బీజేపీతో అన్నాడీఎంకే తెగదెంపులు
చెన్నై: త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ తమిళనాడులో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ నుంచి అన్నాడీఎంకే పార్టీ వైదొలిగింది. ఎన్‌డీఏ, బీజేపీతో సంబంధాలు తెంచుకుంటున్నట్టు స్పష్టమైన ప్రకటన చేసింది. దీంతో బీజేపీ నేతృత్వం లోని ఎన్‌డీఏ కూటమికి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది. నేటి నుంచి బీజేపీ, ఎన్‌డీఏ కూటమితో అన్ని సంబంధాలు తెంచుకోవాలని అన్నా డీఎంకే నిర్ణయించుకుంది. రాష్ట్ర పార్టీల పొత్తుతో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. అన్నాడీఎంకే పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షుల సమావేశం సోమవారం ఇక్కడ జరిగింది. బీజేపీ, ఎన్‌డీఏతో తెగదెంపులపై సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసింది. బీజేపీతో తెగదెంపులు చేసుకుంటున్నట్టు అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి కేపీ మునుస్వామి ప్రకటించారు. ఏడాదికాలంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం తమ పార్టీ కీలక నేతలు, తమ పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి, కార్యకర్తల గురించి అనవసర, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోందని విమర్శించారు. బీజేపీతో తెగదెంపులపై అన్నా డీఎంకే స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. ‘అన్నా డీఎంకే పార్టీతో పాటు ఆ పార్టీ నేతలు అన్నాదురై, జయలలిత పరువు, ప్రతిష్ఠను దిగజార్చేలా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉద్దేశపూర్వకంగా పదేపదే వ్యాఖ్యలు చేస్తోంది. దీంతో బీజేపీ, ఎన్‌డీఏ నుంచి బయటికి రావాలని నిర్ణయించుకున్నాం. రానున్న పార్లమెంటు ఎన్నికల కోసం రాష్ట్ర పార్టీలతో పొత్తు పెట్టుకుంటాం’ అని ఆ ప్రకటన తెలిపింది. కొంతకాలంగా తమిళనాడులోని బీజేపీ, అన్నాడీఎంకే నేతల మధ్య అనేక అంశాలపై తీవ్రస్థాయిలో విభేదాలు తలెత్తిన విషయం విదితమే. ఈ విభేదాలు తారస్థాయికి చేరడంతో అన్నాడీఎంకే తాజా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి, ద్రవిడ దిగ్గజం అన్నాదురైపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. 1956లో మదురైలో జరిగిన ఒక కార్యక్రమంలో అన్నాదురై హిందూ మతవిశ్వాసాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినట్లు అన్నామలై పేర్కొన్నారు. ఆ తర్వాత రెండు పార్టీల మధ్య మాటలయుద్ధం జరిగింది. వివాదాస్పద వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని అన్నాడీఎంకే డిమాండ్ చేయగా… అందుకు ఆయన నిరాకరించారు. తాను అన్నాదురై గురించి తప్పుగా మాట్లాడలేదని, 1956లో జరిగిన సంఘ టన గురించి మాత్రమే గుర్తుచేశానని చెప్పుకొచ్చారు. అన్నాదురై చేసిన వ్యాఖ్య లను స్వాతంత్య్ర సమరయోధుడు పసుంపోన్ ముత్తురామలింగ తేవర్ తీవ్రంగా వ్యతిరేకించారన్నారు. ఈ వ్యాఖ్యలతో రెండు పార్టీల మధ్య సంబంధాలు మరింత క్షీణించాjయి. ఈ పరిణామాలపై చర్చించడానికి అన్నాడీఎంకే పార్టీ సోమవారం ఇక్కడ సమావేశమైంది. ఎన్‌డీఏ కూటమి నుంచి బయటకు రావాలని సమావేశం నిర్ణయించింది. బీజేపీ వైఖరి కారణంగా తెగతెంపులు చేసుకుంటున్నట్లు ఆ పార్టీ నేత మునుస్వామి స్పష్టంచేశారు. 2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూటమి నుంచి వైదొలగడంతో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.