Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

26 లోపు సాగు చట్టాలు రద్దు చేయకపోతే… మహోద్యమమే

కేంద్రానికి రాకేశ్‌ తికైత్‌ హెచ్చరిక

ఘాజీపూర్‌ : వివాదాస్పద మూడు సాగు చట్టాలను ఈనెల 26వ తేదీలోగా రద్దు చేయాలని భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) నేత రాకేశ్‌ తికైత్‌ సోమవారం కేంద్రాన్ని డిమాండు చేశారు. ఆ చట్టాలను రద్దు చేయడానికి కేంద్రానికి రైతు సంఘాలు ఇప్పటికే చాలా సమయం ఇచ్చాయని పేర్కొన్నారు. నవంబర్‌ 26 నాటికి దిల్లీ సరిహద్దు ప్రాంతాలైన సింగు, టిక్రి, ఘాజీపూర్‌లలో సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో కొనసాగు తున్న నిరసనలకు ఏడాది కాలం పూర్తవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి నవంబర్‌ 26 వరకు సమయం ఉంది, అప్పటికి చట్టాలను రద్దు చేయకపోతే నవంబర్‌ 27 నుంచి అన్నదాత ఉద్యమం మహోద్యమంగా మారుతుందని హెచ్చరించారు. కేంద్రం దిగిరాక పోతే రైతులు గ్రామాల నుంచి ట్రాక్టర్లలో ధిల్లీి చుట్టూ ఉన్న ఉద్యమ ప్రాంతాలకు సరిహద్దుకు చేరుకుని ఉన్న టెంట్లను మరింత పటిష్టం చేస్తారని హిందీలో ట్వీట్‌ చేశారు. ఇదిలా ఉండగా సోమవారం ఉత్తరప్రదేశ్‌లో రైతు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాకేశ్‌ తికైత్‌ మాట్లాడుతూ రైతులు ఆందోళన చేపట్టి ఇప్పటికే ఏడాది పూర్తైందని, అయినప్పటికీ కేంద్రం ఈ విషయాన్ని తేల్చకుండా తాత్సారం చేస్తోందని మండిపడ్డారు. కేంద్రంతో 11 విడతల చర్చలు చేశాం, ప్రతిపాదనలు చేశాం. అయినా ప్రతిష్టంబన తొలగలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం సాగు చట్టాల్ని వెనక్కి తీసుకోవడం లేదని దుయ్యబట్టారు. గతంలో కూడా అనేకసార్లు కేంద్రానికి అవకాశం ఇచ్చాం. కానీ కేంద్రం మా ప్రతిపాదనలు ఏవీ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ మెడలు వంచే వరకు మా పోరాటం ఆగదని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తాము కేంద్ర ప్రభుత్వానికి ఈ నెల 26వ తేదీ వరకు మరో గడువు ఇస్తున్నాం. అప్పటిలోగా మూడు నల్ల చట్టాల్ని వెనక్కి తీసుకోకపోతే రైతు పోరును పతాక స్థాయికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img