Monday, June 5, 2023
Monday, June 5, 2023

25 మంది అవుట్‌?

. గడపగడపకు కొనసాగించాల్సిందే
. సెప్టెంబరు 1 వరకూ గడువు
. మంత్రులు ధర్మాన, బుగ్గన డుమ్మా
. కొంతమంది ఎమ్మెల్యేలు గైర్హాజరు
. 13 నుంచి జగనన్నకు చెబుదాం
. సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: పనితీరు సరిగా లేకపోతే వేటు తప్పదని ఎమ్మెల్యేలకు వైసీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంచేశారు. గడప గడపకు సమీక్షలో చాలామంది ఎమ్మెల్యేలకు జగన్‌ షాక్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. 25 మంది ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదని జగన్‌ హెచ్చరించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సోమవారం ‘గడప గడపకు మన ప్రభుత్వం’పై ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో సీఎం జగన్‌ సమీక్షించారు. 25 మంది ఎమ్మెల్యేలు వెనుకబడ్డారని, గ్రాఫ్‌ పెంచుకోవాల్సిన అవసరం ఉందని, లేకపోతే నష్టపోతారని సుతిమెత్తని హెచ్చరికలు జారీ చేశారు. జగన్‌ హెచ్చరికతో ఆ ఎమ్మెల్యేలంతా మనస్తాపానికి గురైనట్లు తెలిసింది. మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. ఏ ఒక్క ఎమ్మెల్యేనూ వదులుకోవడానికి తాను సిద్ధంగా లేనని, ఇక నుంచి అందరూ నెలకు 25 రోజులు ప్రజలతోనే ఉండాలని హితబోధ చేశారు. సెప్టెంబరు ఒకటి నాటికి గడపగడపకు మన ప్రభుత్వం, ఇతర కార్యక్రమాలు పూర్తి చేయాలని జగన్‌ ఆదేశించారు. కాగా, సమీక్ష సమావేశానికి మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ధర్మాన ప్రసాదరావు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సహా కొంతమంది ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది.
13 నుంచి జగనన్నకు చెబుదాం
ఒకవైపు గడపగడపకు మన ప్రభుత్వం కొనసాగిస్తూనే…ఈనెల 13 నుంచి ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు సీఎం జగన్‌ వెల్లడిరచడంతో ఎమ్మెల్యేలు ఆందోళనకు గురయ్యారు. ఇప్పటికే గడప గడపకు తిరగలేక చాలామంది ఎమ్మెల్యేలు అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఏకకాలంలో రెండు కార్యక్రమాలను కొనసాగించడం తలకు మించిన భారంగా ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. పనితీరు బాగోలేదని హెచ్చరించినందుకు నలుగురు ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేయడం, తుదకు వారంతా పార్టీని వీడటం వైసీపీకి తీరని నష్టంగా మారింది. దానిని గుర్తించిన జగన్‌ ఈసారి ఎమ్మెల్యేలకు సుతిమెత్తని హెచ్చరికతో…బుజ్జిగింపు ధోరణి ప్రదర్శించినట్లు తెలుస్తోంది. 40 మంది ఎమ్మెల్యేలు పార్టీకి దూరమవుతారన్న నిఘావర్గాల సమాచారంతో జగన్‌ ఆచితూచి వ్యవహరించారు. కాగా, నెలకు 9 సచివాలయాలు పూర్తి చేసే లక్ష్యంతో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ముందుకెళ్లాలని జగన్‌ ఆదేశించారు. ఈ టార్గెట్లతో ఎమ్మెల్యేలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అదే జరిగితే 175 స్థానాల్లో వైసీపీ గెలుపు ఖాయమంటూ సీఎం దీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ…ఆ దిశగా ఎమ్మెల్యేలలో జోష్‌ కనిపించలేదు. ఒకవైపు గడప గడపకు కొనసాగుతుందని, మరోవైపు సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులను మమేకం చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ‘నేను చేయాల్సింది నేను చేయాలి…మీరు చేయాల్సింది మీరు చేయాలి. ఆ రెండు సంయుక్తంగా సమర్థవంతంగా జరిగితే 175/175 స్థానాల్లో గెలుస్తామని ఎమ్మెల్యేలకు సీఎం దిశానిర్దేశం చేశారు.
గేర్‌ మార్చాలి: జగన్‌
ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు గేరు మార్చి రెట్టింపు ఉత్సాహం, వేగంతో పనిచేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. రాష్ట్ర చరిత్రలోనే కాదు…దేశ చరిత్రలోనే నాలుగేళ్లు గడవకముందే రూ.2లక్షల కోట్లకు పైగా డబ్బులను వివక్ష, లంచాలకు తావులేకుండా అక్కచెల్లెమ్మల ఖాతాలకు సంక్షేమం అందజేశామన్నారు. పట్టణప్రాంతంలో 84శాతం, గ్రామీణంలో 92 శాతం…సగటున 87 శాతం కుటుంబాలకు మంచి చేశామని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గొప్పగా గెలిచామంటూ టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని, 21 స్థానాలకుగాను 17 స్థానాల్లో వైసీపీ గెలిచిందని స్పష్టం చేశారు. ఒక్కో ఎమ్మెల్యేను టార్గెట్‌ చేస్తూ టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయని, పార్టీ కార్యకర్తలు అత్యంత క్రియాశీలకంగా ఉండాలని సీఎం ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img