. రాజమహేంద్రవరం జైలుకు అవసరం లేదు
. రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు
. 30న ఏసీబీ కోర్టుకు హాజరుకావాలి
. స్కిల్ కేసులో హైకోర్టు తీర్పు
విశాలాంధ్ర బ్యూరో ` అమరావతి : స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు బెయిల్ మంజూరైంది. చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ టి.మల్లికార్జున్‌రావు సోమవారం తీర్పు వెల్లడిరచారు. ఈ కేసులో సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. జ్యుడీషియల్ రిమాండ్ మీద 52 రోజుల పాటు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆరోగ్య కారణాలతో మానవతా కోణంలో ఏపీ హైకోర్టు చంద్రబాబుకి అక్టోబర్ 31వ తేదీన నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. రెగ్యులర్ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా, గురువారం వాదనలు ముగియడంతో తీర్పును ఉన్నత న్యాయస్థానం రిజర్వు చేసింది. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్, సీఐడీ తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఈ నెల 28న చంద్రబాబు రాజమహేంద్రవరం జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని, గతంలో ఉన్న ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు జస్టిస్ మల్లికార్జున్‌రావు తెలిపారు. రాజకీయ కార్యక్రమాల్లో యధాతథంగా పాల్గొనవచ్చునని వెల్లడిరచారు. అయితే ఈ నెల 30న ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరుకావాలని ఆదేశించారు. మొత్తం 39 పేజీలతో కూడిన తీర్పులో న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. స్కిల్ కేసు 2021లో ప్రారంభం కాగా అప్పటి నుంచి చంద్రబాబు ఈ కేసులో జోక్యం చేసుకున్నట్లుగానీ, రికార్డులు టాంపర్ చేసినట్లుగానీ ప్రాసిక్యూషన్ నిరూపించలేదన్నారు. సబ్ కాంట్రాక్టర్ పన్ను ఎగవేస్తే, చంద్రబాబుకు ఏం సంబంధమని న్యాయవాది లూథ్రా చేసిన వాదనతో ఏకీభవిస్తున్నామని, చంద్రబాబుకు ఈ కాంట్రాక్టులో ఉల్లంఘనలు ఉన్నాయని అధికారులు చెప్పారన్న అంశానికి సాక్ష్యాలు లేవన్నారు. ఈ కేసులో ఇప్పటికే 149 మంది సాక్షులను విచారించి 4 వేల పేజీల డాక్యుమెంట్లు సేకరించినట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది. ఇప్పటికీ ఈ డాక్యుమెంట్లు సీఐడీ అధీనంలో ఉండటంతో చంద్రబాబు వీటిని ట్యాంపర్ చేసే అవకాశం లేదని, జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న చంద్రబాబు పారిపోయే అవకాశం అంతకన్నా లేదని పేర్కొన్నారు. సాక్షులను చంద్రబాబు ప్రభావితం చేస్తున్నారని సీఐడీ తరపు న్యాయవాదులు చేసిన వాదనలకు ఆధారాలు లేవని, స్కిల్ కేసులో సుజయత్ ఖాన్ ఇచ్చిన వాంగ్మూలంలో చంద్రబాబు పాత్ర ఉన్నట్లు ప్రాథమిక సాక్ష్యాలు కూడా లేవని జస్టిస్ మల్లికార్జున్‌రావు వెల్లడిరచారు. మాజీ పీఎ పెండ్యాల శ్రీనివాస్ గైర్హాజరుకు, చంద్రబాబు బెయిల్ పరిశీలనకు సంబంధం లేదని స్పష్టంచేశారు. చంద్రబాబుకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ నేపథ్యంలో హైదరాబాద్‌లో నమోదైన కేసులో బెయిల్ షరతులు ఉల్లంఘించినట్లుగా పరిగణించడం లేదన్నారు. స్కిల్ కేసులో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లినట్లు సీఐడీ ఎటువంటి ఆధారాలు చూపించలేక పోయిందని, నిధులు విడుదల చేయమన్నంత మాత్రాన నేరంలో పాత్ర ఉందని చెప్పలేమని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు తప్పు చేసినట్లు ఇన్‌కంటాక్స్ డిపార్టుమెంట్ ఆరోపణలు చేసింది కానీ ఆధారాలు చూపలేకపోయిందని, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఉన్నది నిజమని, రెండు లక్షల మందికి శిక్షణ ఇచ్చినట్లు సీఐడీ అంగీకరించిందని గుర్తుచేశారు. టీడీపీ ఖాతాకు స్కిల్ స్కామ్ డబ్బులు వచ్చాయని సీఐడీ ఆరోపణలు చేసినప్పటికీ ఆధారాలు చూపించలేకపోయిందని జస్టిస్ మల్లికార్జున్‌రావు వెల్లడిరచారు.