ఐదేళ్ల పాలనలో జగన్ ఆంధ్రప్రదేశ్ లోని విలువైన భూములను కొట్టేశాడని, వేల కోట్ల విలువైన భూములను కాజేశాడని టీడీపీ నేత దేవినేని ఉమ ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని దోచేశాడని మండిపడ్డారు. ఖరీదైన ప్రాంతాలలో వైసీపీ కార్యాలయాలకు, అస్మదీయులకు భూములు కేటాయించారని విమర్శించారు. చివరకు ప్రజాప్రయోజన కార్యక్రమాల కోసం కేటాయించిన భూములనూ వదల్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వ స్థలాల్లో భారీ రాజభవనాల నిర్మాణం వెనక క్విడ్ ప్రో కో జరిగిందని ఆరోపించారు. ఈ కేటాయింపులు కానీ, నిర్మాణాలకు సంబంధించిన వివరాలు కానీ రికార్డుల్లో ఎక్కడా కనిపించవని చెప్పారు. లెక్కల్లో చూపకుండా అందినకాడికి దండుకున్నారని మండిపడ్డారు. ఐదేళ్లలో జగన్ చేసిన ఈ భూ పందేరంపై సమగ్ర విచారణ జరిపి, చర్యలు తీసుకుని రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడాలని ప్రభుత్వానికి దేవినేని ఉమ విజ్ఞప్తి చేశారు.