Friday, April 19, 2024
Friday, April 19, 2024

హామీలు నిలబెట్టుకోకపోతే మళ్లీ ఉద్యమిస్తాం

కేంద్రానికి రైతు సంఘాల స్పష్టీకరణ
ఏకాభిప్రాయం కుదరడంతో ఆందోళన విరమణ
11న మరో భేటీ : ఆరోజు నుంచి దిల్లీ సరిహద్దులు ఖాళీ

న్యూదిల్లీ : కొత్త సాగు చట్టాల రద్దును స్వాగతించిన రైతు సంఘాలు తమ పెండిరగ్‌ డిమాండ్లపై స్పష్టత ఇవ్వాలని కేంద్రప్రభుత్వాన్ని కోరగా సానుకూల స్పందన రావడంతో ఉద్యమాన్ని విమరించాలని నిర్ణయించాయి. ఇదే విషయాన్ని 40 రైతు సంఘాల ఛత్రసంస్థ సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) ప్రకటించింది. ఇచ్చిన హామీల అమలులో జాప్యం/వైఫల్యం ఉంటే మరోమారు ఉద్యమిస్తామని కేంద్రాన్ని హెచ్చరించింది. అన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదరడంతో ఆందోళనను ఉపసంహరిస్తున్నామని తెలిపింది. ఈనెల 11న ఎస్‌కేఎం మరోమారు భేటీ కానుంది. అదే రోజు నుంచి దిల్లీ సరిహద్దులు ఖాళీ కానున్నాయి. రైతులంతా తమ ఇళ్లకు తిరిగి వెళ్లనున్నారు. అయితే ఏడాదికిపైగా చరిత్రాత్మకంగా సాగిన ఉద్యమాన్ని ఘనంగా ముగించాలని నిర్వాహకులు భావిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకు వచ్చిన మూడు కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దులో ఏడాదికిపైగా సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో పోరాటాలు సాగాయి. రైతుల పట్టుదలకు తలొగ్గిన కేంద్రం.. ఆ మూడు చట్టాలను ఉపసంహరిస్తూ పార్లమెంటులో బిల్లు పెట్టింది. ఎంఎస్‌పీ చట్టంతో పాటు రైతులపై కేసుల ఉపసంహరణ, అమర రైతుల కుటుంబాలకు పరిహారం వంటి అంశాలపై సముచిత ప్రతిపాదనతో కేంద్రం ముందుకు వచ్చింది. ఎంఎస్‌పీపై కమిటీ వేస్తామని, ఆందోళన విరమించాలని రైతులను కోరింది. తమ డిమాండ్ల విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందించి కావాల్సిన హామీలు ఇవ్వడంతో దిల్లీ సరిహద్దులను ఖాళీ చేసేందుకు రైతు సంఘాలు సుముఖత వ్యక్తం చేశాయి. శనివారం నుంచి ఇంటి బాట పట్టనున్నారు. ఇదే విషయాన్ని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) గురువారం అధికారికంగా ప్రకటించింది. 11వ తేదీ నుంచి దిల్లీ సరిహద్దుల నుంచి రైతుల నిష్క్రమణ మొదలవుతుందని తెలిపింది. కీలక అంశాలపై ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేసింది. రైతుల పెండిరగ్‌ డిమాండ్లపై కేంద్రప్రభుత్వం తన ప్రతిపాదనను సవరించి పంపిన నేపథ్యంలో ఏకాభిప్రాయం కుదిరిందని ఎస్‌కేఎం వెల్లడిరచింది. అధికారికంగా లెటర్‌ హెడ్‌పై హామీలను కోరగా కేంద్రం సానుకూలంగా స్పందించింది. దాంతో సరిహద్దులు ఖాళీ చేయాలని నిర్ణయించుకున్నామని ఎస్‌కేఎం వర్గాలు తెలిపాయి. రైతులపై కేసులు ఉపసంహరించేందుకు ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హరియాణా రాష్ట్రాల ప్రభుత్వాలు అంగీకరించాయి. దిల్లీలో రైతులపై పెట్టిన కేసులనూ కొట్టివేయనున్నారు. దిల్లీలోని సింఘు, టిక్రీ, ఘాజీపూర్‌ సరిహద్దుల్లో 2020 నవంబరు 26 నుంచి రైతుల ఉద్యమం కొనసాగుతోంది. ఈనెల 11న ఆర్భాటంగా తమ ఉద్యమానికి రైతులు ముగింపు పలకనున్నారు. 11వ తేదీకి రైతులు సింఘు వద్ద ఆందోళనను ప్రారంభించి 380 రోజులు అవుతాయి. ఆ రోజు నుంచి ఆందోళనకారులంతా ఇళ్లకు తిరిగి వెళతారు. ఎస్‌కేఎం నేత బల్బీర్‌ సింగ్‌ రాజేవాల్‌ విలేకరులతో మాట్లాడుతూ, రైతుల హక్కుల కోసం పోరు ఆగదు’ అని అన్నారు. ఇదిలావుంటే, జనవరి 15న దిల్లీలో ఎస్‌కేఎం భేటీ కానుంది. ఈలోగా ఇచ్చిన వాగ్దానాలను కేంద్రం నిలబెట్టుకుందా లేదా అన్నది సమీక్షిస్తుంది. రైతులందరికి కనీస మద్దతు ధర హామీనిచ్చేలా ఏర్పాటైన కమిటీ పురోగతిని రైతు నేతలు సమీక్షిస్తారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని పక్షంలో ఆందోళనను తిరిగి చేపడతామని రైతు నేత గుర్నాం సింగ్‌ చౌరుని హెచ్చరించారు. తమ ఆందోళనలను విరమించడం లేదని కేవలం వాయిదా వేస్తున్నామని బీకేయూ నేత రాకేశ్‌ తికైత్‌ అన్నారు. డిమాండ్లన్నీ పరిష్కారమయ్యే వరకు వేర్వేరు రూపాల్లో ఆందోళనలు రాష్ట్రాల వ్యాప్తంగా కొనసాగుతాయని ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img