Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

ఆదిత్య ప్రయోగం విజయవంతం

. 63 నిమిషాల 30 సెకన్లకు నిర్దిష్ఠ కక్ష్యలోకి
. ఎల్‌1 దిశగా మొదలైన 125 రోజుల ప్రయాణం

ప్రయాణం ఇలా..
పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌… ఆదిత్య-ఎల్‌1ను దిగువ భూ కక్ష్యలో ప్రవేశపెడుతుంది. ఆ తర్వాత దాన్ని మరింత దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి పంపుతారు. అనంతరం ఎల్‌1 బిందువు వైపు ఆదిత్య ప్రయాణిస్తుంది. ఈ క్రమంలో అది భూ గురుత్వాకర్షణ ప్రభావ ప్రాంతం (ఎస్‌వోఐ)ను దాటి వెళుతుంది. అనంతరం క్రూజ్‌ దశ ప్రారంభమవుతుంది. ఇలా నాలుగు నెలలు ప్రయాణించి ఎల్‌1 పాయింట్‌ను చేరుతుంది.

విశాలాంధ్ర - సూళ్లూరుపేట: ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌3 అందించిన ఉత్సాహంతో తొలి సౌర మిషన్‌గా ఆదిత్య ఎల్‌1ను భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) విజయవంతంగా ప్రయోగించింది. సూర్యుడి గురించి లోతైన అధ్యయనానికి ఆదిత్య మిషన్‌ దోహదమవుతుందని ఆకాంక్షిస్తోంది. సౌర తుపాన్లు, ప్లాస్మా, జ్వాలల విస్ఫోటాల గురించి మరింత సమాచారాన్ని సేకరించడం ద్వారా రోదసిలోని ఉపగ్రహాలు, వ్యోమనౌకలను రక్షించుకునే వీలు కలుగుతుందని భావిస్తోంది. ఇదే లక్ష్యంతో శనివారం ఉదయం 11.50గంటలకు ఆదిత్య ఎల్‌1ను ఆంధ్రప్రదేశ్‌, శ్రీహరికోటలోని సతీశ్‌ ధావస్‌ అంతరిక్ష కేంద్రం (షార్‌) నుంచి పీఎస్‌ఎల్వీ సీ57 ద్వారా నింగిలోకి పంపింది. ప్రయోగించిన 63 నిమిషాల 30 సెకన్ల తర్వాత మిషన్‌ను నిర్దిష్ట కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. సూర్యుని చుట్టూ వాతావరణ పరిస్థితులపై పరిశోధనలు జరపడమే ఆదిత్య మిషన్‌ లక్ష్యం. ఇందుకోసం ఏడు పేలోడ్‌లను అమర్చారు. 1475 కిలోల బరువు కలిగిన ఆదిత్య-ఎల్‌1 సూర్యుని చెంతకు చేరుకోవడానికి 1.5 మిలియన్ల కిలోమీటర్లు ప్రయాణించాలి. ఇందుకు 125 రోజులు పడుతుంది. ఇప్పటికే అమెరికా, జర్మనీ, యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీలు సౌరమిషన్లు చేపట్టాయి. ఆదిత్య ప్రయోగంతో ఆ దేశాల జాబితాలో భారత్‌ చేరింది. ఆదిత్యలోని ఏడు పేలోడ్‌లలో నాలుగు నేరుగా సూర్యునిపై పరిశోధనలు చేస్తాయి. మిగిలిన మూడు సౌర తుపాన్‌లు, రేణువులు, అయస్కాంత క్షేత్రాలను శోధిస్తాయి. ఆదిత్య ఎల్‌1 మిషన్‌ 16 రోజుల పాటు భూ కక్ష్యలో తిరుగుతుంది. భూమి చుట్టూ నాలుగుసార్లు తిరిగిన తరువాత సూర్యుని దశగా ప్రయాణం సాగిస్తుంది. అయితే ఆదిత్య-ఎల్‌1 డేటా ద్వారా సూర్యుడి పుట్టుక, తీరుతెన్నులు గురించి అర్థం చేసుకొనే వీలు కలుగుతుంది. ఇందులోని విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కరోనాగ్రాఫ్‌ (వీఈఎల్‌సీ) రోజుకు 1,440 చిత్రాలను భూమికి పంపుతుంది. ఈ లెక్కన నిమిషానికి ఒక ఫొటో తీస్తుంది. వీఈఎల్‌సీ బరువు 190 కిలోలు. అది ఐదేళ్లు పనిచేస్తుంది. వీఈఎల్‌సీ డేటా ఆధారంగా సూర్యుడిలో సీఎంఈని ఆటోమేటిక్‌గా గుర్తించేందుకు శాస్త్రవేత్తలు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారు. తద్వారా 24 గంటల్లో సంబంధిత వివరాలు అందుబాటులోకి వస్తాయి. వీఈఎల్‌సీని 40 భిన్న దర్పణాలు సూర్యుడి కరోనాకు సంబంధించి ఇతర వ్యోమనౌకల కంటే మెరుగైన చిత్రాలు తీయగలదు. ఆదిత్యఎల్‌1 విజయవంతంగా నిర్థిష్ఠ కక్ష్యకు చేరుకున్న సందర్భంగా ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ మాట్లాడుతూ ఇది మనందరి విజయమని అన్నారు. ఆదిత్య ఎల్‌1 ప్రయోగానికి ప్రాజెక్టు డైరెక్టర్‌ నిగార్‌ షాజీని అభినందించారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ మాట్లాడుతూ ఈ ప్రయోగం ఇస్రో చరిత్రలో మరో మైలురాయి అని అన్నారు. అంతరిక్ష రంగంలో వరుస విజయాలు ఇస్రో శాస్త్రవేత్తల కృషి ఫలితమని కొనియాడారు. సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దబ్బల శ్రీమంత్‌ రెడ్డి, చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయ చైర్మన్‌ దువ్వూరు బాలచంద్రారెడ్డి, శ్రీసిటీ అధినేత సన్నారెడ్డి రవీంద్రారెడ్డి, వైసీపీ పట్టణ అధ్యక్షులు కళ్ళత్తూరు శేఖర్‌ రెడ్డి, ఎంపీపీ అల్లూరు అనిల్‌ రెడ్డి, వైసీపీ నాయకులు కామిరెడ్డి రాజారెడ్డి, కళ్ళత్తూరు రామ్మోహన్‌ రెడ్డి తదితరులు ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img