సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు, అధికారులు
వచ్చే మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు
భారీ వర్షాల కారణంగా విజయవాడలో ఇటీవల కొండచరియలు విరిగిపడి ఐదుగురు మరణించిన ఘటన మర్చిపోకముందే మరోమారు అలాంటి ఘటనే జరిగింది. మాచవరం వద్ద కొండచరియలు విరిగిపడడంతో ఓ వ్యక్తి మరణించగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి నిన్న సాయంత్రం ఒడిశాలోని పూరి వద్ద తీరం దాటింది. ఇది చత్తీస్‌గఢ్ దిశగా పయనించి క్రమంగా బలహీనపడుతుందని భారత వాతావరణశాఖ తెలిపింది. ఈ ప్రభావంతో వచ్చే మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీచేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విశాఖపట్టణం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అల్లూరి జిల్లా జీకేవీధి మండలం చట్రాయిపల్లి వద్ద కొండచరియలు విరిగిపడి ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు గల్లంతయినట్టు తెలుస్తోంది.