Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

ఆచార్యుల సేవలకు కేబినెట్‌ ఓకే
జగన్‌ సర్కారుపై ఆగ్రహజ్వాలలు

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : కాబోయే ఆచార్యులకు జగన్‌ సర్కారు మరో షాక్‌ ఇచ్చింది. విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బంది కొరతను తీర్చేందుకు రాష్ట్ర కేబినెట్‌ ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసింది. పదవీ విరమణ చేయబోతున్న ఆచార్యులు, సిబ్బంది సేవలను కాంట్రాక్టు పద్ధతిలో వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. కోర్టు కేసుల దృష్ట్యా పోస్టుల భర్తీలో జాప్యాన్ని సాకుగా చూపి… దానికి ప్రత్యామ్నాయంగా ఈ ఆలోచనను ప్రభుత్వం ముందుకు తెచ్చింది. 62 ఏళ్లకు పదవీ విరమణ చేస్తున్న బోధనా సిబ్బందిని 65 ఏళ్ల వరకూ కాంట్రాక్టు పద్ధతిలో వినియోగించుకోవడానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీనిపై నిరుద్యోగుల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత నెలకొంది. ఇప్పటికే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును జగన్‌ సర్కారు 60 నుంచి 62 ఏళ్లకు పెంచింది. ఈ నాలుగేళ్లలో కొత్త నియామకాలు చేపట్టలేదు. అన్ని విభాగాల్లోనూ ఉద్యోగ నియామకాల ప్రక్రియ నిలిచిపోయింది. నాలుగేళ్ల నుంచి విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల పోస్టుల భర్తీ కోసం లక్షలాది మంది యువత ఎదురు చూస్తోంది. ఆ పోస్టులు వస్తాయనే ఆశతో భారీ వ్యయంతో పీహెచ్‌డీలు పూర్తి చేసి, యూజీసీ నిబంధనల మేరకు నెట్‌లో అర్హత పొంది ఉన్నారు. మరోవైపు, ఆచార్య పోస్టుల భర్తీ ప్రక్రియ న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని జగన్‌ సర్కార్‌ పదవీ విరమణ చేసిన వారి సేవలు ఉపయోగించుకోవాలని నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ అనంతరం ఆచార్యులను, బోధన సిబ్బందికి మరో మూడేళ్లు పెంచడమంటే అప్పటి వరకు కొత్త నియామకాలు లేనట్లే. పదవీ విరమణ చేసిన వారికి మళ్లీ అవకాశం ఇవ్వకుండా, ఆయా స్థానాలకు ప్రకటన విడుదల చేసి వయోపరిమితి నిర్ణయించాలని నిరుద్యోగ, యువజన సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అభ్యర్థుల వయోపరిమితి పెంచాలని నిరుద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి. దీనిపై ఇంతవరకు ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. ఇది పూర్తిగా తమను దగా చేయడమేనని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆచార్యులను వినియోగిం చుకోవాలన్న ప్రతిపాదనను తక్షణమే ప్రభుత్వం విరమించాల్సిన అవసరముంది. లేకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img