Saturday, August 13, 2022
Saturday, August 13, 2022

6న హస్తినకు జగన్‌, చంద్రబాబు

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సమావేశానికి ఆహ్వానం
ఒకే సమావేశానికి తొలిసారి ఇద్దరినీ ఆహ్వానించిన కేంద్రం

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: ఈ నెల 6వ తేదీ అరుదైన సన్నివేశం ఆవిష్కృతం కాబోతోంది. తొలిసారి ఏపీకి చెందిన అధికార, ప్రతిపక్ష పార్టీల అధ్యక్షులు ఒకే సమా వేశానికి హాజరు కాబోతున్నారు. దీనికి దేశ రాజధాని దిల్లీ వేదిక కాబోతోంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ఉత్సవాలను పురస్కరించుకుని ఈనెల 6వ తేదీ జరుగునున్న ఉత్సవాల జాతీయ కమిటీ సమావేశా నికి హాజరు కావల్సిందిగా వైసీపీ, టీడీపీ అధ్యక్షులై న సీఎం జగన్‌, మాజీ సీఎం చంద్రబాబులకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్‌ కల్చరల్‌ సెంటర్‌లో నిర్వహించే సమావేశానికి తొలిసారి వీరిద్దరూ హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి దేశంలోని దాదాపుగా అన్ని పార్టీల అధినేతలను కూడా కేంద్రం ఆహ్వానించింది. దానిలో భాగంగానే ఏపీకి చెందిన వీరిద్దరికీ కూడా ఆహ్వానాలు అందాయి. ఆ మేరకు జగన్‌, చంద్రబాబు దిల్లీ సమావేశానికి హాజరు కావాలని నిర్ణయించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి ఈ సమావేశానికి హాజరు కావడంతో పాటు, అనంతరం ప్రత్యేకంగా ప్రధాని మోదీని కలిసేందుకు అనుమతి కోరినట్లు సమాచారం. అలాగే రాష్ట్రానికి సంబంధించి వివిధ పెండిరగ్‌ సమస్యల పరిష్కారం కోసం కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లతోనూ భేటీ కానున్నట్లు తెలిసింది. అలాగే అదేరోజు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుండడంతో, ఈసందర్భంగా ఎన్‌డీఏ అభ్యర్థి జగదీప్‌ ధన్‌ఖడ్‌ను కూడా జగన్‌ కలిసే అవకాశం ఉంది. ఇక సుదీర్ఘ విరామం తరువాత కేంద్ర ప్రభుత్వం నుంచి అందిన ఈ ఆహ్వానానికి చంద్రబాబు తప్పనిసరిగా హాజరు కావాలని నిర్ణయించారు. బీజేపీతో తెగదెంపులైన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన తొలిసారిగా జరిగే ఈ సమావేశానికి హాజరుకావడం చంద్రబాబు ఒక అవకాశంగా భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీకి దూరం కావటం సరైన నిర్ణయం కాదని చంద్రబాబు ప్రకటించడమే కాకుండా, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి బిల్లుకు టీడీపీ తరపున మద్దతు తెలియజేస్తున్న విషయం తెలిసిందే. కేంద్రంతో వైసీపీ ప్రభుత్వం అంటకాగుతూ టీడీపీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేసిన అమరావతి రాజధానిని కూడా విధ్వంసం చేస్తోంది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ నేపధ్యంలో బీజేపీతో మళ్లీ దగ్గరైతే తప్ప జగన్‌ను దెబ్బతీయలేమన్న భావనలో టీడీపీ ఉంది. దానికోసం మూడేళ్లుగా టీడీపీ ప్రయత్నిస్తూనే ఉంది. గతంలో టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడినప్పుడు చంద్రబాబు దిల్లీ వెళ్లి ప్రధానిని కలిసే ప్రయత్నం చేశారు. కాని మోదీ అపాయింట్‌మెంట్‌ దొరకలేదు. ఆ తర్వాత గత నెలలో భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు కలిసే అవకాశం వస్తుందని భావించారు. కాని కేంద్రం నుంచి ఒక ప్రతినిధిని పంపాలని వ్యూహాత్మకంగా లేఖ రాసింది. దీంతో ఆ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని పంపాలని పార్టీ నిర్ణయించింది. కానీ అచ్చెన్నాయుడును కూడా ఆ కార్యక్రమానికి హాజరుకాకుండా సీఎం జగన్‌ అడ్డుకున్నారు. తాజాగా చంద్రబాబుకు మరో అవకాశం వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగనున్న సమావేశం కావడంతో చంద్రబాబు తప్పక హాజరుకానున్నారు. అనుకోని పరిణామాలు ఎదురైతే తప్ప వీరిద్దరి పర్యటనల్లో మార్పులు జరిగే అవకాశాల్లేవు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో కాని, ప్రస్తుత వైసీపీ మూడేళ్ల కాలంలో గాని సీఎం, ప్రతిపక్ష నేత ఒకే సమావేశానికి హాజరైన దాఖలాల్లేవు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img