Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

ఉద్యోగాల భర్తీలో కోత… నిరుద్యోగులకు వాత

. భారీగా తగ్గిన గ్రూప్‌ పోస్టులు
. 597 పోస్టులకే ఆర్థిక శాఖ ఆమోదం
. గ్రూప్‌1లో 89, గ్రూప్‌2లో 508తో సరి
. వయోపరిమితి పెంపు కోసం అభ్యర్థుల ఎదురు చూపు

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : నిరుద్యోగులను జగన్‌ సర్కారు మళ్లీ దెబ్బతీసింది. ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయబోయే గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 పోస్టుల్లో భారీ కోత విధించింది. తాజాగా గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 విభాగాల్లో మొత్తంగా 597 పోస్టుల భర్తీకిగాను ఆర్థికశాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఆయా పోస్టుల భర్తీ ప్రక్రియను ఏపీపీఎస్సీకి అప్పగించింది. ఇక ఏపీపీఎస్సీ నుంచి ప్రకటన రావడమే తరువాయి.
గ్రూప్‌ 1, 2 పోస్టుల భర్తీపై గతంలో సీఎంతో జరిగిన సమీక్షలో గ్రూప్‌2కు వెయ్యికుపైగా పోస్టులుంటాయని వెల్లడిరచారు. ఇదే విషయాన్ని ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ గత గ్రూప్‌1 (పాత నోటిఫికేషన్‌) తుది ఫలితాల విడుదల సమయంలో స్పష్టం చేశారు. తాజాగా ఆర్థికశాఖ ఆమోదించిన పోస్టుల సంఖ్య ఇందుకు విరుద్ధంగా ఉంది. గ్రూప్‌1కు కేవలం 89, గ్రూప్‌2కు 508 పోస్టులు మాత్రమే ఉన్నాయి. దీంతో నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత గ్రూప్‌1లో 16 శాఖలకు సంబంధించి మొత్తం 111 ఉద్యోగాల్ని ప్రకటించారు. అందులో 110 ఉద్యోగాల్ని భర్తీ చేయగా, స్పోర్ట్సు కోటాలో ఉన్న పోస్టును తర్వాత భర్తీచేస్తారు. ఈ 111 ఉద్యోగాల ప్రకటనకుగాను నిర్వహించిన గ్రూప్‌1 స్క్రీనింగ్‌ టెస్ట్‌కు 1,26,450 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వారిలో పరీక్షకు 86,494 మంది హాజరయ్యారు. వివిధ కారణాల వల్ల మిగిలిన వారు పరీక్ష రాయలేదు. గ్రూప్‌ 1 స్క్రీనింగ్‌లో కేవలం 6455 మంది మాత్రమే అర్హత సాధించారు.
పోస్టులు తక్కువ…పోటీ ఎక్కువ
నాలుగేళ్ల నుంచి ఉద్యోగ క్యాలెండరు సక్రమంగా లేదు. దీనివల్ల నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. త్వరలో భర్తీ చేయబోయే గ్రూప్‌1, గ్రూప్‌2 కలిపి 597 పోస్టులున్నాయి. దీంతో పోస్టులు తక్కువ, నిరుద్యోగుల నుంచి పోటీ ఎక్కువగా ఉంది. గత గ్రూప్‌1లోని 111 పోస్టులకుగాను 1,26,450 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఈ సారి గ్రూప్‌1 పోస్టులు అంతకంటే పెరిగి, కనీసం 200 అవుతాయని భావించారు. అయితే కేవలం 89 పోస్టులే ఉన్నాయి. పోటీ కూడా అదే రీతిలో ఉంటుంది. గట్టి పోటీ నెలకొనడంతో నిరుద్యోగులు మరింత ఒత్తిడికి గురవుతారు. గత గ్రూప్‌1లో అర్హత సాధించలేని వారు మళ్లీ పరీక్షకు సిద్ధమయ్యారు. రాబోయే గ్రూప్‌1లో రెవెన్యూ విభాగంలో అత్యధికంగా 33 పోస్టులున్నాయి. ఇందులో చీఫ్‌ కమర్షియల్‌ సేల్స్‌ ట్యాక్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ 18, రిజిస్ట్రార్‌ అండ్‌ స్టాంప్స్‌లో డిస్ట్రిక్ట్‌ రిజిస్ట్రార్‌ 3, చీఫ్‌ కమిషనర్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌లో డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులు 12 ఉన్నాయి. ఆ తర్వాత పోలీస్‌ విభాగంలో డీఎస్సీలు 25, డీఎస్పీ (జైళ్ల విభాగం (మెన్‌)) ఒక పోస్టు చొప్పున కేటాయించారు. రీజనల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌ 6, అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌ 6, కోఆపరేటివ్‌ సొసైటీలో డిప్యూటీ రిజిస్ట్రార్‌ పోస్టులు5, డిస్ట్రిక్‌ ఎంప్లాయీస్‌ మెంట్‌ ఆఫీసర్‌4, డిస్ట్రిక్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌3, డిస్ట్రిక్‌ రిజిస్ట్రార్‌3, అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌2 చొప్పున కేటాయించారు. డిస్ట్రిక్‌ ఫైర్‌ ఆఫీసర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ (గ్రేడ్‌2), అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెడెంట్‌, డిస్ట్రిక్‌ బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టులు ఒక్కొక్కటి ఉన్నాయి.
గ్రూప్‌-2లో ఏపీ సచివాలయ పోస్టులే అత్యధికం
రాబోయే గ్రూప్‌-2 పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో అత్యధిక పోస్టులున్నాయి. మొత్తం 508 గ్రూప్‌2 పోస్టుల్లో ఏపీ సచివాలయాల్లో 206 అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టుల్ని ప్రకటించారు. ఇందులో ఫెనాన్స్‌ విభాగంలో 23, జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌లో 161, లా విభాగంలో 12, శాసన సభ విభాగంలో 10 పోస్టులున్నాయి. ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్లు 156, ఆ తర్వాత డిప్యూటీ తహసీల్లార్‌ పోస్టులు 114 ఉన్నాయి. తక్కువ వయస్సులో ఈ పోస్టుల్ని కైవసం చేసుకున్న వారికి రెవెన్యూ శాఖలో పదోన్నతులకు అవకాశముంది. అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌18, సబ్‌ రిజిస్ట్రార్‌ (గ్రేడ్‌2)16, మున్సిపల్‌ కమిషనర్‌ (గ్రేడ్‌3)4 పోస్టుల చొప్పున భర్తీ చేయనున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో భాగంగా వయోపరిమితిని పెంచి, ప్రకటనలు జారీ చేస్తారనే ఆశతో 40 లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక ఒక్క గ్రామ, వార్డు సచివాలయ పోస్టులు మినహా, మిగిలిన శాఖల్లో భారీ భర్తీ ప్రకటనలు లేవు. టీచర్‌ పోస్టుల భర్తీకి ఏటా డీఎస్సీ ఇస్తామన్న హామీ అమలుకు నోచుకోలేదు. రాష్ట్రంలో దాదాపు 30వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు, 26వేల పోలీస్‌ విభాగం పోస్టులు ఖాళీలున్నట్లు సమాచారం. వాటితోపాటు గ్రామ, వార్డు సచివాలయాలు మరో 15వేలు, డిజిటల్‌ లెబ్రరీ పోస్టులు 10వేలకుపైగా ఉన్నాయి. కరోనాతోపాటు అనేక కారణాల రీత్యా కొన్నేళ్లుగా ఉద్యోగాల భర్తీని చేపట్టకపోవడంతో నిరుద్యోగుల వయస్సు మీరిపోయి, వారు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులుగా మారనున్నారు. దీనిని ప్రభుత్వం గుర్తించి ఏపీపీఎస్సీ, ఏపీ డీఎస్సీ తదితర ఉద్యోగాలకుగాను జనరల్‌ అభ్యర్థులకు వయోపరిమితిని 47 సంవత్సరాలకు పెంచి న్యాయం చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img