Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

14 నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

గవర్నర్‌ నోటిఫికేషన్‌ జారీ
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. తొలిరోజు ఉభయసభల నుద్దేశించి గవర్నర్‌ ప్రసంగించనున్నారు. గవర్నర్‌గా నియమితులైన తర్వాత ఆయన అసెంబ్లీ సమావేశాల నుద్దేశించి చేసే తొలి ఉపన్యాసం కాబోతోంది. అనంతరం జరిగే బీఏసీలో బడ్జెట్‌ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. బడ్జెట్‌ ఏరోజు ప్రవేశపెట్టేది కూడా అదే రోజు నిర్ణయిస్తారు. ప్రస్తుత ప్రభుత్వానికి అసెంబ్లీలో ఇదే చివరి పూర్తిస్దాయి బడ్జెట్‌ కాబోతోంది. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరుగనున్న నేపథó్యంలో ఓట్‌ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ మాత్రమే ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీంతో ఈసారి ఎన్నికల బడ్జెట్‌గా దీన్ని భావించవచ్చు. ఈ బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఆకర్షించే మరిన్ని కొత్త పథకాలను ప్రకటించే అవకాశం ఉంది. మూడు రాజధానుల బిల్లు కూడా మళ్లీ ప్రవేశపెట్టే అవకాశం ఉందని అధికారపార్టీ నేతలు భావిస్తున్నారు. సుప్రీంకోర్టు మార్చి 28వ తేదీ అమరావతి రాజధాని పిటీషన్లపై విచారిస్తానని ప్రకటించినందున, బిల్లు పెట్టే సాహసం చేస్తారా ? లేదా ? అనేది అనుమానమే. విశాఖపట్నంలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు విషయం మాత్రం అధికారికంగానే ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం విశాఖలో ప్రారంభమైన పెట్టుబడిదారుల సదస్సులో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఇకపై పరిపాలనా రాజధాని ఇదేనని ప్రకటించారు కూడా. దీనినిబట్టి సుప్రీంకోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నా, వ్యతిరేకంగా ఉన్నా సీఎం క్యాంపు కార్యాలయం మాత్రం ఇకపై విశాఖలో కొనసాగే పరిస్థితులు స్పష్టంగా కనపడుతున్నాయి. దానికి చట్టపరంగా కూడా అవరోధాలు ఎదురయ్యే పరిస్థితి లేదు. వివిధ శాఖల సమీక్షలు సైతం విశాఖ నుంచి నిర్వహించడం ద్వారా వైసీపీ ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయం అమలు చేసి చూపినట్లుగా పాలకపెద్దలు ప్రచారం చేసుకోనున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు సీఎంగానే మళ్లీ అసెంబ్లీలో అడుగుపెడతానని శపథం చేసినందున ఈ బడ్జెట్‌ సమావేశాలకు కూడా హాజరయ్యే అవకాశం లేదు. యువగళం పేరుతో నారా లోకేశ్‌ పాదయాత్ర నిర్వహిస్తున్నందున ఆయన కూడా హాజరు కావడం లేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img