Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

80 శాతం మిర్చి పంట నష్టం

కేంద్రమంత్రి తోమర్‌ అంగీకారం
న్యూదిల్లీ: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో మిర్చి పంట నష్టంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. తామర చీడ కారణంగా ఆ రెండు రాష్ట్రాల్లో మిర్చి పంట 40 నుంచి 80శాతం వరకు దెబ్బతిందని కేంద్ర వ్యవసాయశాఖమంత్రి నరేంద్రతోమర్‌ శుక్రవారం రాజ్యసభకు తెలిపారు. మిర్చి పంట నష్టాన్ని డైరెక్టరేట్‌ ఆఫ్‌ ప్లాంట్‌ ప్రొటెక్షన్‌, క్వారంటైన్‌, స్టోరేజ్‌(డీపీపీక్యూఎస్‌), ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చి(ఐకార్‌), ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన స్టేట్‌ అగ్రికల్చరల్‌/హార్టీ కల్చరల్‌ యూనివర్సిటీ, స్టేట్‌ హార్టికల్చరల్‌ డిపార్టుమెంట్‌ల నిపుణులతో కూడిన బృందం అంచనా వేసిందని మంత్రి తోమర్‌ తన లిఖితపూర్వక సమాధానంలో చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో సరాసరిన 40 నుంచి 80శాతం వరకు మిర్చి పంట నష్టపోయినట్లు ఉమ్మడి సర్వే గుర్తించినట్లు తెలిపారు. పంట వేసిన సమయంలో గల వాతావరణ పరిస్థితుల కారణంగా మిర్చి పంటకు చీడ పట్టినట్లు గుర్తించామన్నారు. దీనితోపాటు అధికంగా రసాయనాలు పిచికారి చేయడం కూడా పంట నష్టానికి కారణమని తెలిపారు. సాధారణంగా ఏపీ, తెలంగాణలో మిర్చి పంట అద్భుతంగా ఉంటుందని, అయితే, అననుకూల వాతావరణం, రైతులు అనుసరిస్తున్న విధానాలు మిర్చి పంటకు ఇబ్బంది కలిగించాయన్నారు. చీడ తగలడంతో ఎక్కువమంది రైతులు పంటను వదిలేశారని, దీంతో మిర్చిపంటపై పురుగు విలయతాండవం చేసిందని వివరించారు.
ఎన్నికల తర్వాత కనీస మద్దతు ధరపై కమిటీ
కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)పై కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి తోమర్‌ తెలిపారు. అయితే, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాతే ఆ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించిందని వెల్లడిరచారు. ఎంఎస్‌పీపై రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు తోమర్‌ సమాధానమిచ్చారు. పంటల వైవిధ్యం, నేచురల్‌ ఫామింగ్‌, కనీస మద్దతు ధరపై సమర్థవంతమైన, పారదర్శక కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారని, ప్రధాని ప్రకటనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. దీనిపై పరిశీలనలు జరుగుతున్నాయని, అయితే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటించడంతో ఎంఎస్‌పీపై కమిటీ ఏర్పాటు నిమిత్తం ఈసీకి లేఖ రాశామన్నారు. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాతే కమిటీని ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం సూచించిందని తోమర్‌ వెల్లడిరచారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీ ఇచ్చేలా పార్లమెంట్‌లో బిల్లు తీసుకొస్తారా?’అని బీజేడీ ఎంపీ ప్రసన్న ఆచార్య ప్రశ్నించారు. దీనికి తోమర్‌ సమాధానమిస్తూ.. పంటలకు కనీస మద్దతు ధర పెంచాలన్న స్వామినాథన్‌ కమిటీ ప్రతిపాదనను 2018-19లోనే మోదీ ప్రభుత్వం అంగీకరించిందని, గతంతో పోలిస్తే కనీస మద్దతు ధరను రెట్టింపు చేసిందని చెప్పారు. తాజా బడ్జెట్‌లోనూ పంట కొనుగోలు కోసం రూ.2.37లక్షల కోట్ల నిధులు కేటాయించిందన్నారు. దీనికి చట్టబద్ధ హామీ ఇవ్వాలా లేదా అన్న అంశాన్ని ఎంఎస్‌పీ కమిటీ పరిశీలించి ప్రతిపాదనలు చేస్తుందని వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img