ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ఈరోజు జరగనుంది. ఈ సమావేశానికి మంత్రులందరూ హాజరుకానున్నారు. ఎన్నికల హామీలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై కేబినెట్ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. సూపర్ సిక్స్ లోని కొన్ని పథకాలపై లోతుగా చర్చించే అవకాశాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో… ప్రభుత్వంపై ప్రజల స్పందన ఎలా ఉందనే దానిపై కూడా చర్చించవచ్చని సమాచారం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఇప్పటి వరకు విడుదల చేసిన శ్వేతపత్రాలు, విడుదల చేయబోతున్న శ్వేతపత్రాలపై చర్చ జరుపుతారు. మరోవైపు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ధరణి, వ్యవసాయం, ప్రజాపాలన, వాతావరణ పరిస్థితులు, సీజనల్ వ్యాధులు, ఆరోగ్యం, వన మహోత్సవం, విద్య, మహిళా శక్తి, డ్రగ్స్, శాంతి భద్రతలు వంటి అంశాలపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు.