Thursday, October 6, 2022
Thursday, October 6, 2022

27న భారత్‌ బంద్‌ చరిత్రాత్మకం

దేశ ప్రజలంతా భాగస్వాములు కావాలి

మూడు వ్యవసాయ చట్టాలు ప్రమాదకరం
సమాఖ్య వ్యవస్థపై మోదీ దాడి
బీజేపీ పాలనపై తీవ్ర వ్యతిరేకత
ఆన్‌లైన్‌ బహిరంగ సభలో సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : మోదీ ప్రభుత్వ నిరంకుశ విధానాలను నిరసిస్తూ, మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండు చేస్తూ ఈనెల 27న సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపునిచ్చిన భారత్‌బంద్‌ చరిత్రలో నిలిచిపోతుందని, బంద్‌లో అన్ని రాజకీయ, రైతు, కార్మిక, ప్రజాసంఘాలు, ప్రజలు భాగస్వాములు కావాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా పిలుపునిచ్చారు. ఈనెల 27వ తేదీన సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపునిచ్చిన భారత్‌బంద్‌ను జయప్రదం చేయాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర సమితి అధ్వర్యంలో శుక్రవారం భాగస్వామ్య పక్షాల ఆన్‌లైన్‌ బహిరంగ సభ జరిగింది. సభకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అధ్యక్షత వహించగా వివిధ రాజకీయ పార్టీల నేతలు, కార్మిక, ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు. డి.రాజా ప్రసంగిస్తూ దేశ సమాఖ్య వ్యవస్థపై దాడి చేసేలా మోదీ విధానాలున్నాయని, అప్రజాస్వామిక పాలన కొనసాగుతోందని విమర్శించారు. రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటోందనీ, మోదీకి దేశాన్ని పాలించే అర్హత లేదన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండు చేస్తూ దిల్లీ కేంద్రంగా 300రోజులుగా పంజాబ్‌, హర్యానా తదితర రాష్ట్రాల రైతులు ఆందోళనలు చేస్తున్నారని, మోదీ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. రైతులతో చర్చలు జరపడానికి కేంద్రం నిరాకరిస్తోందన్నారు. ఏప్రిల్‌ 28వ తేదీన సోనియాగాంధీ నేతృత్వంలో జరిగిన రాజకీయ పార్టీల సమావేశం మూడు వ్యవసాయ చట్టాల రద్దు కోసం, బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని నిర్ణయించిందన్నారు. మోదీ ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టాలు వ్యవసాయ రంగానికి పెనుప్రమాదం వంటివని, అవి అమలైతే దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభంలోకి వెళ్లడమే కాకుండా కార్పొరేట్‌ మయమవుతుందన్నారు. పేదలకు ఆహార సరఫరా పంపిణీ, ఉచిత బియ్యం పథకాలకు

