Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

600 మంది విద్యార్థులు… ఒక్కరే మాస్టారు

మౌలిక వసతుల లేమి
తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థినులు
పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
ఇదీ అరకులోయ డిగ్రీ మహిళా కళాశాల దుస్థితి

శిథిలావస్థకు చేరిన తరగతి గదులు, కూర్చునేందుకు బెంచీలు కరువు, ప్రహరీ లేని కళాశాల… ఇక వర్షం వస్తే చెప్పనే అక్కర్లేదు… ఇలా మౌలిక వసతుల లేమితో అరకులోయ డిగ్రీ కాలేజీ విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ అధిగమించి కనీసం పాఠాలు నేర్చుకుందామన్నా, అన్ని సబ్జెక్టులకు కలిపి ఒకే అధ్యాపకుడు కావడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ‘మా పరిస్థితి ఇది సారూ…’ అని మొరపెట్టుకుంటున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పెడచెవిన పెడుతున్నారు. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో వారు కొట్టుమిట్టాడుతున్నారు. మొత్తంగా 40 మంది సిబ్బంది ఉండాల్సిన చోట కేవలం ఇద్దరు మాత్రమే పనిచేస్తున్నారు.

విశాలాంధ్ర`అరకులోయ రూరల్‌: అరకులోయ డిగ్రీ కళాశాల పరిస్థితి దయనీయంగా ఉంది. 600 మంది విద్యార్థినులు ఉన్న ఈ కళాశాలలో ఒక ప్రిన్సిపాల్‌, ఒక లెక్చరర్‌ మాత్రమే ఉన్నారు. అరకువేలి మండలం, పెద్దలబుడు పంచాయతీలో గల గిరిజన మహిళా డిగ్రీ కళాశాలలో జూనియర్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ అసిస్టెంట్‌, లెక్చరర్స్‌, ల్యాబ్‌ అసిస్టెంట్‌తో పాటు ఉద్యోగులు మొత్తం 40 మంది ఉండాలి. తరగతి గదుల్లో కనీసం కూర్చోవడానికి బెంచీలు లేవు. వర్షం పడితే తరగతి గదులు కారిపోయి శిథిలావస్థకు చేరుకున్నాయి. కళాశాలలో కనీస సదుపాయాలు, బాత్‌రూమ్‌లు, ప్రహరీ లేదని, ఇవే కాక మరెన్నో సమస్యలతో సతమతమవుతున్నట్టు విద్యార్థినులు వాపోతున్నారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇవ్వడమే తప్ప ఎలాంటి ప్రయోజన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తక్షణ చర్యలు తీసుకోవాలి: ఏపీపీసీసీ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
కళాశాలను సందర్శించిన ఏపీపీసీసీ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి అక్కడ పరిస్థితులను చూసి విస్మయం వ్యక్తం చేశారు. తక్షణ చర్యలు తీసుకోకుంటే ఉద్యమబాట పట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆమె వెంట అరకువేలి కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు బోయి మోహన్‌రావు, ప్రధాన కార్యదర్శి శెట్టి భగత్‌ రాం, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు గుంజీడి సుబ్బారావు, కోర్ర పోతురాజు, జంపరంగి వెంకట బాబు, మాదల పండు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img