Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

15 మంది కూలీల దుర్మరణం

. ఎంపీలో ఘోర రోడ్డు ప్రమాదం
. 40మందికి పైగా గాయాలు
. రూ.2 లక్షల చొప్పున పరిహారం

రేవా(ఎంపీ): మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో 15మంది దుర్మరణం చెందారు. 40మందికి పైగా గాయపడ్డారు. బాధితులంతా రోజువారీ కూలీలే. దీపావళి పండగకు ఉత్సాహంగా కుటుంబంతో గడపాలని సొంతూళ్లకు బయలుదేరిన కూలీలు రోడ్డుప్రమాదం రూపంలో ప్రాణాలు కోల్పోయారు. కూలీలు ప్రయాణిస్తున్న ప్రైవేట్‌ బస్సు ట్రక్కును ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. హైదరాబాద్‌ నుంచి గోరఖ్‌పూర్‌ వెళుతుండగా శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. రేవా జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో సొహగి ఘాట్‌ రోడ్డుపై ట్రక్కు అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో వెనుక వస్తున్న బస్సు దానిని ఢీకొందని రేవా ఎస్‌పీ నవనీత్‌ భాసిన్‌ వివరించారు. 15మంది అక్కడికక్కడే మృతి చెందారని, 40మందికి పైగా గాయపడ్డారని ఆయన తెలిపారు. బాధితులంతా కూలీలేనని, దీపావళి పండగ కోసం సొంతరాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ వెళుతున్నారన్నారు. ఆ బస్సు కూడా యూపీకి చెందినదేనన్నారు. ప్రమాద దృశ్యాలు భయానకంగా ఉన్నాయని, బస్సు తుక్కుతుక్కయిందని, బస్సు ముందు భాగాన్ని గ్యాస్‌ కట్టర్లతో తొలగించి డ్రైవర్‌, కండక్టరు మృతదేహాలు బయటికి తీయాల్సి వచ్చిందని భాసిన్‌ పేర్కొన్నారు. గాయపడిన సమీప ఆసుపత్రులకు తరలించామని కలెక్టర్‌ మనోజ్‌ పుష్ప్‌ చెప్పారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే పోలీసు సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని సహాయచర్యలు చేపట్టారు. బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రైపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతులకు సంతాపం, కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున సాయమందిస్తామని ప్రధాని ప్రకటించారు. ప్రమాద సమాచారాన్ని ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఫోన్‌ ద్వారా వివరించారు. వైద్య ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చౌహాన్‌ చెప్పారు. స్వల్ప గాయాలకు గురైన 25మంది కూలీలను ఉత్తరప్రదేశ్‌ పంపామని ఎస్‌పీ భాసిన్‌ వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img