత గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులను శాఖాపరమైన పరీక్షలతోనే ఎంపిక చేస్తామంటూ ప్రభుత్వం మెలిక పెట్టింది. దాంతో చాలా మంది ఆందోళనకు గురయ్యారు. ప్రభుత్వం పెట్టిన నిబంధనలకు అనుగుణంగా ఏపీపీఎస్సీ ద్వారా శాఖా పరమైన పరీక్షలను సచివాలయ వ్యవస్థలోని వివిధ విభాగాల సిబ్బంది రాసి, అర్హత సాధించారు. అదే కోవలో చాలా మందికి అర్హత కల్పించకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. అటు గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల క్రమబద్దీకరణ ప్రక్రియ పూర్తిచేసి, జులై నుంచి పే స్కేల్‌ ప్రకారం వేతనాలు ఇస్తామని సీఎం జగన్‌ ప్రకటించిన విషయం విదితమే. ఆ మేరకు సచివాలయ ఉద్యోగులంతా శాఖాపరమైన పరీక్షల్లో అర్హత సాధించలేక పోయారు. అధికారుల గణాంకాల ప్రకారం దాదాపు సగం మంది శాఖాపరమైన పరీక్షల్లో అర్హత సాధించలేదని స్పష్టం చేస్తున్నారు. దీంతో వారి ఉద్యోగాల క్రమబద్దీకరణ ప్రశ్నార్థకంగా మారింది.
ఏపీపీఎస్సీ మొక్కుబడిగా 3 పరీక్షలే
ఏపీపీఎస్సీ అధ్వర్యంలో రెండేళ్లల్లో ఐదు విడతలు గా శాఖాపరమైన (డిపార్టుమెంట్‌) పరీక్షల్ని నిర్వహించాల్సి ఉండగా, కేవలం మూడు పరీక్షల తోనే సరిపెట్టారు. దీంతో గ్రామ/వార్డు సచివాల యానికి చెందిన సిబ్బంది శాఖాపరమైన పరీక్షల్లో అనర్హత సాధించారు. వేలాది మంది తమ ఉద్యోగా ల క్రమబద్దీకరణకు దూరమయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఏపీపీఎస్సీ మొదటగా నిర్వహించిన పరీక్షల్లో చాలా మంది ఉద్యోగులు కరోనా విధుల్లో ఉండి, దరఖాస్తు చేసుకోలేక పోయారు. కొంతమంది దరఖాస్తు చేసుకున్నప్ప టికీ, కరోనా విధుల ఒత్తిడితో పరీక్షలకు హాజరుకాలేక పోయారు. రెండో విడత ఏపీపీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో సచివాలయ చాలా మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకుని, పరీక్షలు రాశారు. ఈ పరీక్షకు ఏపీపీఎస్సీ అధికారులు వేగవంతంగా ఫలితాలు ఇవ్వాలనే ఉద్దేశంతో, సమాధాన పత్రాలపై అభ్యర్థుల అభ్యంతరాల్ని స్వీకరించకుండానే హడావుడిగా ఫలితాలను వెల్లడిరచారు. దీంతో చాలా మందికి అన్యాయం జరిగింది. ఉద్యోగులు ఒక్కటి, రెండు మార్కుల తేడాతో అర్హతను కోల్పోయారు. ఆ తర్వాత గ్రామ/వార్డు ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఏపీపీఎస్సీ శాఖా పరమైన పరీక్షలు నిర్వహించింది. వారి కోసం 8 నుంచి 10 పేపర్లు రాసుకునేందుకు ఏపీపీఎస్సీ అవకాశం కల్పించలేదు. దీంతో దాదాపు 25 వేల మంది శాఖా పరమైన పరీక్షల్లో అర్హత సాధించలేక, వారి ఉద్యోగాల క్రమబద్దీకరణకు దూరమవుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏపీపీఎస్సీ శాఖా పరమైన పరీక్షలు నిర్వహించినప్పటికీ, అందులో సిలబస్‌లో లేని ప్రశ్నావళి ఇవ్వడంతో కేవలం పది శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు ప్రకటించింది. ఈ విధానాలతో గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు మళ్లీ అర్హత సాధించలేక పోయారు. మళ్లీ ఎప్పుడు ఏపీపీఎస్సీ శాఖా పరమైన పరీక్షల్ని నిర్వహిస్తుందో, వారి ఉద్యోగాల క్రమబద్దీకరణ ఎప్పటికి పూర్తవుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు.
సిలబస్‌లోని ప్రశ్నలకు గ్రేస్‌ మార్కులు ఇవ్వాలి: ఏపీ జీడబ్ల్యూఎస్‌యూఎస్‌
గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీపీఎస్సీ నిర్వహించిన గత శాఖా పరమైన(డిపార్టుమెంటల్‌) పరీక్షలకు సిలబస్‌లో లేకుండా వచ్చిన వాటికి గ్రేస్‌ మార్కులు ఇవ్వాలని ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సమాఖ్య (ఏపీ జీడబ్ల్యూఎస్‌యూఎస్‌) డిమాండు చేసింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ సెక్రటరీ అరుణ్‌కుమార్‌కు సమాఖ్య గౌరవాధ్యక్షులు ఎవీ నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎం.గురుస్వామి అధ్యక్షురాలు కె.అనూరాధ తదితరులు శుక్రవారం వినతిపత్రాన్ని అందచేశారు.
రాబోయే శాఖాపరమైన పరీక్షలను ఏపీపీఎస్సీ తక్షణమే నిర్వహించి, ఫలితాలను సకాలంలో వెల్లడిరచాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img