Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

చంద్రమండలంపైనా బీజేపీ మతప్రచారం

చంద్రయాన్‌`3 దిగిన స్థలానికి శివశక్తిగా నామకరణం
ఇస్రో కేంద్రకార్యాలయానికి మోదీ
శాస్త్రవేత్తలకు అభినందనలు

బెంగళూరు : భూమి చాలక చంద్రమండలాన్ని కూడా మత ప్రచారానికి బీజేపీ వాడుకుంటోంది. ప్రతి దానికి మతాన్ని ఆపాదించే బుద్ధి పోనిచ్చుకోని ప్రధాని మోదీ తాజాగా అంతరిక్ష రంగంలో సాధించిన పురోగతికి మతం రంగు పులిమారు. చంద్రయాన్‌3 దిగిన చంద్రుడిపై స్థలానికి ‘శివశక్తి’ అని పేరు పెట్టారు. మనవాళి సంక్షేమానికి, శక్తికి శివుడు ప్రతీక కాబట్టే ఆ పేరు పెట్టానని వివరణ ఇచ్చుకున్నారు. చంద్రుడిపై శివశక్తి పాయింట్‌తో హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు అనుబంధం ఏర్పడుతుందని చెప్పారు. చంద్రయాన్‌ అడుగు పెట్టిన ప్రాంతానికి పేరు పెట్టడం శాస్త్రీయ ఆనవాయితీ అని మోదీ తెలిపారు. 2019లో చంద్రయాన్‌2 ల్యాండర్‌ కూలిన ప్రాంతాన్ని ‘తిరంగా పాయింట్‌’ అని వ్యవహరించాలని అన్నారు. సాధించాలన్న పట్టుదల ఉంటే విజయం తథ్యమని, ఏ వైఫల్యం శాశ్వతం కాదని నొక్కిచెప్పారు. చంద్రయాన్‌ విజయవంతమైన చరిత్రాత్మక ఘట్టానికి గుర్తుగా ఏటా ఆగస్టు 23 జాతీయ అంతరిక్ష దినంగా జరుపుకోవాలని ప్రకటించారు. 21వ శతాబ్దం టెక్నాలజీ యుగమని, శాస్త్రీయ సాంకేతిక రంగంలో మరింతగా ముందుకెళ్లేందుకు దోహదమవుతుందని చెప్పారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ నిలవాలన్న కల సాకారానికి ఈ పురోగతి చోదకశక్తిగా పనిచేస్తుందన్నారు. నేడు ప్రతి పిల్లవాడికి చంద్రయాన్‌ గురించి తెలుసునని, ప్రపంచమంతటా చంద్రయాన్‌ పేరు మారుమ్రోగుతోందని మోదీ అన్నారు. భాతర పురాణాల్లోని అంతరిక్ష ఫార్ములాలను శాస్త్రీయపరంగా రుజువు చేసేందుకు నవతరం ముందుకు రావాలని మోదీ సూచించారు. మన వారసత్వానికి, సైన్స్‌కు ఇలా చేయడం ముఖ్యం, ఒకరకంగా ఇది స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులపై రెట్టింపు బాధ్యత అని ఆయన అన్నారు. మరుగున పడిన భారతీయ శాస్త్రీయ పరిజానాన్ని మరిన్ని పరిశోధనల ద్వారా ప్రపంచానికి చాటాలని మోదీ పిలుపునిచ్చారు. గ్రీస్‌ రాజధాని ఏథేన్స్‌ నుంచి నేరుగా బెంగళూరుకు శనివారం ఉదయం చేరుకున్న ప్రధాని… ఇస్రో శాస్త్రవేత్తలను కలిసి లూనార్‌ మిషన్‌ విజయానికిగాను అభినందించారు. చంద్రుడిపై ల్యాండర్‌ విక్రమ్‌ దిగిన స్థలానికి శివశక్తి పాయింట్‌గా పేరు పెట్టాలని ప్రతిపాదన చేశారు. భారత అంతరిక్ష కార్యక్రమంలో చంద్రయాన్‌3 అసాధారణ ఘట్టమని చెబుతూ కాస్త భావోద్వేగానికీ గురయ్యారు. ఎప్పుడెప్పుడు వెళ్లాలా... అందరినీ అభినందించాలా అని ఆత్రుతగా ఎదురుచూశానని చెప్పారు. ఇస్రో శాస్త్రవేత్తల నిబద్ధతకు, ధైర్యానికి, పట్టుదలకు, ఫ్యాషన్‌కు సెల్యూట్‌ చేస్తున్నానన్నారు. భారత్‌ గర్వంగా చంద్రుడిపైకి చేరుకుందని బరువైన గొంతుకతో మాట్లాడారు. చంద్రయాన్‌3 మిషన్‌లో మహిళా శాస్త్రవేత్తల తోడ్పాటును శ్లాఘించారు. మిషన్‌లో నారీశక్తిది ప్రధానపాత్ర అని మోదీ అన్నారు. అంతకుముందు హాల్‌ విమానాశ్రయం వద్ద మోదీకి ఘనస్వాగతం లభించింది. అక్కడ నుంచి ఆయన రోడ్‌షోగా ఐఎస్‌టీఆర్‌ఏసిక చేరుకున్నారు. రోడ్డుకు రెండు వైపులా జనం నిలుచొని జాతీయ జెండాలు ఊపుతూ మోదీకి స్వాగతం పలికారు. ఐఎస్‌టీఆర్‌ఏసీలో ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ ఆయనకు చంద్రయాన్‌`3 మిషన్‌ పురోగతి గురించి వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img