Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

26/11 ముంబైపై దాడి అమరవీరులకు ఘన నివాళి

ముంబై : దేశ వాణిజ్య రాజధాని ముంబైపై నవంబరు 26, 2008న దాడి చేసిన ఉగ్రవాదులతో పోరాడి అసువులు బాసిన అమర వీరులకు శుక్రవారం ఘనంగా నివాళులు అర్పించారు. మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారి, ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌, హోం మంత్రి దిలీప్‌ వాల్సే పాటిల్‌ దక్షిణ ముంబైలోని పోలీసు ప్రధాన కార్యాలయంలోని స్మారక చిహ్నం వద్ద అమర వీరులకు ఘన నివాళి అర్పించారు. కాగా రోడ్డు ప్రాజెక్టులో కొనసాగుతున్న పని కారణంగా అమరవీరుల స్మారక చిహ్నాన్ని మెరైన్‌ డ్రైవ్‌లోని పోలీస్‌ జింఖానా వద్ద ఉన్న అసలు స్థలం నుండి క్రాఫోర్డ్‌ మార్కెట్‌లోని పోలీసు ప్రధాన కార్యాలయానికి మార్చినట్లు ఒక అధికారి తెలిపారు. కాగా వెన్నుకు శస్త్ర చికిత్స తర్వాత ముంబై ఆస్పత్రిలో కోలుకుంటున్న ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కూడా 26/11 అమర వీరులను స్మరించుకున్నారు. కోవిడ్‌`19 మహమ్మారి నేపథ్యంలో ముంబైపై ఉగ్రవాదుల ఘోరమైన ఉగ్ర దాడిలో అమరులను స్మరించుకునే ఈ వార్షికోత్సవానికి పరిమిత సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. అమరులైన పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులు స్మారక చిహ్నం వద్ద నివాళి అర్పించారు. ‘పదమూడేళ్లు గడిచినా తీవ్రమైన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్న వారి ధైర్యం ఇప్పటికీ మాకు స్ఫూర్తినిస్తుంది. సందర్భంగా ముంబై రక్షకులను స్మరించుకుంటున్నాను’ అని ముంబై పోలీసు కమిషనర్‌ హేమంత్‌ నాగ్రాలే ట్వీట్‌ చేశారు. ఆయన మహారాష్ట్ర పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ సంజయ్‌ పాండేతో కలిసి స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ‘వారి త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మా హృదయాల్లో నిలిచే ఉంటారు’ అని ముంబై పోలీసులు ట్వీట్‌ చేశారు. కాగా ఉగ్రవాదులతో పోరాడి ప్రాణ త్యాగం చేసిన భద్రతా సిబ్బందికి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సెల్యూట్‌ చేశారు. ‘మీ ధైర్యసాహసాలకు దేశం మొత్తం గర్విస్తోంది. మీ త్యాగాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుంది’ అని షా ట్వీట్‌లో పేర్కొన్నారు. నవంబర్‌ 26, 2008న పాకిస్తాన్‌ నుండి 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు సముద్ర మార్గంలో వచ్చి కాల్పులు జరిపారు. ముంబైలో 60 గంటల ముట్టడిలో 18 మంది భద్రతా సిబ్బంది సహా 166 మంది మరణించడంతోపాటు అనేక మంది గాయపడ్డారు. ఉగ్రవాదులతో జరిపిన పోరాటంలో యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌(ఏటీఎస్‌) చీఫ్‌ హేమంత్‌ కర్కరే, ఆర్మీ మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌, ముంబై అదనపు పోలీస్‌ కమిషనర్‌ అశోక్‌ కామ్టే, సీనియర్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌ సలాస్కర్‌, అసిస్టెంట్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ తుకారాం ఓంబ్లే అమరులయ్యారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినస్‌, ఒబెరాయ్‌ ట్రైడెంట్‌, తాజ్‌ మహల్‌ హోటల్‌, లియోపోల్డ్‌ కేఫ్‌, కామ హాస్పిటల్‌, నారిమన్‌ హౌస్‌ జ్యూయిష్‌ కమ్యూనిటీ సెంటర్‌(ఇప్పుడు నారిమన్‌ లైట్‌ హౌస్‌)ను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని దాడికి ఒడిగట్టారు. దేశంలోని ఎలైట్‌ కమాండో ఫోర్స్‌ అయిన ఎన్‌ఎస్‌జీతో సహా భద్రతా దళాలు జరిపిన ఎదురు దాడిలో తొమ్మిది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. సజీవంగా పట్టుబడిన ఏకైక ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌. నాలుగేళ్ల తర్వాత 2012 నవంబర్‌ 21న అతడిని ఉరి తీశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img