Sunday, April 2, 2023
Sunday, April 2, 2023

75% ఉద్యోగాలు స్థానికులకే

. పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం
. భారీ కర్మాగారాల ఏర్పాటుకు ఎస్‌ఐపీబీ ఆమోదం
. సకాలంలో నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు బ సీఎం జగన్‌ ఆదేశం

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం అందిస్తామని, రానున్న ప్రతి పరిశ్రమలో కూడా ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారం 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. అనుకున్న సమయంలోగా నిర్మాణాలు పూర్తి కావాలని, అవి పూర్తయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. కృష్ణా జిల్లా మల్లవల్లి పార్కులో ఇథనాల్‌ ఇంధన తయారీకి ముందుకొచ్చిన అవిశా ఫుడ్స్‌ ఫ్యూయెల్స్‌ కంపెనీని ప్రతిపాదించారు. దీనివల్ల రూ.498.84 కోట్ల పెట్టుబడులు రానుండగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా 3,300 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రోజుకు 500 కిలో లీటర్ల సామర్థ్యంతో, ఈ ఏడాది జూన్‌ లో పనులు ప్రారంభించి, వచ్చే ఏడాది జూన్‌ నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే కడియం వద్ద ఆంధ్రా పేపర్‌ మిల్స్‌ విస్తరణ ప్రాజెక్టు కోసం మొత్తంగా రూ. 3,400 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. తద్వారా ప్రత్యక్షంగా 2,100 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. 2025 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్టీపీసీ అధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్కు ఏర్పాటు కోసం మొదటి విడతలో రూ.55వేల కోట్లు, రెండో విడతలో రూ.55వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు. మొత్తంగా రూ.1,10,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. ఫేజ్‌ వన్‌లో 30 వేలమందికి, ఫేజ్‌ టూ లో 31వేల మందికి ఉద్యోగాలు. మొత్తంగా 61వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఈ పార్క్‌ లో గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్‌అమ్మోనియా, గ్రీన్‌ మిథనాల్‌, హైడ్రోజన్‌ సంబంధిత ఉత్పత్తులు తయారు చేస్తారు. మొదటి విడతను 2027 నాటికి, రెండో విడతను 2033 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంధన రంగంలో వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు మార్చుకుని కొత్త తరహా ఇంధనాల ఉత్పత్తి లక్ష్యంగా ఎన్టీపీసీ ముందడుగు వేసింది. శ్రీకాళహస్తి, పుంగనూరుల్లో ఎలక్ట్రో స్టీల్‌ కాస్టింగ్‌ లిమిటెడ్‌ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయనున్నారు. డీఐ పైపులు, ఫెర్రో అల్లాయిస్‌ తయారీ చేస్తారు. శ్రీకాళహస్తిలో రూ.915.43 కోట్ల పెట్టుబడి, పుంగనూరులో రూ.171.96కోట్లు పెట్టుబడి, మొత్తంగా రూ. 1087 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. ప్రత్యక్షంగా 2,350 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. డిసెంబర్‌2023 నాటికి ఫ్యాక్టరీ నిర్మాణ పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రామాయపట్నంలో అకార్డ్‌ గ్రూప్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం రూ. 10వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. కాపర్‌ కాథోడ్‌, కాపర్‌ రాడ్‌, సల్ఫూరిక్‌ యాసిడ్‌, సెలీనియం, ప్రత్యేక ఖనిజాల తయారీ చేస్తారు. దీని వల్ల ప్రత్యక్షంగా 2500 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. మే 2023లో ప్రారంభమై, జూన్‌ 2025 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జగన్‌ ప్రభుత్వం రాష్ట్రంలో బాక్సైట్‌ తవ్వకాలను నిషేదించిన నేపధ్యంలో తమ కంపెనీ ప్రణాళికలను మార్చుకున్న జేఎస్‌డబ్యూ అల్యూమినియం లిమిటెడ్‌ ఫ్యాక్టరీ కోసం ప్రెవేట్‌ వ్యక్తుల నుంచి సేకరించిన 985 ఎకరాల భూమిలో ఎంఎస్‌ఎంఈ పార్క్‌ ఏర్పాటుకు ప్రతిపాదించగా ఎస్‌ఐపీబీ ఆమోదించారు. కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో విండ్‌, సోలార్‌ పవర్‌ ప్రాజెక్ట్‌లు, 1000 మెగావాట్ల విండ్‌, 1000 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్ట్‌లను ఎకోరెన్‌ ఎనర్జీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఏర్పాటు చేయనుంది. నాలుగు విడతల్లో మొత్తంగా రూ.10,500 కోట్లపెట్టుబడి పెట్టనుండగా, 2వేలమందికి ఉద్యోగాలు లభిస్తాయి. దీనిని దశల వారీగా పూర్తిస్ధాయిలో మార్చి 2027 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి మెగావాట్‌ కు లక్ష రూపాయల చొప్పున రాష్ట్రానికి కంపెనీలు చెల్లిస్తున్నాయి. ఎస్జీఎస్టీ రూపంలో కూడా రాష్ట్రానికి రెవెన్యూ వస్తుంది. గ్రిడ్‌ బాధ్యతలు కూడా రాష్ట్రానికి లేవని, దీంతోపాటు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వస్తున్నాయని సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. భోగాపురంలో 90 ఎకరాల స్థలంలో ఐటీ పార్కు ఏర్పాటుకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలపగా, అత్యంత ఆధునిక సదుపాయాలతో ఐటీ పార్కు ఏర్పాటు కావాలని సీఎం ఆదేశించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మోడళ్లను పరిశీలించి ఆమేరకు ప్రణాళికలు రూపొందించుకోవాలని సీఎం సూచించారు.ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌, గుడివాడ అమర్నాథ్‌, కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, ఆదిమూలపు సురేష్‌, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img