ఏప్రిల్ నుంచి రూ.40,500 కోట్లకు చేరిక
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం అప్పులను క్రమక్రమంగా పెంచుకుంటూ పోతోంది. ఇప్పటికే వేల కోట్లు అప్పులు చేసిన ప్రభుత్వం తాజాగా మంగళవారం మరో రెండు వేల కోట్లు అప్పు తీసుకొచ్చింది. సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రిజర్వ్ బ్యాంక్‌లో అప్పు తీసుకుంది. వీటిలో రూ.వెయ్యి కోట్లు 15 సంవత్సరాలకు 7.48 శాతం వడ్డీతో చెల్లించే విధంగా మరో వెయ్యి కోట్లు 7.46 శాతం వడ్డీతో 18 సంవత్సరాలకు చెల్లింపులు చేసే ఒప్పందంపై రుణం తీసుకుంది. ఈ 2 వేల కోట్ల రూపాయలతో ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితుల కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు రూ.40, 500 కోట్లకు చేరింది.
ఇవి కాకుండా కార్పొరేషన్‌ల ద్వారా మరో రూ.20 వేల కోట్లు అప్పు తెచ్చింది. ఉపాధ్యాయులు, పెన్షనర్లతో పాటు వివిధ శాఖల్లోని ఉద్యోగులకు 10వ తేదీ దాటినా ఇంకా చాలా మందికి జీతాలు, పెన్షన్లు చెల్లించని పరిస్థితి నెలకొంది.