పింఛన్ల పంపిణీలో కీలక మార్పు దిశగా ఏపీలోని కూటమి సర్కార్ అడుగులేస్తోంది. ఈ మేరకు తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా సామాజిక పింఛన్ల పంపిణీలో జరుగుతున్న అవకతవకలకు ఆస్కారం లేకుండా సరికొత్త పధ్ధతితో ముందుకు వస్తోంది. దీనిలో భాగంగా ప్రభుత్వం అత్యాధునిక ఎల్ ఆర్‌డీ (రిజిస్టర్డ్) ఫింగర్‌ప్రింట్ స్కానర్లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దీనికోసం రూ. 53కోట్లను గ్రామ, వార్డు సచివాలయ శాఖకు కేటాయించింది. దీంతో ఏపీ సర్వీసెస్ టెక్నాలజీ ద్వారా డివైజ్‌ల కొనుగోలుకు రాష్ట్ర సచివాలయాల శాఖ టెండర్లు ఆహ్వానించింది. అక్టోబర్ నుంచి 1.34లక్షల కొత్త స్కానర్లతో పింఛన్ల పంపిణీ జరగనుంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఎల్ఓ ఆర్‌డీ స్కానర్లలో సెక్యూరిటీ పరంగా లోపాలు ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో నకిలీ వేలి ముద్రలను ఉపయోగించి పింఛన్లు స్వాహా చేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకే కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇక పింఛన్ల బదిలీ కోసం ప్రభుత్వం సంబంధిత వెబ్‌సైట్‌లో ప్రత్యేక ఆప్షన్‌ను తీసుకొచ్చింది. రాష్ట్రంలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పింఛన్ బదిలీ కోసం దఖాస్తుదారులు గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లాల్సి ఉంటుంది.
అక్కడ పింఛన్ ఐడీ, ఏ ప్రాంతానికి బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ జిల్లా, మండలం, సచివాలయం వివరాలు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ ఇవ్వాలి. ఇలా చేయడం ద్వారా స్వగ్రామాలకు రాలేనివారు తాము ఉంటున్న ప్రాంతాల్లోనే పింఛన్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది.