Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

హోదాతోనే యువత భవిష్యత్‌

. ఉద్యమాలతోనే హామీల సాధన
. మాటతప్పిన సీఎం జగన్‌
. హోదా సాధన ఉద్యమ నేతల స్పష్టీకరణ

విశాలాంధ్ర`భీమవరం/ఏలూరు: హోదా సాధనతోనే యువతకు భవిష్యత్‌ అని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు, సీపీఐ పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్ర బాబు, ఏఐయస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్‌ బాబు ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం యువజన, విద్యార్థి (ఏఐవైఎఫ్‌, ఏఐఎస్‌ఎఫ్‌, డీవైఎఫ్‌ఐ, యస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, యన్‌యస్‌యూఐ) సంఘాల అధ్వర్యంలో అనంతపురం నుండి ఇచ్ఛాపురం వరకు చేపట్టిన బస్సుయాత్ర మంగళవారం భీమవరం చేరింది. ఈ సందర్భంగా కేశవరావు ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో జరిగిన సభలో నాయకులు మాట్లాడారు. సమరయాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విద్య, వైద్య సంస్థల సాధనకు యువకులు, విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఉద్యమిస్తేనే ఫలితం ఉంటుందని చెప్పారు. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా కోసం పోరాడిన వైఎస్‌ జగన్‌ నేడు మాట తప్పి మడప తిప్పారని విమర్శించారు. యువజన, విద్యార్థుల సమరయాత్రకు ప్రభుత్వం పోలీసుల ద్వారా అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్నారని, పోలీస్‌ రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీకి వ్యతిరేకంగా… రాష్ట్ర హక్కుల సాధన కోసం అందరూ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కడపలో ఉక్కు పరిశ్రమ లేదు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వడం లేదు, విశాఖ రైల్వేజోన్‌ ఊసేలేదు, అమరావతి రాజధానికి నిధులు ఇవ్వలేదని విమర్శల వర్షం కురిపించారు. సీఎం జగన్‌ మోదీ సర్కారుకు తొత్తుగా మారి…రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. ఐదు కోట్ల ఆంధ్రులు కావాలో…మోదీ కావాలో తేల్చుకోవాలని సీఎం జగన్‌ను హెచ్చరించారు. ఏఐయస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి టి.అప్పలస్వామి, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర నాయకులు లంకా గోవిందరాజులు, జంగాల చైతన్య, లంకె సాయి, ఏఐయస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షులు సుందర్‌, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కలిసెట్టి వెంకట్రావు, ఎం.సీతారాం ప్రసాద్‌, సికిలే పుష్ప కుమారి, సీపీఐ జిల్లా సమితి సభ్యులు కోన గొల్లయ్య పాల్గొన్నారు.
ఎంపీలు పోరాడాలి
ఏలూరు సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో విద్యార్థి, యువజన నాయకులు మాట్లాడుతూ హోదా కోసం ఎంపీలు పార్లమెంటులో పట్టుబట్టాలని, లేకపోతే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. జాన్సన్‌బాబు, లెనిన్‌ బాబు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఏ.అశోక్‌, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు వై.రాము, పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.భాస్కర్‌ మాట్లాడుతూ రాష్ట్ర హక్కులు, విభజన హామీలు, నాటి ప్రభుత్వం చట్టసభలో ఇచ్చిన హామీల కోసం ఎంపీలు మోదీ సర్కారును నిలదీయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి బీజేపీ చేసిన అన్యాయంపై వైసీపీ, టీడీపీ, జనసేన నోరు విప్పాలని, ఉద్యమంలో కలిసి రావాలని పిలుపునిచ్చారు. లేకపోతే ఆ పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారని చెబుతారని హెచ్చరించారు. విభజన హామీల సాధన కోసం అవసరమైతే చలో దిల్లీ చేపడతామని స్పష్టంచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img