Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

2,205 కోట్లతో రోడ్ల అభివృద్ధి

నెలాఖరుకు 100 శాతం టెండర్లు పూర్తి
మే చివరికల్లా పూర్తిస్థాయి మరమ్మతులు
అత్యుత్తమ ప్రమాణాలతో విశాఖ బీచ్‌ కారిడార్‌
ఆర్‌అండ్‌బీ సమీక్షలో సీఎం జగన్

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల నిర్మాణం, మరమ్మతు పనులకు రూ.2,205 కోట్లు కేటాయించినట్లు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి చెప్పారు. రోడ్లు, భవనాల శాఖపై సోమవారం తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకూ 83 శాతం రోడ్డు పనులకు టెండర్లు పూర్తి చేశామని, నెలాఖరు నాటికి 100 శాతం టెండర్లు పూర్తవుతాయని అధికారులు సీఎంకు వివరించారు. దీనిపై ముఖ్య మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రహదారుల నిర్వహణను పట్టించుకోలేదని, తర్వాత వర్షాలు భారీస్థాయిలో పడటంతో రోడ్లు మరింతగా దెబ్బతిన్నాయన్నారు. ఈ వాస్తవాలను పక్కనబెట్టి మన ప్రభుత్వ హయాంలోనే రోడ్లన్నీ పాడైపోయి నట్టుగా వక్రీకరించి, మనం పట్టించుకోవడం లేదని ముద్రవేసి విష ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షనేత లను ఉద్దేశిస్తూ సీఎం జగన్‌ విమర్శలు చేశారు. గతంలో రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు రూ.2,205 కోట్లు ఇచ్చిన సందర్భం లేదని, అది కూడా ఒకే ఏడాదిలో ఇంత ఖర్చు చేసిన దాఖలాల్లేవన్నారు. ఆరోపణలను మనం పట్టించుకోవల్సిన అవసరం లేదని, చిత్తశుద్ధితో మనం చేపడుతున్న పనులను లక్ష్యానికనుగుణంగా మే చివరి నాటికి పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
అత్యుత్తమంగా విశాఖ బీచ్‌కారిడార్‌
విశాఖపట్నం పోర్టు నుంచి భీమిలి ` భోగా పురం, ఎన్‌హెచ్‌-16కు అనుసంధానం అయ్యే బీచ్‌కారిడార్‌ రోడ్డు నిర్మాణం ప్రపంచంలోనే అత్యుత్తమ మైనదిగా నిలవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విశాఖ నగరం నుంచి భోగా పురం ఎయిర్‌ పోర్టుకు, అక్కడ నుంచి నగరానికి వీలైనంత త్వరగా చేరుకునేలా ఈ కారిడార్‌ నిర్మాణం ఉండాలన్నారు. దీంతోపాటు ఈ రహదారిని అనుకొని టూరిజం ప్రాజెక్టులు రానున్నందున ఈ రోడ్డుకు మరింత ప్రాధాన్యత ఉంటుంద న్నారు. ఇప్పుడున్న విమానాశ్రయంలో పౌరవిమానాల రాకపోకలపై నిరంతరం ఆంక్షలు ఉంటున్నాయి. నేవీ ఆంక్షల కారణంగా రాత్రి పూట ల్యాండిరగ్‌ కష్టమవుతోంది. ఇలాంటి నేపథ్యంలో బీచ్‌ కారిడార్‌కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని అధికారులకు సీఎం వివరించారు. రహదారులు, భవనాల శాఖ మంత్రి ఎం శంకర నారాయణ, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, రెవెన్యూశాఖ స్పెషల్‌ సీఎస్‌ రజిత్‌ భార్గవ, రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, రవాణాశాఖ కమిషనర్‌ పి.సీతారామాం జనేయలు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రోడ్డు భద్రతా చర్యలపై సమీక్ష
అనంతరం రహదారి భద్రతా మండలి సమావేశం జరిగింది. సమావేశంలో కీలక అంశాలతో పాటు రోడ్డు ప్రమాదాలు జరగడానికి కారణాలు తదితర అం శాలను సీఎంకు అధికారులు వివరించారు. క్షతగాత్రుల ప్రాణాలు కాపాడటం, నిర్ణీత సమయంలో ఆస్పత్రులకు చేర్చడంలో ‘108’ కీలక పాత్ర పోషిస్తున్నా యని, ముఖ్యంగా గోల్డెన్‌ అవర్‌లోగా వారిని ఆస్పత్రులకు చేర్చడంతో చాలా మంది ప్రాణాలు నిలబడుతున్నాయని అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1190 బ్లాక్‌ స్పాట్స్‌ గుర్తించామని తెలిపారు. సీఎం మాట్లాడుతూ ప్రతి పార్ల మెంటు నియోజకవర్గంలో ఆర్టీసీ, ప్రభుత్వ సహకారంతో ఒక డ్రైవింగ్‌ స్కూలు ఏర్పాటు చేయాలని, ట్రామా కేర్‌ సెంటర్లను కొత్త జిల్లాలకు అనుగు ణంగా ప్రతి జిల్లాలోనూ, కొత్తగా ఏర్పాటు చేస్తున్న 16 మెడికల్‌ కళాశాలల్లోనూ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రమాదాలను నివారించేందుకు రోడ్డుపై లేన్‌మార్కింగ్‌ చాలా స్పష్టంగా ఉండేలా చూడాలని, బైక్‌లకు ప్రత్యేక లేన్‌, నాలుగు చక్రాల వాహనాలకు ప్రత్యేక లేన్స్‌ ఏర్పాటుపై ఆలోచన చేయాలన్నారు. ముఖ్యంగా రోడ్ల పక్కన దాబాల్లో మద్యం అమ్మకాలు జరగకుండా చూస్తే… ప్రమాదాలు చాలావరకు తగ్గుతాయన్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ విధానాన్ని పునఃసమీక్షించాలని, రోడ్‌ సేఫ్టీ ఫండ్‌ ఏర్పాటుతోపాటు ప్రమాద బాధితులకు చికిత్స కోసం క్యాష్‌లెస్‌ ట్రీట్‌మెంట్‌ అందేలా నెట్‌వర్క్‌ ఆస్పత్రుల జాబితాలోకి ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. మంత్రి శంకర నారాయణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img