Thursday, February 2, 2023
Thursday, February 2, 2023

26న సత్యాగ్రహం విజయవంతం చేయాలి

విశాలాంధ్రవిజయవాడ : దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహత్తర రైతు ఉద్యమం ప్రారంభించి ఈ నెల 26వ తేదీకి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రైతు సమన్వయ కమిటీ పిలుపు మేరకు నిర్వహించనున్న సత్యాగ్రహం, దీక్షలు, ప్రదర్శనలు, సభలకు వామపక్ష పార్టీలు మద్దతు ఇస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు, దీక్షలు, విజయవాడలో ఆటపాట, భారీ ప్రదర్శన, బహిరంగసభ ఉంటాయని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో వామపక్షాలు, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకుల సమావేశం శనివారం విజయవాడ హనుమాన్‌పేటలోని దాసరి భవన్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, పి.మధు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు, సీపీఐ(ఎంఎల్‌) రాష్ట్ర నాయకుడు జాస్తి కిషోర్‌బాబు, సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ నాయకులు డి.హరనాథ్‌, ఎం.ఈశ్వర్‌, ఎంసీపీఐ(యు) నాయకులు కాటం నాగభూషణం, సుభానీ, ఎస్‌యూసీఐ నాయకుడు సుధీర్‌ తదితరులు పాల్గొని దేశంలో, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం తీసుకున్న నిర్ణయాలకు సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ, ఆర్‌ఎస్‌పీ, ఫార్వర్డ్‌బ్లాక్‌, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ మద్దతు తెలిపాయి. అనంతరం విలేకరుల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ రైతుల పోరాటానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగివచ్చి మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించినప్పటికీ, వాటితోపాటు విద్యుత్‌ బిల్లు`2020 రద్దు చేయాలని, కనీస మద్దతు ధర చట్టం చేయాలనే డిమాండ్లపై కేంద్రం స్పష్టత ఇచ్చే వరకు ఉద్యమం కొనసాగించాలని రైతు సంఘాల సమన్వయ కమిటీ నిర్ణయించిందని తెలిపారు. మొదటి నుంచి రైతు ఉద్యమానికి వామపక్షాలు అండగా నిలిచాయని, రానున్న కాలంలో కూడా మద్దతు ఇస్తాయని చెప్పారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 282 రోజులుగా కొనసాగుతున్న కార్మిక ఉద్యమానికి కూడా మద్దతు ఇస్తున్నామని, ఉద్యమం ప్రారంభించి 300వ రోజుకు చేరిన సందర్భంగా సుధీర్ఘపోరాట దినం పేరుతో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని తెలిపారు. కేంద్రం నిర్దేశించిన విద్యుత్‌ సంస్కరణలను యథాతథంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని, దీని వల్ల ప్రజలపై భారంపడుతోందన్నారు. అదానీ కంపెనీలకు మేలు చేసేందుకు సిక్కి ద్వారా విద్యుత్‌ కొనుగోలుకు ఒప్పందం చేసుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. మన రాష్ట్రంలోనే 50వేల ఎకరాల్లో సౌర విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేసి రైతులకు, ప్రజలకు విద్యుత్‌ను సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. ఎయిడెడ్‌ విద్యా సంస్థలను యథాతథంగా కొనసాగించాలని, జీవో 35, 42, 50, 51లను రద్దు చేయాలన్నారు. ఆ జీవోలు రద్దు చేయకుండా మోమోలు జారీ చేసి విలీనానికి ఆప్షన్లు పెట్టడం సమంజసం కాదన్నారు. ఎయిడ్‌ విద్యాసంస్థల పరిరక్షణ కోసం విద్యార్థి సంఘాలు చేపట్టే ఉద్యమానికి అండగా నిలుస్తామని చెప్పారు. పి.మధు మాట్లాడుతూ రైతు ఉద్యమానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని, 26వ తేదీన దీక్షలు, సభలు, ప్రదర్శనలు జయప్రదం చేయాలని కోరారు. మూడు వ్యవసాయ చట్టాలకు వైసీపీ మద్దతు ఇచ్చిందని, ఇప్పుడు ఆ చట్టాలను రద్దు చేయడంపై వైఖరిని వెల్లడిరచాలని డిమాండ్‌ చేశారు. కనీస మద్దతు ధర చట్టం చేయాలని, విద్యుత్‌ సంస్కరణల బిల్లు రద్దు కోసం పోరాడాలన్నారు. ఎయిడెడ్‌ విద్యా సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల 10 వేల టీచర్‌ పోస్టులు రద్దవుతాయని, పేద విద్యార్థులకు విద్య దూరమవుతుందన్నారు. ఎయిడెడ్‌ విద్యా సంస్థలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. రైతు, కార్మిక, విద్యార్థి పోరాటాలకు టీడీపీ, జనసేన కూడా కలిసిరావాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img