Thursday, September 21, 2023
Thursday, September 21, 2023

పొత్తు పొడిచింది

. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ
. ఎన్డీఏ కూటమిలో ఉన్నా రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా నిర్ణయం
. సస్పెన్స్‌కు తెరదించిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌
. జగన్‌ అరాచక ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యమని స్పష్టీకరణ

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు ఉంటుందని ఇప్పటివరకు రాజకీయవర్గాల్లో కొనసాగుతున్న ఊహాగానాలకు ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ తెరదించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని అధికారికంగా ప్రకటించారు. రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో ఉన్న చంద్రబాబుతో ములాఖత్‌ అనంతరం పవన్‌ కల్యాణ్‌ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి బాలకృష్ణతో కలిసి గురువారం మీడియాతో మాట్లాడారు. 2024 ఎన్నికల పొత్తులపై పవన్‌ స్పష్టతనిచ్చారు. ‘నాలుగున్నర సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన కొనసాగుతోంది. అందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అక్రమ కేసులు పెట్టి రిమాండుకు పంపించారు. వారికి సంఫీుభావం ప్రకటించడానికి ఇక్కడకు వచ్చాను. చంద్రబాబుతో గతంలో విభేదించి విడిగా పోటీ చేశాను. రాజకీయాల్లో జనసేన తరపు నుంచి నేను తీసుకున్న నిర్ణయం రాష్ట్రం బాగుండాలనుకుంటున్నా. దేశ సమగ్రత బలంగా ఉండాలనుకున్నా. జనసేన ఏర్పాటు చేసినప్పుడు కూడా అడ్డగోలుగా రాష్ట్ర విభజన జరిగిందని చెప్పాను. సగటు మనిషి ఆవేదన గురించి మాట్లాడాను. ఆ రోజు నుంచి నేను తీసుకున్న నిర్ణయాలు చాలామందికి ఇబ్బందిగా మారాయి’ అని పవన్‌ వివరించారు. ‘నేను 2014లో నరేంద్రమోదీకి మద్దతు తెలిపిన సమయంలో ఆయన సొంత పార్టీ వ్యక్తులే ఆయన ప్రధాని కాకూడదని అనుకున్నారు. దక్షిణ భారతదేశం నుంచి నేను మోదీకి మద్దతు తెలిపాను. ఈ రోజున నేను నా మనసును ఆవిష్కరిస్తున్నాను. దేశానికి చాలా బలమైన నాయకుడు కావాలి. మా నాన్న అస్థికలు కాశీలో కలపడానికి వెళ్లినప్పుడు ముంబైలో ఉగ్రవాదులు తాజ్‌ హోటల్‌పై దాడి చేశారు. అంతకముందు పార్లమెంటుపై దాడి జరిగింది. అప్పుడు నరేంద్ర మోదీకి మద్దతు తెలిపినప్పుడు చాలా మంది వ్యతిరేకించారు. అయితే నరేంద్రమోదీ పిలిస్తే తప్ప నేను ఆయన దగ్గరకు వెళ్లలేదు’ అని పవన్‌ అన్నారు. ‘2014లో బీజేపీ, టీడీపీతో కలిసి పోటీ చేయడానికి గల కారణం విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరగడం కోసం. ఆంధ్రప్రదేశ్‌కు చాలా అనుభవం ఉన్న నాయకుడు కావాలని భావించా. 2020 విజన్‌ గురించి మాట్లాడినప్పుడు ఎవరికీ అర్థం కాలేదు. ఇవాళ లక్షలాది మంది మాదాపూర్‌ వంటి ఐటీ ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్నారు. ఆయనతో ప్రత్యేక హోదా విషయంలో మాత్రమే విభేదించా. వ్యక్తిగతంగా ఏనాడూ ఘర్షణ లేదు. రూ.300 కోట్ల స్కామ్‌ పేరు చెప్పి మాజీ సీఎంకు అవినీతి మరక అంటగడుతున్నారు. గుజరాత్‌లో ప్రారంభమైన కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చారు. అది హార్డ్‌వేర్‌ను సరఫరా చేస్తుంది. ఏదైనా తప్పు జరిగితే ఆ సంబంధిత వ్యక్తులను విచారించాలి. సైబరాబాద్‌ వంటి సిటీని నిర్మించిన వ్యక్తిని ఇలాంటి కేసులో ఇరికించడం బాధాకరం. ఈడీ విచారించాల్సిన ఇలాంటి కేసులను రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి తీసుకుంది. పోనీ అభియోగాలు మోపిన వ్యక్తి ఏమైనా మహానుభావుడా. ఇతనేమన్నా వాజ్‌పేయినా? లాల్‌ బహదూర్‌ శాస్త్రినా? అతనే ఈడీ కేసులు ఎదుర్కొంటున్నాడు. దేశం విడిచి వెళ్లాలంటే కోర్టుల అనుమతి తీసుకుంటున్నాడు. రాజ్యాంగ ఉల్లంఘనలు చేసే వ్యక్తి. అందరినీ భయభ్రాంతులకు గురిచేసే వ్యక్తి. డేటా చౌర్యం జరుగుతోందని వాపోయిన వ్యక్తి. ఇవాళ వలంటీరు వ్యవస్థను అడ్డం పెట్టుకుని అదే పని చేస్తున్నాడు. అడ్డగోలు హామీలిచ్చి వేటినీ అమలు చేయలేదు. అడ్డగోలు దోపిడీ చేస్తున్నారు. మద్యం విషయంలోనే కోట్లు జేబుల్లో వేసుకుంటున్నాడు. రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి ప్రశ్నించడానికే వీలులేకుండా పోయింది.
ఎవరైనా ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారు. నాలాంటి వ్యక్తులనే ఏపీ సరిహద్దుల్లో ఆపేస్తున్నారు. అలా ఆపే హక్కు ఎవరికీ లేదు. వ్యతిరేక ఓటు చీలనివ్వనని 2021లోనే చెప్పాను. అందుకే 30 సంవత్సరాలు అధికారంలో ఉండాలని కలగన్న వ్యక్తిలో ఉలికిపాటు మొదలైంది’ అని విమర్శించారు.
జగన్‌ అరాచక, దుర్మార్గ పాలనను అంతమొందించేందుకు ఇకపై టీడీపీతో కలిసి పోరాడుతామని స్పష్టం చేశారు. ఇందుకోసం త్వరలో రెండు పార్టీల నేతలతో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకుంటామని వెల్లడిరచారు. మీడియా సమావేశం అనంతరం లోకేశ్‌ క్యాంపు కార్యాలయంలో ఉన్న చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని పరామర్శించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img