ఆటంకాలు ఎదురవుతాయని చెప్పారు. మోదీ తెచ్చిన జీఎస్టీ విధానం కార్పొరేట్‌ ప్రయోజనాలకు, దోపిడీకే ఉపయోగపడుతుందని ధ్వజమెత్తారు. భారత్‌బంద్‌ విజయవంతానికి రాజకీయ పార్టీలు, లౌకిక, ప్రజాతంత్రవాదులు, ప్రజానీకం కృషి చేయాలని కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ విస్తృత ప్రచారం : రామకృష్ణ
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ భారత్‌బంద్‌ విజయవంతం కోసం రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ విస్తృతంగా ప్రచారం చేస్తోందన్నారు. పెద్దఎత్తున సభలు, ప్రదర్శనలు నిర్వహించిందని వివరించారు. రైతుసంఘాలు, కార్మిక, ప్రజాసంఘాలు ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తున్నాయని చెప్పారు.ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ, మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో వివిధ దశల్లో ఉద్యమాలు చేపట్టామన్నారు. దేశవ్యాప్తంగా 19 రాజకీయ పార్టీలు, 500కుపైగా రైతు సంఘాలు, 400 కార్మిక సంఘాలు పాల్గొంటున్నాయని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ భారత్‌బంద్‌కు మద్దతిచ్చేందుకు ముందుకు వచ్చిందన్నారు. రహదారులు, రైల్వేలు, పోర్టులు, విమానాశ్రయాలు, పరిశ్రమలు తదితర రంగాలను వరుసవారీగా ఒక అజెండాతో ప్రైవేట్‌పరం చేస్తున్నారని మండిపడ్డారు.
భారత్‌బంద్‌లో టీడీపీ భాగస్వామ్యం : జనార్థన్‌, శ్రీనివాసరెడ్డి
27న జరిగే భారత్‌ బంద్‌లో తమ పార్టీ పాల్గొంటుందని టీడీపీ ఎమ్మెల్సీ తొండెపు దశరథ జనార్థన్‌, తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టంచేశారు. జనార్థన్‌ మాట్లాడుతూ వ్యవసాయరంగాన్ని, రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే ఏ చట్టాన్నీ తెలుగుదేశం పార్టీ అంగీకరించదన్నారు. భారత్‌బంద్‌లో పార్టీ శ్రేణులంతా ప్రత్యక్షంగా పాల్గొంటారని చెప్పారు. మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మోదీ తెచ్చిన ఈ వ్యవసాయ నల్లచట్టాలను సవరించాలని టీడీపీ ఎంపీలు పార్లమెంటులో పట్టుబట్టారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్‌ను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకపోవడంతో టీడీపీ ఈ చట్టాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొంటుందన్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు కూడా భారత్‌బంద్‌ను జయప్రదం చేసేందుకు పార్టీ శ్రేణులంతా పాల్గొనాలని ఆదేశించినట్లు చెప్పారు.
ప్రభుత్వ ఆస్తుల విక్రయం: శైలజానాథ్‌
పీసీసీ చీఫ్‌ డాక్టర్‌ సాకే శైలజానాథ్‌ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌ శక్తులకు తెగనమ్మాలనే విధానాలతో మోదీ ప్రభుత్వం ముందుకు పోతోందన్నారు. బంద్‌కు ఏఐసీసీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని, రాష్ట్రంలో బంద్‌ విజయవంతానికి కాంగ్రెస్‌ శ్రేణులు నడుం బిగించాయని చెప్పారు. మూడు వ్యవసాయ చట్టాలు అమలులోకి వస్తే, రైతులు జీవితాంతం దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలోనూ ప్రభుత్వ ఆస్తులను విక్రయిస్తున్నారని, వాటి కోసం మరో స్వాతంత్య్ర పోరాటం చేయాల్సిన అవసరముందన్నారు.
స్వాతంత్య్రం వచ్చినా ఉపయోగం లేదు : పి.మధు
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ మోదీ విధానాల వల్ల ప్రజలకు ప్రయోజనం లేకుండా పోయిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. పరిశ్రమలు, వ్యవసాయం, రిజర్వే షన్లు పరిరక్షించుకోవాలని ప్రజలు ఆశించగా, వాటిని మోదీ ప్రభుత్వం అణచివేస్తోందన్నారు. ప్రైవేటీకరణ విధానాలతో ముందుకు పోతోందని విమర్శించారు. రవాణా రంగంలో 70శాతం, రైల్వేలో 30శాతం ప్రైవేటీకరణ కొనసాగుతోందన్నారు. పరిశ్రమలన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. బంద్‌ జయప్రదానికి అందరూ కృషి చేయాలని కోరారు.
రైతు సంఘాల సమాఖ్య కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కాలరాస్తూ సమాఖ్య స్ఫూర్తిని పూర్తిగా దెబ్బతీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయరంగానికి సంబంధించిన పంట ఉత్పత్తుల అంశం రాష్ట్ర జాబితాకు సంబంధించినదైనప్పటికీ, కేంద్రం జోక్యం చేసుకోవడం దారుణమన్నారు. మోదీ ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలు అమల్లోకి వస్తే రైతాంగ ప్రయోజనాలు పూర్తిగా దెబ్బతింటాయని వివరించారు. అఖిల భారత కిసాన్‌ సభ ఉపాధ్యక్షులు(ఏఐకేఎస్‌) రావుల వెంకయ్య మాట్లాడుతూ వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేసే నల్లచట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు సంయుక్తంగా ఉద్యమిస్తున్నప్పటికీ, 650 మంది రైతులు ఆత్మబలిదానాలకు పాల్పడినా మోదీలో ఏమాత్రం స్పందన కానరాకపోవడం ఆయన నియంతృత్వ ధోరణికి నిదర్శనమన్నారు. త్వరలో జరగనున్న ఏడు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పేందుకు ప్రగతిశీల శక్తులన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఆత్మనిర్భర్‌ పేరుతో మోదీ ప్రభుత్వరంగాన్ని ధ్వంసం చేస్తున్నారన్నారు. భారత్‌బంద్‌ను జయప్రదం చేసి మోదీకి బలమైన సంకేతం పంపాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ రాష్ట్ర నాయకులు డి.హరినాథ్‌ మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానించాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.హరినాథ్‌రెడ్డి, వివిధ రాజకీయ, రైతు, కార్మిక, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img